• HOME
  • ఆహ్లాదం
  • శాంతి, సద్భావనల లక్ష్యంగా... అంతర్జాతీయ యోగా దినోత్సవం

 

పతంజలి మహర్షి ప్రపంచానికి అందించిన గొప్ప వరాల్లో యోగా ఒకటి. యోగా శారీరక, మానసిక సమస్యలకు చక్కని పరిష్కారం. మనిషి ఆలోచన, ప్రవర్తన, అంతర్దృష్టి, జీవనశైలిని విశేషంగా ప్రభావితం చేసే ఉత్ప్రేరకం యోగా. యుజ్ అనే సంసృత ధాతువు నుంచి యోగా అనే పదం పుట్టింది. యుజ్ అంటే అనుసంధానించేదని అర్థం. శరీరం, మనసు, ఆత్మలను అనుసంధానించే యోగా ప్రయోజనాల గురించి తెలిసేకొద్దీ యోగాతో బాటు మనదేశానికి ఒక విశిష్ట గుర్తింపు, గౌరవం వచ్చాయి. యోగా గొప్పదనాన్నిమిగతా ప్రపంచం త్వరగానే అర్థం చేసుకున్నా దానిని గుర్తించేందుకు మాత్రం కాస్త ఎక్కువ సమయమే పట్టిందనే చెప్పాలి. అయితే 2014 డిసెంబర్ 11న జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొన్న మొత్తం 175 దేశాలు ఏకగ్రీవంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించటంతో యోగాకు ప్రపంచ గుర్తింపు లభించినట్లయింది.

 

పతంజలి మహర్షి ప్రతిపాదించిన యోగా శాస్త్రం 8 విభాగాలుగా విభజించబడింది. ఈ అష్టాంగ మార్గంలోని నియమాలు, వాటి అర్థాలు తెలుసుకుందాం.

1) యమము : ఇందులో 5 సార్వజనీన సూత్రాల ప్రస్తావన ఉంది. అవి.

అ) అహింస: మనసుతో, మాటతో, ఏదైనా పని వల్ల నైనా మరో ప్రాణికి ఇబ్బంది కలిగించకపోవటం

ఆ) సత్యం: నిజం మాత్రమే మాట్లాడటం

ఇ) అస్థేయం: అనుమతి లేకుండా మరొకరి సొత్తును తీసుకోవటం

ఈ) బ్రహ్మచర్యం: ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండుట

ఉ) అపరిగ్రహం: దొంగతనం చేయకుండుట, ఉన్నదానితో తృప్తిగా జీవించుట

 

2) నియమము: సమాజంలోని ఇతరులతో సామరస్యపూర్వకంగా జీవించేందుకు తోడ్పడే మరో 5 నియమాలను ఇందులో ప్రస్తావించారు. అవి..

అ) శౌచము: బాహ్య, అంతః శుద్ధిని కలిగి ఉండుట

ఆ) సంతోషము: విచారాన్ని దరిజేరనీయక, ఎప్పుడూ ఆనందంగా జీవించుట

ఇ ) తపము: భవబంధాల, వాతావరణ, మనోవికారాల ప్రభావం నుంచి తప్పించుట

ఈ) స్వాధ్యాయము: 'నేను' ఎవరనే ప్రశ్న వేసుకోవటం, ఈ పరమ సత్య అన్వేషణలో సాధుసంతుల సాంగత్యాన్ని కోరుకోవటం, వాఙ్మయాన్ని అధ్యయనం చేయటం

ఉ) ఈశ్వర ప్రణిదానం: నిష్కామ భావన(ఏమీ ఆశించకపోవటం)తో ఈశ్వరుని ఆశ్రయించటం, తనను తాను అర్పించుకోవటం

3) ఆసనము: స్థిరంగా, సుఖంగా, నిశ్చలంగా శరీరాన్ని నిలపటమే ఆసనం.

4) ప్రాణాయామం: శ్వాసను అదుపు చేయటం

5) ప్రత్యాహ: జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను బయటి ప్రభావాల నుంచి విముక్తం చేయటం

6) ధారణ: మనసును కేంద్రీకరించటం

7) ధ్యానం: తదేకంగా మనసును కేంద్రీకరించటం

8) సమాధి: అష్టాంగ మార్గంలో చివరి నియమమిది. అనుభవ పూర్వకంగా మాత్రమే దీనిని తెలుసుకోగలము. జీవాత్మ, పరమాత్మల అనుసంధానమే సమాధి.

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE