ఇటీవలి కాలంలో పట్టణ, నగర వాసులూ ఇంట్లోనే కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. మొక్కల పెంపకానికి అనువైన రీతిలోగ్రీన్ అపార్ట్మెంట్ ల నిర్మాణం జరగటం,ప్రసార మాధ్యమాల కృషి కారణంగా ఆరోగ్యపరమైన సృహ, డబ్బు ఖర్చు పెడుతున్నా తాజా కూరగాయలు లభించకపోవటం, లభించినా వాటిపై పురుగుమందుల అవశేషాలు అధికం కావటంవంటి ఎన్నో కారణాల వల్ల ఇంట్లోనే తాజా కూరగాయలు, ఆకుకూరలు పండించే నగరవాసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇంట్లో కూరగాయలను పండించాలనే ఆసక్తి, కొద్దిపాటి అవగాహన, రవ్వంత సృజనాత్మకత ఉంటే ప్లాస్టిక్ ట్రేలు, సిమెంట్ కుండీలు, మట్టి కుండీలు, పగిలిన బక్కెట్లు, తాగిపారేసే కోక్ టిన్లు, పెద్ద సైజు డ్రమ్ముల్లోనూకూరగాయల సాగును విజయవంతంగా చేపట్టవచ్చు.ఈ నేపథ్యంలో మనమూ ఈ అంశానికి సంబంధించిన అంశాలను తెలుసుకుని కూరగాయల సాగు దిశగా అడుగులేద్దాం.

 • వాడని ప్లాస్టిక్ ట్రేలో 2 చిల్లులు పెట్టిన పాలిథిన్ పేపర్ పరచాలి. దీనివల్ల ఎక్కువైన నీరు కింది రంధ్రాల గుండా బయటకు పోతుంది. ఇప్పుడు ఈ పాలిథిన్ పేపర్ 2 అంగుళాల ఎత్తున మెత్తని నల్లరేగడి మట్టి పోసి దానిపై మరో 2 అంగుళాల మేర వర్మీ కంపోస్టు వేయాలి. మట్టి, కంపోస్టు కలిసేలా ఒకసారి ట్రే ను ఒకసారి కదిలించి ఇందులో పాలకూర, చుక్కకూర, తోటకూర వంటి విత్తనాలను ఒక్కో ట్రే లో ఒక్కోరకం చొప్పున చల్లుకొని తేలికగా నీరు చిలకరించి ఓ మాదిరి ఎండతగిలే చోట పెట్టాలి. ఈ ట్రేలలో గోధుమ గడ్డిని కూడా పెంచవచ్చు. కుండీలో మట్టి బాగా తడిగా ఉంటే ఆ రోజుకు నీరు పోయరాదు.
 • పాత ఇనుప బకెట్లు, రేకు డబ్బాలలో మొక్కలు పెంచేవారు అందులో రంధ్రం చేసి ప్లాస్టిక్ షీట్ పరచి 3 అంగుళాల మేర మట్టి పోసి దానిపై 2 అంగుళాల మేర కంపోస్టు మిశ్రమం చల్లాలి. అడుగున ఉండే రంధ్రం పూడిపోకుండా గుప్పెడు పెంకు ముక్కలు, సన్న రాళ్లు కూడా మట్టిలో వేయాలి. వంకాయ, బెండ,ఉల్లి, పచ్చిమిరప, గోంగూర వంటి మొక్కలు ఇలాంటి కుండీల్లో పెంచేందుకు అనువుగా ఉంటాయి.
 • ఇంటి పైకప్పు మీద కూరగాయలు పెంచాలంటే మడి విస్తీర్ణం మేరకు ప్లాస్టిక్ షీట్ పరచి 1 అడుగు ఎత్తున మట్టి, కంపోస్టు మిశ్రమాన్ని పోసి విత్తనాలు చల్లాలి. మట్టి కదిలిపోకుండా నాలుగువైపులా ఇటుకలు పెట్టి లోపలివైపుఎండుగడ్డి పొరగా వేసుకోవాలి. ఆ విత్తనాలపై మరో అంగుళం ఎత్తున కంపోస్టు లేదా మట్టి, కంపోస్టు మిశ్రమం చల్లాలి. మొక్కలకు కనీసం 5,6 గంటల పాటు ఎండ తగిలేలా చూసుకోవాలి. ఇదేవిధంగా పాత వెదురు బుట్టలు, చెక్క పెట్టెలు, అట్టపెట్టెల్లో సైతం పెద్దసైజులో పెరిగే కూరగాయల మొక్కలు, పూలమొక్కలుపెంచుకోవచ్చు.

 

సస్య రక్షణ

 • కూరగాయ మొక్కలను ఆశించే చీడపీడల నివారణకు 2 వారాలకోసారి 5 లీటర్ల నీటిలో అర లీటరు పంచగవ్య మిశ్రమం కలిపి తగుమాత్రంగా పిచికారి చేయాలి. పురుగు ఆశించిన ఆకులు, రెమ్మలు తుంచి పారేయాలి.
 • పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి సమపాళ్ళలో తీసుకొని నూరి నీటితో కలిపి మొక్కలపై చల్లితే చీడపీడలను నివారించవచ్చు.
 • వేప, సీతాఫలం, వావిలి ఆకులను కలిపిమెత్తగా నూరి, రసం తీసి, వడపోసిన తర్వాత అంతకు 20 రెట్లు నీటిలో కలిపి లేదా వీటిని ఉడికించి చల్లారిన తర్వాత మొక్కలపై చల్లుకోవచ్చు.
 • వేపగింజల పిండి, కానుగ పిండి, సీతాఫల గింజల పిండి కలిపి చల్లితే చీడ పీడలను నివారించుకోవచ్చు.
 • వేప నూనె చల్లటం లేదా పుల్లమజ్జిగలో దంపుడు పసుపు కలిపి మొక్కలపై చల్లటం ద్వారా చీడ పీడలను అరికట్టవచ్చు.
 • 15 రోజులకొకసారి పచ్చి మిర్చిలేదా వెల్లుల్లిని దంచి కిరోసిన్ లో ఒక రాత్రి నానబెట్టి నీటిలో కలిపి చల్లితే చీడ పీడలు ఆశించవు.

ఇతర అంశాలు

 • ఆకుకూరలను ఏడాదిపొడవునాపండించుకోవచ్చు. ఇవి నెలరోజుల్లో ఎదిగి కోతకు రావటమే గాక మళ్ళీ మళ్ళీ చిగురిస్తాయి. ఆకుకూరలైనా లేక కూరగాయాలైనా ఒకేసారి కాకుండా వారం వ్యవధితో 4 డబ్బాల్లో చల్లుకుంటే ఒక్కోవారం ఒక్కో డబ్బాలో నుంచి తాజా కాయగూరలు సేకరించుకోవచ్చు.
 • నిమ్మ, నారింజ, బత్తాయి, మామిడి పండ్ల జాతి బోన్సాయ్  మొక్కలు పెంచుకోవటం ద్వారా ఇంట్లోనే పండ్ల సాగు చేసుకోవచ్చు.
 • నాణ్యమైన విత్తనాలు,ఎరువు వాడే విషయంలో రాజీ పడకూడదు. 

అదనపు ప్రయోజనాలు

 • సాధారణ పద్దతిలో పెంచే మొక్కల కంటే కుండీల్లో పెంచే మొక్కలు త్వరగా ఎదిగటమే గాక 3 రెట్లు అదనంగా ఫలసాయాన్ని ఇస్తాయి.
 • ఇలా పెంచే మొక్కలకు కొద్దిపాటి నీరు, ఎరువు ఉంటే చాలు. కలుపు మొక్కల బెడద కూడా ఉండదు.
 • ప్రకృతి హితమైన పద్దతిలో పెంచే ఈ కూరగాయలు, ఆకుకూరల రుచి, వాసన మార్కెట్లో లభించే వాటికంటే ఎంతో బాగుంటుంది. హానికారక రసాయనాల బెడద కూడా ఉండదు.
 • తోటపనిచేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుపడటమే గాక కాయగూరలకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. కోరిన కూరగాయ అప్పటికప్పుడు కోసి వండుకోవచ్చు.
 • ఈ తరహా సాగువల్ల కూరగాయలు దిగుమతి అవసరం ఉండదు. ఈ మేరకు ఖర్చయ్యే ఇంధనం, వ్యయం, శ్రమ తగ్గుతుంది. పర్యావరణ పరంగా ఇది మేలైన నిర్ణయం. మరి మనమూ ఈ దిశగా ఈ రోజే తోలి అడుగు వేసేందుకు ప్రయత్నిద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE