మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలో అడుగు పెట్టబోతున్నాం. ఎంత వద్దనుకున్నా ఈ సమయంలో గత కాలపు సంఘటనలు, పెట్టుకున్న లక్ష్యాలు, తీసుకున్న మంచి, ఫలించని నిర్ణయాలు గుర్తుకు రాక మానవు. నిరుటి వ్యక్తిగత విషయాలతో బాటు వృత్తిపరమైన అంశాలనూ మదింపు చేసుకునేందుకూ ఇది మంచి సందర్భం. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఉపయోగపడే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.

అవకాశాలను గుర్తించటం

ఉద్యోగులు ఇప్పుడు చేస్తున్నఉద్యోగాన్ని కొనసాగిస్తూనే మరింత ప్రతిభను ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. అందుకు ఇప్పుడున్న చోట ఉన్న అవకాశాలను గుర్తించాలి. ఈ క్రమంలో అర్హత, అనుభవం ప్రాతిపదికగా వీలున్న ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయాలి.

నవ్వుతోనే ఒత్తిడి దూరం

ఉద్యోగులు కార్యాలయంలో ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించేందుకు నవ్వుతో ఎంతో దోహదం చేస్తుంది. ఖర్చులేని, సులువైన, పంచే కొద్దీ పెరిగే నవ్వు కోసం రోజులో కనీసం 20 నిమిషాలైనా కేటాయించాలి. సహోద్యోగులతో సరదాగా మాట్లాడటం, జోక్స్ పంచుకోవటం, భోజన విరామ సమయంలో వారితో కలిసి పావుగంట పాటు బయట పచ్చని చెట్ల మధ్య తిరిగిరావటం వంటి అలవాట్లు  వృత్తి పరమైన ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి.

బ్రేక్ తో ఒత్తిడికి బ్రేకప్

అవకాశం కల్పించుకొని వారాంతంలో లేదా సెలవుల్లో ఏదైనా కొత్త ప్రదేశాలకు కుటుంబంతో వెళ్లి సరదాగా గడపటం, స్నేహితులను కలవటం వల్ల వంటి వ్యాపకాలు  ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ తరహా ప్రయాణాలను ఇప్పటినుంచే ప్లాన్  చేసుకోవాలి.

కొత్త ఏడాదిలో సరికొత్త హాబీ

 ఆసక్తి, వయసు, కేటాయించే సమయాన్ని బట్టి ఏదైనా కొత్త అంశాన్ని హాబీగా మలుచుకునేందుకు ఇదే మంచి సమయం. ఏదైనా జిమ్ లో సభ్యత్వం తీసుకోవటం, సంగీత వాయిద్యం నేర్చుకోవటం, క్రికెట్,సైక్లింగ్ క్లబ్ లో చేరటం వంటివి ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి .  దీనివల్ల మీలాగా ఆలోచించే వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడటమే గాక కొత్త బంధాలు బలపడతాయి.

ఇంకా చదవాలి

సమయం లేదనే సాకును పక్కనబెట్టి రోజూ కనీసం గంట పాటు పుస్తక పఠనానికి కేటాయించాలి. మీకు నచ్చిన అంశాలను ఎంచుకొని వాటికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేయటం ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ అలవాటు వల్ల ఒత్తిడి దరిజేరకపోగా ఆత్మ విశ్వాసం ఎంతగానో ఇనుమడిస్తుంది. భవిష్యత్తులో ఈ జ్ఞానం ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది.

స్మార్ట్ ఫోన్ సాయం తీసుకోండి

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక భాగంగా మారింది. కూర్చున్న చోటునుంచి కదలకుండా అనేక బాధ్యతలు ఏకకాలంలో నిర్వర్తించే వెసులుబాటు వచ్చింది. వ్యాయామం, ఆరోగ్యం, వృత్తి పరమైన అంశాల వంటి అంశాలకు సంబంధిన ఎన్నో యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఎంచుకొని మీ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, నైపుణ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.

తిరిగి ఇచ్చేద్దాం

 మనకు అన్నీ ఇచ్చిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వటం ద్వారా సంతృప్తిని పొందే ప్రయత్నం చేద్దాం. దీనికోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. 10 మంది బృందంగా ఏర్పడి సెలవు రోజు 2 గంటలు ఆఫీసు, బడి, గుడి ఇలా ఏదో ఒక చోట స్వఛ్చ భారత్ కార్యక్రం చేయొచ్చు.  ఏదైనా స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్ గా చేరి చేతనైన సేవ చేయటం, రోజుకోగంట బీద పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పటం.. ఇలా ఎన్నో మార్గాలున్నాయి. ఈ మార్గంలో అడుగుపెడితే మీరు ఒత్తిడి గురించి మరిచి పోవచ్చు. 

 

ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఉద్యోగుల ముందున్న కొన్ని ప్రత్యామ్నాయాలు మాత్రమే. మీరున్న ప్రాంతం, నేపథ్యం, ఉన్న సమయం, అభిరుచి వంటి అంశాలను బట్టి వీటి సంఖ్య ఎంతైనా పెంచుకోవచ్చని సూచిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముగిస్తున్నాం. మిత్రులారా... ఈ ముగింపు కేవలం ఈ వ్యాసానికి మాత్రమే తప్ప మీ నిర్ణయాలకు మాత్రం కాదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE