• HOME
  • ఆహ్లాదం
  • యువతకు మార్గదర్శి.. స్వామీ వివేకానంద

ఆ పేరు ఉత్సాహానికి పర్యాయపదం. ఆయన సూక్తి.. నిరాశను పారద్రోలే పదునైన ఆయుధం. కర్తవ్యనిష్ఠ, వజ్ర సంకల్పం అనే మాటలకు ఆయనే నిలువెత్తు నిదర్శనం. హిందూ దేశపు ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకూ విస్తరింపజేసిన మహోన్నతుడు. సంప్రదాయాల సంకెళ్లను తెగదెంచుకొని యువత ఆధునిక మార్గంలో పురోగమించాలని ఎలుగెత్తి చాటిన సంస్కర్త. తన బోధనలతో పరాయి పాలనలో మగ్గుతున్న జాతిని తట్టి నిద్రలేపి స్వాతంత్ర సంగ్రామం దిశగా నడిపించిన అసలు సిసలు నేత. ఆకలి, అంటరానితనం, అజ్ఞానం లేని సమున్నత భారతాన్ని నిర్మించాలని జాతికి దిశానిర్దేశం చేసిన ద్రష్ట. ఆయనే స్వామి వివేకానంద. ఆయన జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న వేళఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి బాధ్యత. 

జీవన విశేషాలు

కలకత్తాలోని ఒక సంపన్న కుటుంబంలో జవవరి 12, 1863 న స్వామి వివేకానంద ఉదయించారు. ఆయనకు పెద్దలు పెట్టిన పేరు నరేంద్ర. యవ్వనపు తొలినాళ్లలోనే ఆధ్యాత్మిక భావనతో గురువుకైఅన్వేషిస్తున్న నరేంద్రుడికిరామకృష్ణ పరమహంస దర్శనం దొరికింది. ఆ దర్శనమే ఆయన జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పింది. నరేంద్రుడు ఆ తరువాతి రోజుల్లోరామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించి ఆయన ప్రియ శిష్యుడుగా మారి భక్తి, వేదాంత, యోగ,తత్త్వ శాస్త్రములను అధ్యయనం చేశారు. తన అద్భుతమైన ప్రసంగాల ద్వారా హైందవ జాతి వైభవాన్ని విశ్వవ్యాపితం చేశారు.ఆయన ప్రసంగాలకు ముగ్ధులైన ఎందరో విదేశీ యువత ఆయన శిష్యులుగా మారి హైందవ ధర్మాన్ని ఆచరించారు. 1893లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన 'పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్' లో హిందూ జీవన విధానపు ఔన్నత్యాన్ని చాటి అన్ని మతాల పెద్దలను ఔరా అనిపించారు. తర్వాతి రోజుల్లో స్వదేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ పరమహంస బోధనలనుసమాజంలోకి తీసుకెళ్లేందుకు రామకృష్ణ మఠాన్ని స్థాపించారు.దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేసిన స్వామి తన 39వ ఏట పరమపదాన్ని పొందారు. ఆ మహనీయుని సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా జరుపుతోంది.

యువతే భవిత

యువత శక్తి సామర్థ్యాలపై వివేకానందుడికి అచంచలమైన విశ్వాసం ఉండేది. ''ఇనుప కండరాలు, ఉక్కు నరాలున్న 100 మంది యువకులను తనకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను” అని స్వామీజీ తరచూ అనేవారు. చైతన్యవంతులైన భారతీయ యువత దేశ భవిష్యత్తు తో బాటు ప్రపంచ గతినీ మార్చగలరని స్వామి తరచూ చెప్పేవారు. స్వాతంత్య్ర పోరాట యోధులకు , ఎందరో సామాజిక కార్యకర్తలకు, శాస్త్ర వేత్తలకు ఆయన మాటలు గొప్ప ప్రేరణగా నిలిచాయి. నేటికీ నిలుస్తూనే ఉన్నాయి. నేడు ఎన్నో రంగాల్లో భారతీయ యువత ఆ దిశగా పయనించటం నిజంగా సంతోషించాల్సిన విషయం. ‘లెండి.. మేల్కొనండి… గమ్యం చేరేదాకా ఆగవద్దు’ అన్న నినాదంతో యువతకు బలమైన మార్గనిర్దేశనం చేసిన స్వామి జన్మదినాన ఆ మహనీయుని స్మరించటమే గాక ఆయన ఆశయాల సాధనకు మనమూ నడుం బిగిద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE