మరికొన్ని గంటల్లో ప్రపంచం ప్రేమికుల దినోత్సవానికి ఆహ్వానం పలకబోతోంది. మనసుకు నచ్చిన మనిషి పట్ల హృదయాంతరాల్లో గూడుకట్టుకున్న గాఢమైన ప్రేమను వ్యక్తం చేసే అద్భుతమైన, అరుదైన సందర్భమే ప్రేమికుల దినోత్సవం. ప్రపంచంలోని ప్రతి మనిషీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో గాఢమైన ప్రేమకు కట్టుబడకుండా ఉండటం అసంభవమనేది అందరూ అంగీకరించే వాస్తవం. సాహిత్యంలో, చరిత్రలో ప్రేమకోసం రాజ్యాన్ని, అధికారాలను..చివరికి ప్రాణాలను ఇష్టంగా వదులుకున్న ప్రేమికులు అడుగడుగునా కనిపిస్తారు. ఎందరో యువతీయువకుల ప్రేమను బతికించేందుకు పోరాడి చివరకు ఆ ప్రయత్నంలో ప్రాణత్యాగం చేసిన 'వాలంటైన్ ' పేరిట జరుపుకొనే ఈ ప్రేమికుల పండుగ విశేషాలను వివరంగా తెలుసుకుందాం.

ఇదీ నేపథ్యం

క్రీస్తుశకం 270లో రోమన్ పాలకుడైన క్లాడియస్ -2 అనుక్షణం సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోయేవాడు. దీనివల్ల రోమన్ సైనికులు ఏడాదిపొడవునా ఎప్పుడూ యుద్దానికి సిద్దమై ఉండాల్సి వచ్చేది. సైనికుల పరిస్థితిని గమనించిన నాటి యువకులు సైన్యంలో చేరేందుకు ఇష్టపడకపోవటంతో సైనికుల కొరత ఏర్పడే పరిస్థితి ఎదురైంది. దీన్ని తెలుసుకొన్న రాజు క్లాడియస్ దేశంలో పెళ్లిళ్లు, నిశ్చితార్థాల మీద ఆంక్షలు విధిస్తూ చట్టం చేశాడు. దీన్ని అక్కడి వాలంటైన్ అనే క్రైస్తవ మతగురువు వ్యతిరేకించి రహస్యంగా యువతీయువకులకు పెళ్లిళ్లు జరిపించేవాడు. సంగతి తెలుసుకొన్న రాజు వాలంటైన్ కు ఉరిశిక్ష వేసి అమలుకై కొన్నాళ్ళు జైలులో పెడతాడు. ఈ సమయంలో వాలంటైన్ అక్కడి జైలు అధికారి కూతురుతో ప్రేమలో పడతాడు.అంధురాలైన ఆ అమ్మాయి పట్ల తనకున్న గాఢమైన ప్రేమను ఉరికి ఒకరోజు ముందు జైలు గోడపై లేఖరూపంలో రాసి దిగువన ‘ఫ్రమ్ యువర్ వాలంటైన్’ అని రాస్తాడు. ఆయన ప్రేమను మరణశిక్ష అమలు చేసిన తర్వాత గుర్తించిన అక్కడి అధికారులు, ఖైదీలు బాధపడతారు. నాటి నుంచి ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేగా చేసుకోవటం మొదలైంది. అటు రోమన్ కాథలిక్ చర్చ్ సైతం ప్రేమకోసం ప్రాణాలు అర్పించిన వాలంటైన్ కు 200 సంవత్సరాల తర్వాత సెయింట్ హోదానిచ్చి గౌరవించింది. మరికొందరి రోమన్ చరిత్రకారులు.. పురాతన రోమన్ సమాజంలో యువతీయువకులు ఆనందంతో జరుపుకొనే వసంతోత్సవమే కాలక్రమంలో ప్రేమికులరోజుగా మారిందని చెబుతారు.

ఒక్కోచోట ఒక్కోలా

ప్రేమికుల రోజును ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటున్నారు. ఇటలీ యువతులు ఈ రోజు తాము చూసిన మొదటి అవివాహిత యువకుడే భర్తగా వస్తాడని నమ్మటం కనిపిస్తుంది. ఫ్రాన్స్‌లో అవివాహితులైన యువకులు ఎదురింట్లో ఉన్న తమ ప్రేయసిని అందరూ వినేలా గట్టిగా పిలుస్తారు. గ్రీస్ లో ఫిబ్రవరి 14న సెలవు దినం. ఈ రోజున తెలుపు, గులాబీ రంగుల దీపాలతో ఇళ్లను అలంకరించుకుని 'పింక్ థీమ్' పేరిట వేడుకలు జరుపుకుంటారు. రొమేనియాలో ప్రేమికుల రోజున వేకువనే యువతులు ఇంటిముందు పేరుకున్న మంచుతో ముద్ద చేసి దానికి పవిత్ర జలం, గులాబీలు కలిపి 'అఘిజామా' అనే మందు చేస్తారు. అనంతరం బైబిల్ చదివి, ప్రార్థన చేసి కొన్ని రోజుల తర్వాత ఆ మందు తాగితే జబ్బులు నయమవుతాయని నమ్ముతారు. కొరియాలో ప్రేమికుల రోజున తెల్లటి పూలు క్యాండీలు, కార్డులు ఇచ్చి ప్రేమను వ్యక్తపరుస్తారు. ఆ ప్రేమ విఫలమైతే మరుసటి ఏప్రిల్ 14న బ్లాక్‌డేగా జరుపుకుంటారు. డెన్మార్క్‌ యువకులు ప్రియురాలికి ఉత్తరం రాసి తమ పేరుకు బదులు చుక్కలున్న కోడ్‌ను రాస్తారు. దాన్ని తెలుసుకున్నప్పుడు వారిద్దరూ బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. తైవాన్‌లో ప్రేమికులు భారీ గులాబీ పూలగుత్తులు ప్రేమను వ్యక్తం చేస్తారు. ఒక పూలగుత్తి ఇస్తే- ప్రేమిస్తున్నానని, 108 పూలు ఇస్తే పెళ్లిచేసుకో.. అనే సందేశాలు ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. జపాన్‌లో ప్రేమికులు ఈ రోజున చాక్లెట్లు, నెక్‌టైలు, దుస్తులు ఇచ్చిపుచ్చుకుంటారు. చైనాలో కొందరు 'వేగ' నక్షత్రానికి ఫిబ్రవరి 13 రాత్రి ప్రార్థనలు చేస్తారు. సింగపూర్ ప్రేమికులు ఫిబ్రవరి 13 అర్ధరాత్రి కాలువలు, నదుల వద్దకువెళ్లి తమకు మంచి జోడీ రావాలని కోరుతూ బత్తాయిపళ్ళు నదిలోకి విసురుతారు. దక్షిణాఫ్రికాలో యువత తమను ప్రేమిస్తున్నవారి పేర్లు గుండెల దగ్గర తగిలించుకుని షికార్లుచేస్తారు. బ్రిటన్ప్రే, అమెరికా ప్రేమికులు గ్రీటింగ్‌కార్డుల ద్వారా తమ ప్రేమను వ్యక్తీకరిచటం తెలిసిందే. 

బహుమతులు ప్రత్యేకం

రోమన్ ప్రేమదేవత వీనస్ కు గుర్తుగా నాటి రోమన్ ప్రేమికులు ఎర్రగులాబీలను ఇచ్చి ప్రేమను వ్యక్తీకరించేవారు. అదే సంప్రదాయం ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపించింది. ఇప్పుడు పువ్వులతో బాటు టెడ్డీ బేర్, హృదయాకారపు చాక్లెట్లనూ బహుమతులుగా ఇచ్చుకోవటం జరుగుతోంది. ఇంకొందరు ప్రేయసి రాశిని బట్టి బహుమతులను ఎంపిక చేయటమూ చూస్తున్నాం. 

ప్రేమ ఓ వరం

ఇప్పటి యువత ఆకర్షణను ప్రేమగా పొరబడుతోంది. ప్రేమికుల రోజు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, ఆ రోజున సన్నిహితంగా గడపడమేనని యువత అపోహపడుతోంది. నిజానికి హృదయాంతరాలలో నుంచి ఉబికివచ్చే మధుర భావనే ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుతుంది. 'నేను' నుంచి 'మనం' వరకు సాగే తీయని ప్రయాణమే ప్రేమ. ప్రపంచంలోని అన్ని తారతమ్యాలకు అతీతమైన భావనే.. ప్రేమ. తోటివారిని అర్థం చేసుకోవటం ద్వారా సమాజాన్ని మరింత ఆనందమయం చేసే అద్వితీయమైన భావన.. ప్రేమ. నిజానికి ప్రేమ ఒక వ్యసనం కూడా. ఆద్యంతాలు లేని అనంతస్వరూపమే ప్రేమ. ఈ వాస్తవాన్ని తెలుసుకొన్నప్పుడే వాలంటైన్ ప్రబోధించిన నిజమైన ప్రేమను ఆస్వాదించగలము. ప్రేమను కేవలం మధురభావనగానే గాక ఒక బాధ్యతగానూ స్వీకరించి మనల్ని ప్రేమించే వ్యక్తి మనోభావాలను గౌరవించినప్పుడే ఇది నిజమైన ప్రేమ అనిపించుకొంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE