ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలనుకొంటారు . అయితే పలుకారణాల వల్ల  బహుకొద్దిమందే ఆ భాగ్యాన్ని పొందగలుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి సగటు ఆయుః ప్రమాణం పెరిగినా, మారుతున్న జీవనశైలి, పర్యావరణ అంశాల కారణంగా నూటికి సగం మంది 50 ఏళ్ళ వయసు నాటికే అనారోగ్యం పాలై  జీవితాన్ని భారంగా వెళ్లదీస్తున్నారు. అయితే జీవనశైలిలో తగు మార్పులు చేసుకోవటం ద్వారా పూర్తి ఆరోగ్యంతో కూడిన ఆయుష్షు పొందవచ్చు. అవేమిటో తెలుసుకుందాం. 

  • మనం అనుకున్న ప్రకారం జీవితం కొనసాగాలనే ఆలోచనను పక్కన బెట్టి, కాలంతో బాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు సిద్ధపడాలి. ఈ సానుకూల వైఖరి మూలంగా మానవ సంబంధాలు బలపడి చక్కని కుటుంబ, సామాజిక బంధాలు ఏర్పడతాయి. దీనికి భిన్నంగా మార్పును ప్రతికూల అంశంగా భావించేవారు మానసిక ఒత్తిళ్ళు, ఈర్ష్య, ద్వేషం, కోపం, ఆవేశం లాంటి ప్రతికూల భావోద్వేగాల బారిన పడి ప్రశాంతతను కోల్పోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆరోగ్యం, ఆయువు రెండూ క్షీణిస్తాయి.
  • మనసుపెట్టి ఏ పనీ చేయక, సోమరిగా కాలం గడిపేవారు వ్యసనాలబారిన పడి నిరాశ, నిస్పృహలకు లోనై జీవితాన్ని దుర్భరంగా గడుపుతుండగా, నచ్చిన వృత్తి, వ్యాపకాలను ఎంచుకొని అందులోనే ఆనందాన్ని అనుభవించేవారికి మంచి ఆరోగ్యం, ఆయుష్షు సిద్ధిస్తాయి.
  • రుచితో నిమిత్తం లేకుండా అవసరమైన మేరకు సాత్విక, సమతులాహారం తీసుకునేవారు సానుకూల ఆలోచనలతో బాటు మేలైన ఆరోగ్యాన్ని, ఆయువునీ పొందుతారు. రుచి కోసం అర్రులు చాస్తూ, పరిమితి లేకుండా తినే వారికి అనారోగ్య సమస్యలు ఎప్పుడూ పొంచే ఉంటాయి. ఈ విషయంలో ఆలస్యంగా జీర్ణమయ్యే మాంసాహారం కంటే తేలికగా జీర్ణమయ్యే శాఖాహారమే మేలు.
  • ఉన్నంతలో తృప్తిగా, సంతోషంగా జీవితాన్ని గడిపేవారికి, సంతోషమైనా, బాధైనా పదిమందితో పంచుకొనే స్వభావం గలవారికి, జీవన మాధుర్యాన్ని హాయిగా నవ్వుతూ ఆస్వాదించేవారికి చక్కని ఆరోగ్యం, ఆయుష్షు సిద్ధిస్తాయి.
  • సుఖనిద్రకు నోచుకొనేవారికే అప్పుడే సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యం సమకూరి దీర్ఘమైన ఆయుష్షు సిద్ధిస్తుంది. అందుకే రాత్రి 8 లోపు నిద్రకు ఉపక్రమించి సూర్యోదయానికి ముందు నిద్రలేచి పనిపాటలు చూసుకోవాలి.
  • ప్రతిరోజూ శరీరానికి తగినంత వ్యాయామం, మనస్సుకు ప్రశాంతత చేకూర్చే యోగ, ధ్యాన సాధన వల్ల చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈవిషయంలో సంగీతం, సాహిత్యం, లలితకళలు ఎంతో దోహదం చేస్తాయి. జీవితానికి ఒక సార్ధకతను ఇవి చేకూర్చుతాయి.
  • అందమైన ఈ సృష్టిలోని ప్రతి జీవినీ ప్రేమించే స్వభావం గలవారిని ఏ విధమైన అశాంతీ కదిలించలేదు. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరితో ఆప్యాయంగా కలసిపోవాలి. దీనివల్ల ఆరోగ్యం, ఆయుష్షు, వృద్ధి సిద్ధిస్తాయి.
  • మృత్యువును అనివార్యమైన విషయంగా అంగీకరించే వారికి దానిపట్ల భయం ఉండదు. అప్పుడు వారు సృష్టి అందాలను, జీవన మాధుర్యాన్ని ఆసాంతం ఆస్వాదించగలరు. బ్రతికినంత కాలం హాయిగా జీవించడానికి సన్నద్ధమయ్యే వీరికి ఆరోగ్యం, ఆయుష్షు సిద్ధిస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE