ఏ కుటుంబపు ఉన్నతికైనా ఆ ఇంటి పెద్దల కృషే ప్రధాన కారణం. బిడ్డల భవిష్యత్తు కోసం చిన్న చిన్న సరదాలను సైతం త్యాగం చేసి అహరహం శ్రమించిన ఆ పెద్దలే వృద్ధులయ్యేసరికి తీవ్ర నిరాదరణకు గురవుతున్నారు. మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా వచ్చిన వైద్య సదుపాయాల వల్ల ఆయుః ప్రమాణం పెరగటంతో వృద్ధుల సంఖ్యా గణనీయంగా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో 60 ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 11 కోట్లు. రాబోయే 20 ఏళ్ళలో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. ఈ సంఖ్యాపర మార్పుల మాదిరిగానే వీరి సమస్యలూ పెరుగుతూ వస్తున్నాయి.

    నాగరిక జీవనశైలి, పెరిగిన జీవనవేగం, వృద్దుల అవసరాలకు ఖర్చు పెట్టాల్సి రావటం  వంటి కారణాల వల్ల నేటి సమాజంలో వృద్ధుల పట్ల నిర్లక్ష్యం, విముఖత పెరిగాయి. దీంతో కుటుంబ సభ్యుల మమతానురాగాలకు దూరమై, అనారోగ్యం, వయోభారంతో వృద్దాశ్రమాల్లో బతుకీడుస్తున్న వృద్ధుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ దుస్థితిని నివారించి వృద్ధుల సమస్యల పట్ల సమాజంలో విస్తృత అవగాహన పెంచేందుకు ఏటా ఆగస్టు 8న 'ప్రపంచ వృద్ధుల దినోత్సవం' పేరిట జరుపుకొంటున్నాం. అనివార్యమైన వృద్దాప్యం ఏ ఒక్క వ్యక్తికీ శాపంగా మారకుండా మనమంతా కృషిచేయాల్సిన సమయమిది. 

అవాంఛిత ధోరణులు

     ప్రస్తుతం ఎక్కువమంది వృద్ధులు ఒంటరిగా ఉండటం లేదా సొంత ఇంటిలోనే పరాయివారుగా, అన్నింటికీ రాజీపడి బతుకులీడుస్తున్నారు. సర్వం బిడ్డలా చేతికి అప్పగించి ప్రతి అవసరానికి వారి ముందు చేయి చాచాల్సిన దుస్థితి వీరిది. ముఖ్యంగా.. నగర, పట్టణ ప్రాంతాల్లో నూటికి తొంభైమంది పరిస్థితి ఇదే. కొందరు బిడ్డలైతే ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రుల పాలిట శత్రువులుగా మారి దూషణలకు, శారీరక, మానసిక హింసకూ పాల్పడుతున్నారు. ఈ క్రమంలో వారు అనారోగ్యం పాలైతే వృద్దాశ్రమాల్లో చేర్చి చేతులు దులుపుకుంటున్నారు. వ్యాపారపరమైన ధోరణులతో నడిచే ఈ వృద్దాశ్రమాల్లో చేరిన వృద్ధులు జీవచ్ఛవాలుగా మారి చివరికి దుర్భరమైన పరిస్థితిలో బతుకు చాలిస్తున్నారు. 

తక్షణ కర్తవ్యం

    మన పిల్లలను ఎంత ప్రేమగా, శ్రద్ధగా సాకుతున్నామో.. మన పెద్దలూ అంతే ప్రేమగా మనల్ని పెంచిన సంగతిని గుర్తుంచుకొని వారిపట్ల ప్రేమగా వ్యవహరించటం ప్రతి ఒక్కరి విధి. కుటుంబ బంధాలు బలపడాలన్నా, తర్వాతి తరాలు మనల్ని గౌరవించాలన్నా పెద్దల సంరక్షణను బాధ్యతగా స్వీకరించాల్సిందే. ఇది ఒకనాటికి అందరికీ వచ్చే సమస్య గనుక పెద్దలను వృద్ధులుగా చూసే ధోరణికి స్వస్తి చెప్పి శక్తి మేరకు వారి ఆలనాపాలనా చూడాలి. ఇంటి పరిస్థితులు, సమస్యలు వారితో చర్చించి సలహాలు తీసుకోవటం, పలు విషయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచటం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచటమూ అవసరమే. మన కుటుంబంలో అత్యధిక ప్రాధాన్యం గల వ్యక్తులుగా వారిని గుర్తిస్తేనే రేపటి రోజు మనకూ ఆ గుర్తింపు దక్కుతుందని ప్రతిఒక్కరూ గుర్తించాలి. అప్పుడే రేపు తమ పిల్లల నుంచి దాన్ని ఆశించే హక్కు ఉంటుందనే వాస్తవాన్ని గుర్తిస్తే ఏ ఒక్కరికీ వృద్ధాప్యం శాపం కానేకాదు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE