• HOME
  • అందం
  • కమలాఫలంతో మెరిసే చర్మం

ఈ సీజన్లో దొరికే పండ్లలో కమలాఫలం ముఖ్యమైనది. తీపి, పులుపు రుచులతో రుచిమొగ్గలను అలరించే ఈ ఫలం ఆరోగ్య పరిరక్షణతో బాటు సౌందర్య పోషణకూ ఉపయోగపడుతుంది. శీతాకాలమంతా విరివిగా, చౌకగా లభించే కమలాఫలం కళతప్పిన చర్మానికి నిగారింపును తెస్తుంది. అన్ని రకాలచర్మ స్వభావాల వారికీ ఇది ఉపయోగపడుతుంది. సౌందర్య పరిరక్షనకు కమలాఫలం ఎంతగా దోహదపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

జిడ్డు నివారణకు: కొందరి చర్మం ఏడాది పొడవునా జిడ్డు కారుతూనే ఉంటుంది. ఇలాంటివారు 3 చెంచాల కమలాపండు రసంలో చెంచా చొప్పున ఓట్స్ పొడి, తేనె కలిపి ముద్దగా చేసి ముఖానికి, మెడకుపట్టించి 5 నిమిషాలు మర్దన చేయాలి. అరగంట ఆగి ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి కనీసం 2 సార్లు చేస్తే జిడ్డు తీవ్రత తగ్గి ముఖచర్మం కోమలంగా మారుతుంది. 

కంటికింది వలయాల నివారణకు: విశ్రాంతి లేకుండా పనిచేయటం, రోజుకో షిఫ్టు లో పనిచేయటం, పోషకాహార లోపం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల కంటికింద ఏర్పడే నల్లని వలయాలకు 2 చెంచాల కమలా రసం, అంతే మొత్తం పాలు కలిపి దూదితో రోజూ రాసి కడుగుతుంటే వలయాలు తొలగిపోతాయి. 

కాలుష్యంతో కళతప్పిన చర్మానికి: ఎండబెట్టి పొడి చేసిన కమలా తొక్క పొడి 2 చెంచాలు తీసుకొని దానికి 2 చెంచాల పాలు, చెంచా మంచి గంధం పొడి కలిపి ముఖానికి పట్టించి 40 నిమిషాలు ఆరనిచ్చి కడిగితే ముఖం మీది మృత చర్మ కణాలు పోయి ముఖ చర్మం కోమలంగా మారుతుంది. 

గట్టిపడిన చర్మానికి: చలి, ఎండ వంటి వాతావరణ పరిస్థితులకు బిరుసెక్కిన చర్మానికి గుప్పెడు చొప్పున ఎండిన కమలా తొక్క పొడి, పెసర పిండి కలిపి దానికి 4 చెంచాల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి అరగంట ముందు ముఖం, మెడ, మొదలు ఒళ్లంతా పట్టించాలి. ఆరిన తర్వాత 2 చెంచాల తేనె కలిపిన గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. 

మెరుగైన ఛాయ కోసం: రంగు తక్కువగా ఉన్నవారు 2 చెంచాల చొప్పున కమలా, నిమ్మరసాలను కలిపి దానికి అరచెంచా తేనె జోడించి ఆ మిశ్రమంతో రోజూ ముఖం, మెడ భాగాలను మర్దనా చేసి ఆరిన పిదప కడిగితే చర్మం రంగు మెరుగుపడుతుంది.

స్వేద గ్రంథుల పనితీరు పెంపుకు: ముఖ చర్మం మీది స్వేద గ్రంథులు దుమ్ము , చెమట కారణంగా మూసుకుపోవటమే మొటిమల సమస్యకు ప్రధాన కారణం. ఈ సమస్యకు.. గుప్పెడు కమలా తొక్కల పొడికి 4 చెంచాల పెరుగు కలిపి ముఖం, మెడకు పట్టించి వలయాకారంలో మర్దన చేసి 5 నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. కనీసం వారానికి ఒకసారి ఇలా చేసే వారిలో మొటిమల బెడద తొలగిపోవటంతో బాటు ముఖ చర్మం కోమలంగా మారుతుంది.

మృత కణాల తొలగింపుకు: 50 మి.లీ కమలా రసంలో గుప్పెడు వరిపిండి, 4 చెంచాల ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి రాసుకొని నలుగు పెట్టుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రోజు విడిచి రోజు చలికాలం అంతా ఇలా చేస్తే శరీరం మీది వేలాది మృత కణాలు తొలగిపోయి చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE