ఇప్పటిరోజుల్లో మారిన జీవనశైలి కారణంగా వస్తున్న ప్రధాన ప్రధాన సమస్యల్లో ఎసిడిటి ప్రధానమైనది. పిల్ల నుంచి పెద్దలవరకు అందరినీ వేధిస్తున్న సమస్య ఇది. ప్రమాదకరమైన అనారోగ్యం కాకపోయినా ఆ స్థాయిలో చీకాకు పెట్టే సమస్య ఇది. ఎసిడిటి బాధితుల్లో చాలామంది సమస్య కనిపించినప్పుడు ఒకటీ అరా మాత్రలు వేసుకుని నెట్టుకురావటమే తప్ప సమస్యను పూర్తిగా వదిలించుకునే ప్రయత్నం మాత్రం చేయటం లేదు. దీనివల్ల ఇది ఇతరత్రా అనారోగ్యాలకు కారణమవుతోంది. అవగాహనతోనే ఈ సమస్యకు చెక్ పెట్టగలము.

ఎసిడిటి అంటే....

మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఇది జీర్ణాశయంలోని సూక్ష్మజీవులను నాశనం చేయటం, లాలాజల క్షారతను తటస్తీకరించటం మొదలు ఆహారాన్ని జీర్ణంచేయటం వరకూ పలు రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే కొందరిలో పలు కారణాలవల్ల ఈ  హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ఆధికంగా తయారవుతుంది. దీనినే వైద్య పరిభాషలో ఎసిడిటి అంటారు. సమస్యను తొలి దశలో నిర్లక్ష్యం చేస్తే అది జీర్ణ ప్రక్రియను దెబ్బ తీయటమే గాక హృదయ సంబంధిత సమస్య గానూ మారే ప్రమాదం ఉంటుంది.

లక్షణాలు

 • పుల్లని తేపులు
 • ఛాతీ, గొంతు, గుండెల్లో మంట
 • పక్కటెముకల కింద, కడుపులో మంట
 • మింగటం కష్టం కావటం
 • ఉన్నట్టుండి నిద్రలో దగ్గు
 • తిన్నది గొంతులోనే ఉన్న భావన
 • వికారం, వాంతులు, కడుపుబ్బరం, మలబద్ధకం
 • ఆకలి మందగింపు, బరువు తగ్గటం
 • కండరాల నొప్పులు, చెవిపోటు, నాలిక పూత

కారణాలు

ఆహారపరమైనవి

 • చాక్లెట్స్, ఉల్లి, క్యాబేజ్, చిక్కుళ్ళ వినియోగం ఎక్కువకావటం
 • తగినన్ని మంచినీళ్ళు తాగకపోవటం
 • డబ్బాలలో నిల్వ ఉంచిన ఆహారం
 • రోజుల తరబడి ఫ్రిజ్ లో ఉంచిన వంటకాలు తినటం
 • మితిమీరిన ఫాస్ట్ ఫుడ్ వినియోగం
 • భోజనం మధ్యలో, తర్వాత శీతలపానీయాలు తాగటం
 • మసాలాలు అధికంగా వాడటం
 • పులిసిన పిండితో చేసే పదార్ధాలు, వేపుళ్ళు తినటం
 • పులుపు వినియోగం పెరగటం

జీవనశైలి మార్పులు

పైన చెప్పుకున్న ఆహారపరమైన మార్పులకంటే దిగువ జీవశైలి మార్పులే ఎక్కువగా ఎసిడిటి సమస్యకు కారణమవుతున్నాయి. అవి...

 • ప్రతిదానికీ ఆందోళనపడటం, మానసిక ఒత్తిడి
 • ధూమపానం, మద్యపానం
 • జన్యుపరమైన మార్పులు
 • తరచూ ఉపవాసాలు చేయటం
 • వేళకి తినకపోవటం, నిద్రలేమి
 • కొన్ని రకాల మందుల వినియోగం
 • షిఫ్ట్ ప్రకారం పనిచేయటం
 • వయసు పైబడటం
 • రోగనిరోధక శక్తి లోపాలు
 • స్థూలకాయం,
 • అల్పాహారం చేయకపోవటం, పోషకాహార లోపాలు
 • ఆహారం తీసుకున్న వెంటనే కష్టతరమైన పనులు చేయటం

నివారణ, గృహచికిత్స

 • నిద్రలేవగానే రెండు, మూడు గ్లాసుల నీరు తాగటం
 • భోజనానికి ముందు చెంచాడు తేనె తినటం
 • పిండి పదార్థాల వినియోగం పెంచటం
 • వీలున్నప్పుడల్లా తులసి, పుదీనా, బాదంపప్పు వినియోగం
 • బెల్లం కొద్దిగా చప్పరించటం
 • భోజనానంతరం సాదా తాంబూలం తినటం
 • అరటి, పుచ్చకాయ,బొప్పాయి వంటి పండ్ల వినియోగం
 • అరగ్లాసు మజ్జిగలో ఐదోవంతు కొత్తమీర రసం కలుపుకు తాగటం
 • సోడాఉప్పు కలిపిన నీరు తాగటం
 • టీ, కాఫీ తాగిన తర్వాత ఏవైనా చిరుతిండి తినటం 

ఇతర అంశాలు

 • రాత్రి పడుకోవటానికి కనీసం 2 గంటలముందే భోజనం ముగించాలి.
 • ఆహారం బాగా నమిలి తినాలి.
 • భోజనం చేసిన తర్వాత కనీసం పది నిమిషాలపాటు నెమ్మదిగా నడవాలి.
 • ఎప్పుడూ గంభీరంగా, ముభావంగా ఉండటానికి బదులు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడాలి.
 • సమయానికి భోజనం చేయలేనప్పుడు కనీసం 2 గ్లాసుల మంచినీరైనా తాగాలి.
 • రోజూ కనీసం అరగంట పాటు ఏదో ఒక వ్యాయామం చేయాలి. 

ఈ సాధారణ చిట్కా వైద్యాలకూ సమస్య తగ్గుముఖం పట్టకపోతే వెంటనే వైద్యుల సలహా తీసుకోవటం మరువొద్దు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE