రోజంతా  నీడ పట్టున పని చేసే ఉద్యోగుల్లో చాలామంది మెడ, నడుము నొప్పి బారిన పడుతున్నారు. రోజుకు 15 గంటల పాటు కంప్యూటర్, టీవీ ముందు ఒకే భంగిమలో కూర్చోవటమే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగటం వల్ల  కొన్నాళ్ళకు నిలబడినా, కూర్చున్నా, వంగినా ..ఇలా  ప్రతి శరీర కదలికా నడుము మీద ఒత్తిడిని కలిగిస్తుంది. అప్పటికీ ఈ నొప్పిని నిర్లక్ష్యం చేస్తే ఈ నొప్పి క్రమంగా సయాటికాగా మారి నడుము నుంచి పాదాలవరకూ పాకే ప్రమాదం ఉంది. ఆయుర్వేద పరిభాషలో నడుము నొప్పిని కటిగ్రహ లేదా కటివాతం అంటారు. ఇతర వైద్య విధానాల కంటే ఆయుర్వేదంలో ఈ తరహా నడుము నొప్పికి చక్కని పరిష్కారాలున్నాయి.

కారణాలు

 • ఎగుడు దిగుడు రోడ్ల మీద బైకులు, కార్లు ఎక్కువ సమయం నడపటం
 • కూర్చొనే భంగిమలో తేడాలు,
 • అధిక బరువు
 • కాల్షియం, విటమిన్ డి లోపించటం
 • వృద్ధాప్యం వల్ల ఎముకలు బలహీనపడటం, డిస్కులు అరిగిపోవటం
 • ప్రమాదాలలో తగిలిన దెబ్బలు

లక్షణాలు

 • నడుము కింది భాగంలో నొప్పిగా ఉండటం
 • ఆ నొప్పి కిందికి పాకి ఇరువైపులా వ్యాపించటం
 • నరాలు, కండరాలు బెణికి నెలలకొద్దీ నొప్పి తగ్గకపోవటం
 • వేగంగా కదిలిన ప్రతిసారీ నడుము నొప్పిగా ఉండటం
 • తుమ్మినా, దగ్గినా నొప్పి ఎక్కువ కావటం
 • కాళ్ళల్లో శక్తి లేనట్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించటం
 • మలమూత్రాల విసర్జన విషయంలో నియంత్రణ కోల్పోవటం

ఆయుర్వేద చికిత్స ప్రత్యేకతలు

ఆయుర్వేద చికిత్సల వల్ల దెబ్బతిన్న నడుము కండరాలు, నరాలు వేగంగా ఉపశమనం  పొంది ఆ భాగంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల  క్రమంగా కండరాలు, నరాలు శక్తిని పుంజుకొని అంతిమంగా నొప్పి తగ్గిపోతుంది.

రకాలు

 • ఈ తరహా నొప్పులకు పలు ఆయుర్వేదిక చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో శమనం, శోధనం అనే రెండు విధానాలు చక్కని ఫలితాన్ని ఇస్తాయి.
 • ఈ తరహా నడుము నొప్పులకు మరో మేలైన ప్రత్యామ్నాయం పంచకర్మ చికిత్స. పలు తీవ్రమైన రుగ్మతలకు కూడా శస్త్ర చికిత్స అవసరం లేకుండా నయం చేయటంతో బాటు మళ్ళీ భవిష్యత్తులో ఈ సమస్య తిరగబెట్టకుండా చూడటం దీని ప్రత్యేకత.
 • పలు రకాల నూనెలు, దినుసులు కలిపి చేసే అభ్యంగము (మసాజ్), కటివస్తి వంటి చికిత్సలు కూడా మేలైన ఫలితాలను ఇస్తాయి.

నివారణ

 • సమస్య లక్షణాలు కనిపించిన తొలిరోజుల్లోనే వారానికోమారు అభ్యంగం (నూనెతో బాడీ మసాజ్)చేయిస్తే కండరాలు, నరాలు, ఎముకలకు బలం చేకూరి ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొనే శక్తి వస్తుంది. రోజువారీ శ్రమ వాళ్ళ కలిగిన ఒత్తిడి సైతం ఎప్పటికప్పుడు వదిలిపోతుంది.
 • ఎంపిక చేసిన కొన్ని వ్యాయామాలు, యోగ సాధన వల్ల కూడా నడుము నొప్పి నివారణ సాధ్యమే.
 • పోషకాహారంతో బాటు విటమిన్ డి, క్యాల్షియం తదితరాలు అందేలా చూసుకోవాలి. ఆహారంతో బాటు పండ్లు, కూరగాయలు విరివిగా తీసుకోవాలి.

ఇతర జాగ్రత్తలు

 • బ్యాగులు, ఇతర బరువులు మోసేటప్పుడు ఒంటిచేత్తో కాకుండా రెండు చేతులతో పట్టుకోవాలి. అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి.
 • స్టూల్, ఆనుడు లేని చోట కూర్చోవాల్సి వచ్చినపుడు వెన్నుపూస నిటారుగా పెట్టి, పాదాలు నేలకానించి కూర్చోవాలి.
 • డబుల్ కాట్ కింద పూర్తిగా చెక్క ఉండేలా చూసుకోవాలి.
 • బరువులు లేపే సమయంలో కాళ్ళను కాస్త ఎడంగా ఉంచాలి. నడుము వంచకుండా కేవలం మోకాళ్లను వంచుతూ బరువును నెమ్మదిగా లేపాలి.
 • నిద్రించే సమయంలో వీలున్నంత వరకు వెల్లికిలా పడుకోవాలి. మెడ వంపు, మోకాళ్ళ కింద మెత్తని తలగడ వాడొచ్చు.
 • హైహీల్స్ వాడొద్దు. నిలబడి బట్టలు వేసుకోలేకపోతే పడుకొని వేసుకోవాలి.
 • ఉన్నపళంగా పక్కమీదినుంచి లేవకూడదు. ముందుగా పక్కకు తిరిగి లేచి కూర్చోవాలి. ఆ తర్వాత కాళ్ళు నేలమీద పెట్టి నెమ్మదిగా లేచే ప్రయత్నం చేయాలి.

చెప్పుకోవటానికి అనేక ఆయుర్వేద చికిత్సా కేంద్రాలున్నా వాటిలో తగిన ప్రమాణాలతో సేవలన్దిస్తున్నవి మాత్రం కొన్నేనని చెప్పాలి. అందుకే చికిత్సా కేంద్రం ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE