• HOME
  • ఆరోగ్యం
  • అనారోగ్య జీవనశైలితో పెద్దపేగు కేన్సర్

జీవనశైలి మార్పుల కారణంగా వస్తున్న ప్రాణాంతక సమస్యల్లో పెద్దపేగు కేన్సర్ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ తరహా కేన్సర్ కేసులు పెరగటం ఏంటో ఆందోళన కలిగిస్తోన్న అంశం. అయితే సమస్యకు గల కారణాలను అవగాహన చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఈ సమస్యను నివారించటం సాధ్యమే. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్ధాలు మలంగా మారతాయి. దీనిని బయటికి పంపటమే పెద్దపేగు పని. పెద్దపేగు(కొలన్)కు సోకిన కేన్సర్ ను  కొలన్ కేన్సర్ అనీ, పెద్దపేగు చివరి భాగమైన పాయువు(రెక్టం) కు సోకితే రెక్టల్ కేన్సర్ అంటారు.

ఈ తరహా కేన్సర్ సోకినప్పుడు పేగు బిగుసుకు పోవటం, పేగులోపల తిత్తులు(పాలిప్స్) ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు అసలు కనిపించక పోవచ్చు. పెద్దపేగు కేన్సర్ వంశపారంపర్యంగా వస్తుందని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా రాదని మాత్రం గ్యారెంటీ లేదు. అందుకే పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా 15 ఏళ్ళు నిండిన వారి పిల్లలకు ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించటం అవసరం. ఎంత ముందుగా సమస్యను గుర్తించగలిగితే అంత  సమర్ధవంతంగా దీన్ని నయం చేయవచ్చు. సమస్యను ప్రాథమిక స్థాయిలో గుర్తించే పలు ఆధునిక పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

కారణాలు..లక్షణాలు

వృద్ధాప్యం, ఊబకాయం, మధుమేహం, మితిమీరిన ఫాస్ట్ ఫుడ్, మాంసాహార  వినియోగం,  ఆహారంలో పీచు తగినంత లేకపోవటం, ధూమపానం, మద్యపానం తదితరాలు కొలన్ కేన్సర్ సోకేందుకు ప్రధాన కారణాలు. ఈ సమస్య ఉన్నప్పుడు రోజుల తరబడి మలవిసర్జన కాకపోవటం, అయినా మలంతో బాటు రక్తం, జిగురు  పడటం, మలవిసర్జన కష్టతరం కావటం, అజీర్తి లేదా విరోచనాలు, పొత్తికడుపు నొప్పి ,  అకారణంగా నీరసం, బరువుతగ్గడం, ఇరిటబుల్‌ బోవల్‌ సిండ్రోమ్‌(ఐబీఎస్‌) వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలలో అజీర్తి, మలబద్ధ కం, నీళ్ళ విరేచనాల వంటివి చాలామందిలో కనిపించటం సహజం. ఇక మొలల(పైల్స్) సమస్య ఉన్నవారికి మలవిసర్జనలో రక్తం పడటం సహజమైన విషయమే. పరీక్షలలో ఇది కాన్సర్‌ అని తేలితే ముందుగా గుర్తించడం వల్ల నయం చేసేందుకు వీలవుతుంది గనుక తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి తగిన పరీక్షలు చేయించుకొని, చికిత్స తీసుకోవడం అవసరం.

పరీక్షలు.. 

పెద్ద పేగు ఏ భాగానికి కేన్సర్ సోకింది? యెంత మేర వ్యాపించింది? చుట్టుపక్క ఉన్న ఇతర అవయవాలకు కూడా సోకిందా? అనే అంశాలను బట్టి పలు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ కేన్సర్ పెద్ద  పేగు నుంచి అక్కడి లింఫ్‌ గ్రంథులకు పాకుతుంది. అప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది.  కొలనోస్కోపి, ఎక్స్‌రే వంటి పరీక్షల సాయంతో పెద్దపేగు కేన్సర్ బయటపడుతుంది.  కొలనోస్కోపి పరీక్షలో సన్నటి గొట్టాన్ని మలద్వారంలో  ప్రవేశపెట్టి  ఏవెైనా కణుతులు ఉన్నాయో చూడటం, ఉంటే చిన్న ముక్కలను తీసి బయాప్సీకి పంపి కేన్సర్ నిర్ధారణ చేస్తారు. ఒకవేళ కాన్సర్‌ సోకితే అది ఏ మేర విస్తరించిందో తెలుసుకోవడానికి పెట్‌, సీటీస్కాన్‌ పరీక్షలు చేస్తారు. కాన్సర్‌ దశను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధిని మొదట్లో గుర్తిస్తే కీ హోల్‌ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. కేన్సర్ కణాలు లింఫ్‌ గ్రంథులకూ పాకితే వాటినీ తొలగించాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి  కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా చేస్తారు.

నివారణ

  • రోజూ నిర్ణీత సమయానికి మల విసర్జన చేయటం
  • జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవటం
  • శారీరక వ్యాయమం ఉండేలా చూసుకోవటం
  • ధూమపానం, మధ్యపానం లాంటి అలవాట్లు పూర్తిగా మానేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE