• HOME
  • ఆరోగ్యం
  • అలసిన గుండెకు ఊరట... యాంజియోప్లాస్టీ

ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగా హృదయ సంబంధిత సమస్యల బెడద ఎక్కువగా ఉంటోంది . భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది మరీ ఎక్కువ. మానసిక ఒత్తిళ్ళు పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం, ధూమపానం, మద్యపానం, మితిమీరిన పరిమాణంలో జంక్ ఫుడ్ వినియోగం, అనారోగ్యకరమైన జీవన శైలి  తదితర కారణాలే ఈ తరహా సమస్యలకు ప్రధాన కారణాలు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త సరఫరా నెమ్మదించటం, క్రమంగా సరఫరా ఆగిపోయి  చివరగా గుండె ఆగిపోవటానికి కారణం అవుతోంది. ఇలాంటి సమస్యకు మేలైన, సులభమైన, సురక్షితమైన ముందస్తు చికిత్సా విధానమే యాంజియోప్లాస్టీ. 

యాంజియోప్లాస్టీ అంటే...

కొవ్వు గడ్డలు కట్టి ధమని కుచించుకుపోయి, గుండెకు రక్తసరఫరా తగ్గినప్పుడు బెలూన్ సాయంతో  యాంత్రికంగా వ్యాకోచింప జేసే విధానమే యాంజియోప్లాస్టీ. ధమనిలోకి పంపేందుకు వాడే తీగపై ఖాళీగా, ముడుచుకొన్న ఓ బెలూన్ అమర్చి కుచించుకుపోయిన ధమనిలోకి పంపుతారు. ఇలా తెరుచుకున్న బెలూన్  రక్తనాళంలో పేరుకుపోయిన కొవ్వుపై ఒత్తిడి కలిగించి నాళాన్ని తెరుచుకునేలా చేస్తుంది. ధమని పూర్తిగా తెరుచుకున్న తర్వాత బెలూన్ ను ముడుచుకునేలా చేసి బయటకు తీస్తారు. దీనివల్ల గుండె కండరాలకు యధావిధిగా రక్తం సరఫరా అవుతుంది. ఇది బైపాస్ సర్జరీ కంటే పూర్తి  సురక్షితమైన విధానం. ప్రతి 100 యాంజియోప్లాస్టీల్లో  99 కేసులు విజయవంతం అవుతుండటం మరో విశేషం.

రకాలు

ఇది రెండు రకాలు. ఒకటి ... అనుకోకుండా ఒక్కసారిగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమని మూసుకుపోతే తక్షణ పరిష్కారంగా చేసే ప్రైమరీ యాంజియోప్లాస్టీ. అయితే కొవ్వు కారణంగా ధమని మూసుకుపోయినా చాలామందిలో ఎలాంటి సమస్య ఉండదు. అయినా ముందుజాగ్రత్తగా సమస్యను నివారించేందుకు చేసేదే ఎలక్టివ్ యాంజియోప్లాస్టీ. ధమని వ్యాసంలో 60 నుంచి 70 శాతం మూసుకుపోతేనే యాంజియోప్లాస్టీ అవసరం అవుతుంది. ధమని వ్యాసంతో బాటు ఎంత పొడవున ధమని మూసుకుపోయింది? ఆ భాగంలో వాపు ఉన్నదా? వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 60 శాతం కంటే తక్కువ మూసుకున్న ధమనిని మందులతోనే పూర్వస్థితికి తీసుకురావచ్చు.

ప్రత్యేకతలు

  • గుండె నొప్పి, చాతీ నొప్పి, శ్వాశలో ఇబ్బందులను యాంజియోప్లాస్టీ దూరం చేస్తుంది.
  • గుండె పూర్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుంది.
  • ఓపెన్ హార్ట్ సర్జరీ, దాని వల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలతో పోల్చితే ఇది ఎన్నో రెట్లు సురక్షితమైనది.
  • తక్కువ సమయంలో రోగిని కోలుకొనేలా చేస్తుంది. చేసిన రాత్రి ఎలాంటి సమస్యలు లేకపోతే మరునాడే ఇంటికి వెళ్ళొచ్చు.

జాగ్రత్తలు

  • యాంజియోప్లాస్టీ చేసిన వారానికి మనిషి పూర్తిగా కోలుకొని తనపనులు తాను చేసుకోగలిగినా రెండు మూడు నెలల వరకు భారీ బరువులు ఎత్తటం, వేగంగా పరిగెట్టటం, బిగ్గరగా కేకలు వేయటం, అతి వేగంతో వాహనాలు నడపటం  వంటివి చేయకూడదు.
  • యాంజియోప్లాస్టీ తర్వాత స్టంట్ అమర్చిన చోట వాపు, రక్తస్రావం, నొప్పి, జ్వరం, నీరసం, శరీర ఉష్ణోగ్రతలో మార్పులు, శ్వాస సమస్య వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలి.
  • చికిత్సతో బాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరచుకోవటం , రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచుకోవటం, రోజూ తేలికపాటి వ్యాయామం చేయటం, పోషకాహారాన్ని తీసుకోవటం ఎంతైనా అవసరం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE