ప్రమాదాలు చెప్పిరావు. మనం రోజూ చూసే రోడ్డు ప్రమాదాల మొదలు ఊహించని రీతిలో ముంచుకొచ్చే ప్రకృతి ఉత్పాతాల విషయంలో తగు ముందుజాగ్రత్తలు తీసుకోవటంతో బాటు అనివార్యమైన పరిస్థితిలో ప్రథమ చికిత్సకు సిద్ధమై ఉండాలి. ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో ఎక్కువ మందికి  తగిలిన దెబ్బలు, గాయాల కంటే తగిన సమయంలో  ప్రథమ చికిత్స అందకే మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు నిలబెట్టే ప్రథమ  చికిత్సకు సంబంధించిన మౌలికమైన అవగాహనను అందరికీ కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం రూపొందినదే ' ABCD' ప్రణాళిక. ఇందులోని నాలుగు ఆంగ్ల అక్షరాలు 4 కీలక అంశాలను సూచిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణుల ఆమోదం పొందిన ఈ ప్రణాళిక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎ (ఎయిర్ వే): ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి కనీస స్థాయిలోనైనా శ్వాస  అందించటం ప్రథమ ప్రాధాన్య అంశం. సాధారణంగా ఎవరైనా సృహ తప్పి కింద పడిపోయిన సందర్భాల్లో బాధితుడి నాలుక వెనక్కు పోయి శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీనివల్ల మనిషి ఉక్కిరి బిక్కిరి కావటం, విపరీతమైన దగ్గు ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించాలంటే తలకింద మెత్తని, ఎత్తైన దిండు పెడితే శ్వాసకు ఇబ్బంది ఉండదు.

బి (బ్రీతింగ్, బ్లీడింగ్, బోన్స్): శ్వాస మార్గం అవరోధాలను సరిచేసిన తర్వాత  శ్వాసను మెరుగు పరచటం మీద దృష్టి పెట్టాలి. ఇందుకోసం బాధితుడిని నీడలో గాలి తగిలేలా పడుకోబెట్టటం, వీలుంటే ఫ్యాన్ ఏర్పాటు చేయటం,  బాధితుడి చుట్టూ జనం గుంపుగా  చేరకుండా చూడటం ద్వారా శ్వాసను మెరుగుపరచవచ్చు. ఆ తర్వాటి అంశం బ్లీడింగ్(రక్త స్రావం). గాయాల కారణంగా రక్తం ఎక్కువగా పోతే ప్రాణాపాయం తప్పదని గుర్తించి దెబ్బ తగిలిన భాగాన్ని కాస్త ఎత్తులో పెట్టటం, టవల్ లేక రుమాలుతో కట్టుకట్టటం ద్వారా రక్తస్రావాన్ని వీలున్నంత మేర తగ్గించవచ్చు. ఆ తర్వాత ఎముకల గాయాల మీద దృష్టి పెట్టాలి. ఎముకలు విరగటం, ఒత్తిడికి గురికావటం వంటి సమస్య ఉన్నట్లుగా అనుమానం వస్తే వైద్యుల దృష్టికి తీసుకెళ్ళాలి.

సి(సర్క్యులేషన్) : మెదడు వంటి కీలక అవయవాలకు 5 సెకన్లకు మించి రక్త ప్రసారం జరగక పోతే బాధితుడు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉన్నందున మెదడు, గుండె  వంటి  కీలక అవయవాలతో బాటు ఇతర అవయవాలకు కనీస స్థాయిలోనైనా రక్తప్రసరణ జరుగుతుందో లేదో కూడా పరిశీలించాలి.

డి(డెడ్లీ బ్లీడింగ్): రక్తం మరీ ధారగా పోతుంటే కట్టు కట్టి వీలున్నంత త్వరగా వైద్య సాయం అందేలా చూడాలి. రక్తం త్వరగా గడ్డ కట్టని వారికి మరింత త్వరగా ఈ సాయం అందించాలి.

ఇతర జాగ్రత్తలు

  • ముక్కు నుంచి రక్తం కారుతుంటే తల పైకెత్తి బొటన, చూపుడు వేళ్ళతో సున్నితంగా ముక్కును పైకెత్తి పెడితే రక్తం కారటం వెంటనే ఆగుతుంది.
  • కాలు మెలిక పడినా లేక జారిపడిన సందర్భాల్లో శరీర బరువు అంతా కాలిమీద పది అ భాగం ఒత్తిడికి గురవుతుంది. ఇలాంటప్పుడు నొప్పి ఉన్నచోట ఐస్ పెట్టటంతో బాటు రెండు, మూడు గంటల పాటు కాలికి విశ్రాంతినివ్వాలి.
  • చెవిలో ఈగ, దోమ వంటి కీటకాలు దూరితే టార్చిలైట్ వేసి చూపితే ఆ వెలుగుకు కీటకం బయటికి వస్తుంది. అవసరాన్ని బట్టి ఒకటి, రెండు చుక్కల నీరు వేస్తే పర్వాలేదుగానీ నూనె, ఆకు పసరు వంటివి వాడకూడదు.
  • వాంతులు, విరేచనాలు అయ్యే సందర్భంలో మనిషి చాలా తక్కువ సమయంలో నీరసపడి పోతాడు. అందుకే ఉప్పు, చక్కెర కలిపిన నీరు తాగించాలి. పరిస్థితి నెమ్మదించాక నీరసం తగ్గేందుకు కొబ్బరి నీళ్ళు, పప్పు ఉడికించిన నీరు (కట్టు) తాగిస్తే సరి.
  • కుక్క కరిస్తే గాయాన్ని డెట్టాల్, సబ్బుతో బాగా కడగాలి. మంచి కుక్కో లేక పిచ్చి కుక్కో తెలుసుకొని వైద్యులు సూచించిన విధంగా ఇంజెక్షన్స్ తీసుకోవాలి.
  • అగ్ని ప్రమాదం వల్ల ఒళ్ళు కాలితే ఆ భాగంపై కొద్ది కొద్దిగా చల్లని నీరు పోస్తే ఆ భాగంలోని ఆరోగ్యంగా ఉన్న కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. నీరు పట్టి ఉబ్బిన బొబ్బలను చిదపకుండా వాటిపై బర్నాల్, వెన్నపూస వంటివి రాస్తే ఒకటి రెండు రోజుల్లో సమస్య దారికొస్తుంది.
  • గుండెనొప్పి, పక్షవాతం లక్షణాలు కనిపిస్తే ఆలస్యం, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా కోరాలి.
  • పాము కరిస్తే ఒకవైపు బాధితుడికి ధైర్యం చెబుతూనే, కరచిన భాగం నుంచి మిగిలిన శరీరానికి విషం పాకకుండా తాడు లేక తువ్వాలుతో బిగుతుగా కట్టాలి. శరీరాన్ని వేగంగా కదిలించటం, పరుగులు పెట్టటం అసలే మాత్రం పనికిరాదు.

గోల్డెన్ అవర్

ప్రమాదం జరిగిన తొలి 30 నిమిషాల సమయాన్ని అత్యంత  విలువైన సమయంగానూ, రెండో అరగంట సమయాన్ని విలువైనదిగా చెబుతారు. ఈ మొత్తం సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గంట లోపు చికిత్స ఆరంభించగలిగితే చాలా వరకు ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. కనీసం మూడో అరగంటలో అయినా వైద్య సాయం అందితే కాస్త ఇబ్బంది పడ్డా ప్రాణం దక్కుతుంది.  Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE