మన శరీరంలో కాలేయం కీలకమైన అవయవం. తీసుకున్న ఆహారం, ద్రవాల ద్వారా అందే కొవ్వు పదార్థాలను , శక్తిగా మార్చటం, రక్తంలోని హానికర  పదార్థాలను వడపోయటం  మొదలు మరెన్నో కీలక విధుల నిర్వహణా బాధ్యత కాలేయానిదే. మారుతున్న జీవనశైలి కారణంగా ఫ్యాటీలివర్ వంటి కాలేయ సంబంధిత  అనారోగ్యాలు ఇటీవలి కాలంలో ఎక్కువ కావటం విషాదం. వీటిలో మెజారిటీ కేసులు మద్యపానం కారణంగానే అని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలేయ సంబంధిత సమస్యల పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫ్యాటీలివర్ సమస్య అంటే...

కాలేయ సమస్యల్లో ఎక్కువగా కనిపించే సమస్య నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డి).  అంటే పరిమితికి మించి కాలేయ కణల్లో కొవ్వు చేరటం. సాధారణంగా  కాలేయం మొత్తం బరువులో 5 నుంచి 10 శాతం కన్నా ఎక్కువ కొవ్వు నిల్వ అయితే సమస్య ఉన్నట్లు భావించాలి.  దీని బారిన పడిన వారిలో  కాలేయం సైజు పెరిగి,  క్రమంగా సున్నితత్వాన్ని కోల్పోయి  గట్టిపడుతుంది. దీనివల్ల కాలేయం పనితీరు క్రమంగా తగ్గుతూ చివరికి వైఫల్యం చెందుతుంది.

బాధితులు వీరే?

అధిక బరువు, ఊ బకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ గలవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గటం, పోషకాహార లోపం కూడా సమస్యకున్నఇతర కారణాలు.ఇది 40-60 వయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువ.

లక్షణాలు

సమస్య ఉన్నప్పటికీ సహజంగా తొలి దశలో ఎలాంటి లక్షణలూ కనబడవు గానీ తీవ్రమయ్యే కొద్దీ నీరసం, బలహీనత, బరువు తగ్గటం, ఆకలి మందగించటం, కడుపులో వికారంగా ఉండటం, కడుపునొప్ఫి,ఒంటిపై కనిపించే  రక్తనాళాలు అల్లుకుపోయినట్లు మారటం చర్మం, కళ్లు పసుపు పచ్చగా (కామెర్లు) మారటం, ఒళ్ళంతా దురద, కాళ్ళ వాపు, కడుపు సైజు పెరగటం, ప్రతిపనిలోనూ గందరగోళం వంటి లక్షణా లు కనబడతాయి. సాధారణంగా అల్ట్రాసౌండ్ పరీక్షతో దీన్ని నిర్ధారిస్తారు. రక్తపరీక్షలో కాలేయానికి సంబంధించిన ఎంజైములు అధిక స్థాయిల్లో ఉంటే ఇతరత్రా పరీక్షలకు వైద్యులు సిఫారసు చేస్తారు. 

చికిత్స

ఈ సమస్యకు చికిత్స కంటే నివారణ సులభం, ఉత్తమమైన ప్రత్యామ్నాయం. వీలున్నంత ముందుగా సమస్యను గుర్తించేందుకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవటం, పోషకాహారం తీసుకోవటం, రోజూ తగినంత  వ్యాయామం చేయటం, వ్యక్తిగత  అలవాట్లలో మార్పుల వంటి జాగ్రత్తలతో సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు, ఊబకాయులు కాలేయ  పరీక్షలు చేయించుకోవటం మంచిది. మధుమేహ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం అవసరం.  రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజరైడ్ల స్థాయిలను తగ్గించుకోవటం, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా సమస్య రాకుండా చూసుకోవచ్చు. తరచూ వచ్చే అనారోగ్యాలకు సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవటం కూడా ఈ సమస్యకున్న కారణాల్లో ఒకటి . అందుకే  వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE