వైద్యం ఒక యోగం

ప్రపంచంలోని అత్యంత పురాతనమైన వృత్తుల్లో వైద్యం ఒకటి. భారతీయ వైద్యులైన చరకుడు, శుశ్రుతుడు మొదలు గ్రీకు వైద్యులైన హిప్పోక్రటస్ వరకు ఎందరో ఆదర్శ వైద్యులు తమ ప్రతిభను లోకానికి చాటి వైద్య వృత్తి గౌరవాన్ని వేల ఏళ్లపాటు కొనసాగేలా చేశారు. మన దేశంలో అయితే వైద్యుడిని ఏకంగా భగవంతుని రూపంగా భావిస్తారు. అనుభవజ్ఞుడైన వైద్యుడు రోగిని ఆమూలాగ్రం పరిశీలించటం, అతని బాధను శ్రద్దగా విన్నా తర్వాతే చికిత్సలోకి వెళతాడు. అనారోగ్యంపై రోగికున్న అపోహలను, భయాలను దూరం చేసి తన కరస్పర్శతో నిండా భరోసా కల్పిస్తాడు. విధినిర్వహణలో భాగంగా అన్ని జ్ఞానేంద్రియాలనూ ఉపయోగిస్తాడు. ఏ ఇతర వృత్తిలోనూ ఇలాంటి సాధన కనిపించదు. కాలంతో బాటు వస్తున్న మార్పుల కారణంగా ఈ వృత్తి ప్రతిష్టలు రవ్వంత మసకబారుతున్నా మొత్తంమీద చూసినప్పుడు ఇప్పటికీ సమాజం నమ్మి గౌరవించే వృత్తుల్లో వైద్యం ఇప్పటికీ ముందువరసలోనే ఉందని చెప్పాలి.

వైద్యుడంటే?

నిజానికి వైద్యుడు ఒక యోగి. అంటే భౌతిక సుఖాల పట్ల అనాసక్తతను చూపేవాడన్న మాట. అలుపు సొలుపూ లేకుండా కాలంతో పరుగులు పెట్టే క్రమంలో వైద్యుడు వేళ పట్టున తిండి, నిద్ర, కుటుంబ సౌఖ్యం తదితరాలకు అంతగా నోచుకోడు. అంతుబట్టని కొత్త రోగాలకు చికిత్స చేసే క్రమంలో భయాన్ని ఎదుర్కొంటూనే, మరోవైపు దాన్ని అధిగమించి ముందుకు సాగుతాడు. అందుకే వైద్యుడిని యోగి అనికూడా అనాల్సి వస్తోంది. 

రోగి భౌతిక పరిస్థితితో బాటు అతని అంతర్గత శరీర నిర్మాణాన్ని.. ఒక్క మాటలో చెప్పాలంటే అతని సూక్ష్మ శరీరాన్ని దర్శించగలడు. చిన్న అనారోగ్యంతో వచ్చిన వాడి నుంచి మరణ శయ్యపై ఉన్న రోగి వరకు ప్రేమగా స్వాoతన కలిగించేందుకు చూస్తాడు తప్ప నిరాకరించడు. అనారోగ్యంతో బతుకు మీద ఆశ కోల్పోయిన రోగికి ధైర్యాన్ని నూరిపోసి బతుకు పట్ల కొత్త ఆశలను చిగురింపజేసే వసంతం లాంటి వాడే వైద్యుడు. రోగానికి చికిత్స చేస్తూనే ఆరోగ్యపు విలువను బోధపరచే మార్గదర్శి వైద్యుడు. 

వైద్యుడు ఈ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి ఆశ్రయించి వచ్చిన ప్రతి రోగిలోనూ పరమాత్మను దర్శిస్తాడు. అందుకే ఎంత కష్టమైనా బాధ్యతగా, శ్రద్దగా వైద్యం చేస్తాడు. ఎంత అనుభవం ఉన్న వైద్యుడైనా తన వద్దకు వచ్చిన ప్రతి రోగినీ కొత్త గురువుగా భావిస్తాడు గనుకే అతను చెప్పేది ఓపికగా, కూలంకషంగా వినగలుగుతాడు. తన దగ్గరికి వచ్చిన నాటి నుంచి స్వస్థత చేకూరి ఇంటికి వెళ్లే సమయానికి అతనికి మంచి మిత్రుడుగా మారతాడు. 

తాను చేసిన వైద్యసేవకు ప్రతిఫలాన్ని కేవలం ధనరూపంలోనే గాక రోగికున్నంతలో ఏది ఇస్తే అది పుచ్చుకొని సంతృప్తి పడే ఉదాత్త స్వభావుడు వైద్యుడు. నేటికీ వేలాది మంది గ్రామీణ వైద్యులు ఈ తీరునే పనిచేయటం మనం చూడవచ్చు. 

వైద్యులు అనుబంధ వైద్యకళాశాలల్లో బోధకులుగానూ ఉంటారు. తమ అనుభవాలను పాఠాలుగా బోధిస్తూ భవిష్యత్తు వైద్యులకు మార్గదర్శకులుగా ఉంటారు. బోధనలో భాగంగా శవాన్ని కూడా శివంగానే( జీవించి వున్నవాడిగా ) భావించి విద్యార్థులకు వివరించటం ఈతనికే చెల్లుతుంది. తెల్లని సూర్యకాంతి సప్తవర్ణశోభితమైన హరివిల్లులా దర్శనమిచ్చినట్లు తన జ్ఞానాన్ని నలుదిక్కులా ప్రసరింపజేస్తాడు. అటు వైద్యుడిగా , ఇటు గురువుగా..అంటే ఏకకాలంలో అటు జ్ఞాన యోగాన్ని, మరోవైపు కర్మయోగాన్ని అనుసరించగల నేర్పరి. 

వేషధారణ

వైద్యుని తెల్ల కోటు అతని మనసు స్వచ్ఛతకు ప్రతిరూపం. తనకున్న సమస్యలను ఇంటిదగ్గరే వదిలి ఏరోజుకారోజు తెల్ల కాగితంలా బయలుదేరతాడు. తనలోని భావోద్వేగాలను చిరునవ్వు మాటున దాచివుంచే బ్రహ్మానంద స్వరూపుడే వైద్యుడు. హృదయస్పందన ను పరిశీలించేందుకు మెడలో ధరించే స్టెతస్కోప్ నిజానికి ఈశ్వరుని మెడలోని నాగాభరణం లాంటిది. సృష్టిని లయం చేసేవాడు శివుడైతే గుండె లయను పసిగట్టే నేర్పరి వైద్యుడు. 

ఉత్తమవైద్యులు

పురుషులందు పుణ్యపురుషులు వేరన్నట్లు.. వేలాది మంది ఈ వృత్తిలోకి వస్తున్నా ఉత్తమ వైద్యులుగా నిలిచేవారు బహు అరుదు. సమాజం పట్ల ఎంతో కొంత నిబద్దత, త్యాగనిరతి ఉన్నవారే ఈ రీతిన రాణిస్తారు. సామాన్యుల భాషలో వీరినే హస్తవాసిగల వైద్యులంటారు. హడావుడిగా మమ అనిపించే వైద్యానికి బదులు మానవ స్పర్శను జోడించడం వీరి ప్రత్యేకత. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భావన. ఇలాంటి వైద్యుల దగ్గర చికిత్స పొందిన వాడు జీవితంలో మరో డాక్టరు దగ్గరకు పోలేడు. విశ్వాసమే ఈ భావనకు ఆలంబన. చరిత్రలో కనిపించే రాజ వైద్యులు, కుటుంబ వైద్యుల మొదలు చివరికి పశుపక్ష్యాదులకు సైతం వైద్యం చేసిన వారి ఉదంతాలను బట్టి పాలనా వ్యవస్థ ఏదైనా వైద్యుడి పాత్ర మాత్రం ఎంతో కీలకమని అవగతమవుతుంది. 

ఆసుపత్రిలోనే లేక వైద్యుని ఇంత చేసేదే వైద్యం కాదు. రోగి రాలేకపోతే వైద్యుడే స్వయంగా దూరాభారాలను లెక్కచేయక ప్రయాణించటం మన దేశంలో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అంటే.. ఇప్పుడిప్పుడే విదేశీ భావనగా చెలామణిలో ఉన్న 'హోం సర్వీస్' నిజానికి మన దేశంలో అనాదిగా ఉన్నదే. 

మంచీ,చెడు

కాలంతో బాటు వస్తున్న మార్పుల వల్ల అన్ని రంగాల మాదిరిగానే వైద్య రంగమూ కొన్ని అవాంఛిత మార్పులకు గురవుతూ వస్తోంది. పేదలకు వైద్యం అందించే విషయంలో ప్రభుత్వ రంగం చేతులెత్తేయడంతో  ఆ బాధ్యతను కార్పొరేట్లు, ప్రైవేట్ యాజమాన్యాలు, స్వచ్చంద సంస్థలు, సేవా భావన గాళ్ కొన్ని విదేశీ సంస్థలు భర్తీ చేశాయి. కేవలం 2 దశాబ్దాల సమయంలోనే తమ ఉనికిని బలోపేతం చేసుకోవటం ద్వారా ఈ రంగంలో మౌలిక సౌకర్యాల కల్పన జరిగిన తీరు అనూహ్యమని చెప్పాలి. కూర్చున్న చోటి నుంచి కదలకుండా 'టెలీమెడిసిన్' పేరిట వైద్య సేవలు అందించే స్థాయికి  ఈనాటి వైద్యరంగం ఎదిగింది.

ఎందరో మహానుభావులు

ఈ క్రమంలో కొందరు వైద్య ప్రముఖుల సేవలు వద్దనుకున్నా గుర్తుకు రాక మానవు. వారిలో అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకులైన డా. సి. ప్రతాప రెడ్డి గారు ఒకరు.  వైద్యుడిగానే గాక దూరదృష్టిగల దార్శనికుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశపు వైద్య రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేశాయి. మెరుగైన వైద్యానికి అమెరికా వెళ్లే పరిస్థితి నుంచి ఆయా సంపన్న దేశాల నుంచి లక్షలాది రోగులు చికిత్స నిమిత్తం వచ్చేలా చేసిన వైద్యుడాయన. ఈనాటి వైద్యులకు మార్గదర్శిగా నిలిచే వ్యక్తి ఆయన. ఇలాంటి ఘనత సాధించిన వైద్యుల సేవలు, ఆలోచనలే నేడు భారతదేశానికి పెద్ద మొత్తంలో మెడికల్ టూరిజం పేరిట విదేశీ మార్క్ ద్రవ్యాన్ని ఆర్జించేందుకు దోహద పడుతున్నాయి. ఈ ప్రయత్నం దిశగా మన వైద్య రంగం మరింత ముందుకు సాగాలని మనమంతా ఆకాక్షిద్దాం.

 

జులై 1 న జరుపుకుంటున్న డాక్టర్స్ డే సందర్భంగా ఈ వృత్తికి గుర్తింపునూ, గౌరవాన్ని తెచ్చిన వైద్యులను స్మరించుకుంటూ..... 

                            హ్యాపీ డాక్టర్స్ డే  

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE