మహిళ జీవితంలో మాతృత్వం ఓ అపురూపమైన ఘట్టం. అయితే ఇప్పుడు చాలామంది మహిళలు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. జీవన శైలి సమస్యలు, కెరీర్ పేరిట ఆలస్యంగా వివాహాలు చేసుకోవటంతో బాటు పలు శారీరక సమస్యలు సంతానలేమికి కారణం కావచ్చు. మహిళల్లో సంతానలేమికి గల కారణాలను వివరంగా తెలుసుకుందాం.

  • బీజవాహికల లోపాలు: సంతానం కలగని ప్రతి 10 మంది మహిళల్లో ఇద్దరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అపెండిసైటిస్‌, పేగువాపు, క్షయ, లైంగిక కలయిక ద్వారా సంక్రమించే వ్యాధుల మూలంగా బీజవాహిక మూసుకుపోవడం లేదా లోపల ద్రవం నిండిపోవడం, తొడ, పొత్తి కడుపు భాగంలో గతంలో జరిగిన సర్జరీల వల్ల బీజవాహికలు మూసుకుపోయి అండాలు ప్రయాణించలేక పోవడం, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ (పిండం బీజవాహికలోనే పెరిగి  బీజవాహిక దెబ్బ తినటం), పుట్టుకతోనే వచ్చే బీజవాహిక సంబంధిత లోపాలు, బీజవాహికలు వాపునకు గురి కావటం వంటి సమస్యలు సంతానలేమికి దారితీస్తాయి.
  • పాలీసిస్టిక్‌ ఓవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌): సంతానలేమి సమస్య ఉన్న ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీని బాధితులే. ఇది రుతుచక్రాన్ని, ఫలదీకరణ శక్తిని, హార్మోన్ల ఉత్పత్తిని, రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య ఉన్న మహిళల్లో ఆండ్రోజెన్‌ (మేల్‌ హార్మోన్స్‌) ఉత్పత్తి అధికంగా ఉండటంతో అండం విడుదల, అభివృద్ధి దెబ్బతింటాయి. నెలసరికూడా క్రమంగా ఉండదు. అండాశయాల్లో ద్రవంతో నిండిన కంతులు ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత, జన్యు సమస్యల కారణంగానే మహిళలు ఈ సమస్య బారిన పడతారు.
  • రుతుచక్ర సమస్యలు: నెలసరి రావటం ఆలస్యం కావటం, అసలే రాకపోవటం, 2 నెలలకోసారి రావటం, సమయానికి వచ్చినా అండం విడుదల కాకపోవటం వంటి సమస్యలూ సంతానలేమికి దారితీస్తాయి. చికిత్స, మందుల వినియోగం, జీవనశైలి మార్పులతో ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు.
  • హార్మోన్‌ సమస్యలు: మెదడులోని పీయూష గ్రంథి (పిట్యూటరీ గ్లాండ్‌) విడుదల చేసే ప్రొలాక్టిన్‌ స్థాయి అధికం కావడం, ఇతర సమస్యల మూలంగా పరిపక్వమైన అండాలు ఉత్పత్తి గాక సంతానలేమికి దారి తీస్తుంది.

ఇతర కారణాలు

  • గతంలో చికిత్సలో భాగంగా ఇచ్చిన రేడియేషన్‌ వల్ల అండాశయం దెబ్బతినటం
  • అతిగా వ్యాయామం చేయటం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళు,ఊబకాయం, ఒక్కసారిగా ఎక్కువ బరువు తగ్గడం, ధూమపానం
  • వెంటవెంటనే అబార్షన్లు కావటం, విడుదలైన అండం కుహరం నుంచి బయటకు రాకపోవటం, 40ఏళ్ళ కంటే ముందుగానే రుతుచక్రం ఆగి పోవడం
  • మధుమేహం, మూర్ఛ, థైరాయిడ్‌, మలాశయ సంబంధ వ్యాధులు

నేటి ఆధునిక యుగంలో పైన చెప్పుకున్న సమస్యలన్నింటికీ చక్కని పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయి.   కొన్ని సందర్భాల్లో ఎన్ని వైద్యపరీక్షలు చేసినా సంతానలేమికి కారణం అంతుపట్టకపోవచ్చు. ఇలాంటి కేసుల్లోనూ ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సమస్య ఉందని అనిపించిన తర్వాత వీలైనంత త్వరగా వైద్యులను కలిసి తగు పరీక్షలు చేయించుకొని తగు చికిత్స తీసుకుంటే సంతాన లేమి సమస్యను సమర్ధవంతంగా అధిగమించవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE