రొమ్ము క్యాన్సర్ అనగానే ఇది మహిళల అనారోగ్య సమస్య మాత్రమే అనుకుంటారు గానీ నిజానికి ఇది పురుషుల సమస్య కూడా. దీనిబారిన పడిన పురుషుల ఛాతీ భాగంలో హార్మోన్ల మార్పులు కలిగి అక్కడి కణజాలం కుచించుకుపోతుంది. ప్రతి 1000 మంది పురుష క్యాన్సర్ రోగుల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కేసులతో పోల్చినప్పుడు ఈ సంఖ్య తక్కువే అయినా ఇటీవలికాలంలో పురుషుల్లో మరింత వేగంగా ఈ సమస్య ప్రబలుతోంది. మహిళల మాదిరిగా పురుషులు రొమ్ము క్యాన్సర్ విషయంలో శ్రద్ధ చూపకపోవడం, మహిళల్లో కనిపించే ఈ వ్యాధి లక్షణాలు పురుషుల్లో కనిపించకపోవడం వల్ల చివరి దశలోనే వ్యాధి బయటపడి ప్రాణాంతకంగా మారుతోంది.

కారణాలు

 • మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ పురుషుల్లోనూ పరిమితికి మించి ఉత్పత్తి కావటంతో వారి ఛాతీ కణజాలం పెరిగి మహిళల రొమ్ము మాదిరిగా పరిణామం చెంది క్యాన్సర్ గా మారుతుంది.
 • కొందరు పుట్టుకతోనే ఒక ఎక్స్ క్రోమోజోమును ఎక్కువగా కలిగి ఉండటంతో వారిలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరిగి రొమ్ము క్యాన్సర్ కు కారణమవుతుంది. పెద్దల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే తరువాతి తరం వారికీ ఇది సంక్రమించే ముప్పు ఉంటుంది.
 • ఇతర క్యాన్సర్లకు ఇచ్చిన రేడియేషన్ ప్రభావం వల్ల పురుషుల్లో ఒక్కోసారి రొమ్ము క్యాన్సర్ రావచ్చు.
 • పలు ఆధునిక వైద్య విధానాల సాయంతో ఛాతీని వెడల్పు చేయించుకొని వారిలోనూ ఈ సమస్య రావచ్చు.
 • పైకారణాలకు పొగతాగటం, మద్యపానం, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, హార్మోన్ల మందులు ఎక్కువ కాలం పాటు వాడటం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి.

లక్షణాలు

 • పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ సోకినప్పుడు రొమ్ములో చిన్న కణితి లేదా గట్టి గడ్డ ఏర్పడి అది క్రమంగా పెరుగుతూ విస్తరిస్తుంది. మహిళల ఛాతీ కంటే పురుషుల ఛాతీ వెడల్పు గనుక ఈ మార్పు స్ఫష్టంగా తెలిసిపోతుంది.
 • రొమ్ము కణితి తో బాటు చనుల చుట్టూ చర్మం పొలుసులుగా రాలిపోవడం, ఆ భాగంలో గుంత పడటం, చనుభాగంలో నొక్కితే నొప్పి, స్రావం కారటం, చంకల్లో గడ్డలు కనిపించటం

పరీక్షలు

 • సాధారణ మామోగ్రఫీ, అల్ట్రా సౌండ్ పరీక్షల సాయంతో పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ కణితిని గుర్తించవచ్చు.
 • బయాప్సి (కణితి నుంచి ముక్క తీసి పరీక్షకు పంపటం) లేదా సిరంజి సాయంతో రొమ్ము కణాలను సేకరించి పరీక్షించటం
 • చను మొనల స్రావాలు కనిపిస్తే వాటి నమూనాలను సేకరించి పరీక్షించటం
 • అవసరాన్ని బట్టి ఎంఆర్ ఐ, ఛాతీ ఎక్స్ రే, బోన్ స్కాన్ 

చికిత్సా విధానం

కణితి పరిమాణం, ఎక్కడ ఏర్పడినదనే అంశాలను బట్టి తగు పరీక్షలు చేసిన తర్వాతే చికిత్సా విధానాన్ని వైద్యులు నిర్ణయిస్తారు. ప్రాథమిక స్థాయిలో సర్జరీ ద్వారా కణితిని తీసేయటం, అవసరాన్ని బట్టి మొత్తం గ్రంథి మొదలు రొమ్మును కూడా తొలగించాల్సి వస్తుంది. క్యాన్సర్ రొమ్ముతో బాటు ఇతర శరీర భాగాలకు కూడా పాకితే రొమ్మును తొలగించటంతో బాటు రేడియేషన్ కూడా ఇవ్వాల్సి రావచ్చు.

రొమ్ము క్యాన్సర్ కారణంగా మెదడు, ఎముకల బలహీనత వంటి సమస్యలతో సతమతమయ్యే వారికి రేడియేషన్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. సర్జరీ, రేడియేషన్ తర్వాత రోగులకు ఉపశమనం కలిగించేందుకు యాంటీ హార్మోన్ డ్రగ్స్ ఇస్తారు. 

సామాజిక అవగాహన

తగినంత అవగాహన, సామాజిక చైతన్యం లేని కారణంగా ఇప్పటికీ పురుషులు ఈ సమస్య గురించి బయట చెప్పుకోలేరు. కొందరు వైద్య పరీక్షలకూ నిరాకరిస్తున్నారు. నిజానికి ఇవన్నీ సమస్య నుంచి పారిపోయే ప్రయత్నాలే. దీనివల్ల సమస్య మరింత ముదిరి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే సమయం వృధా చేయక వైద్యుడిని సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. అప్పుడే దీన్ని సమర్ధవంతంగా అరికట్టటం సాధ్యమవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE