ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత సంపాదించినా ఆరోగ్యంగా లేకుంటే ఉపయోగం లేదు. అయితే మనిషి ఈ దిశగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎయిడ్స్ వంటి సమస్యలు నేటికీ మానవాళిని వణికిస్తూనే ఉన్నాయి. ఈ ఒక్క సమస్య కారణంగా  ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ సమస్య పట్ల అవగాహనను పెంచేందుకు 1988 నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా డిసెంబర్ 1న ' ప్రపంచ ఎయిడ్స్ దినం'గా జరుపుతోంది. ఈ నేపథ్యంతో ఎయిడ్స్ కు సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. 

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హెచ్.ఐ.వి బారిన పడగా వీరిలో 25 లక్షల మందికి పైగా  పిల్లలే కావటం విషాదం. ఇప్పటివరకు సుమారు 3 కోట్లమంది ఎయిడ్స్ కారణముగా మరణించారు. వీరిలో అత్యధికులు ఆఫ్రికా ఖండం వారు కాగా రెండో స్థానం ఆసియాది. గత పదేళ్లుగా అటు ప్రభుత్వాలు, ఇటు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి కారణంగా భారత్‌లో కూడా ఎయిడ్స్ రోగుల సంఖ్య 5.70 నుంచి 2.56 కోట్లకు తగ్గటం ఆహ్వానించదగిన పరిణామం.

చాలామంది అనుకుంటున్నట్లు ఎయిడ్స్(అక్వయిర్‌డ్ ఇమ్యూనోఢిఫిషియన్సీ సిండ్రోమ్) అనేది ఒక వ్యాధి కాదు. ఇది కేవలం హెచ్.ఐ.వి( హ్యూమన్ ఇమ్యూనో డె ఫిసియన్సీ వైరస్) కారణంగా ఏర్పడిన అనారోగ్య లక్షణం మాత్రమే. హెచ్.ఐ.వి వైరస్ శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థను నాశనం చేసి శరీరంలోని జీవక్రియలను పూర్తిగా బలహీనపరచి అంతిమంగా మరణానికి దారితీస్తుంది. అయితే డయాబెటిస్‌ను మాదిరిగా పూర్తిగా నయం చేయలేకపోయినా జీవితాంతం మందులు వాడుకుంటే ఈ బాధితులు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. 

అరక్షత లైంగిక క్రియ, పచ్చబొట్లు, తల్లి నుంచి గర్భంలోని బిడ్డకు, స్వలింగ సంప్రకం, అపరిశుభ్రమైన ఇంజక్షన్‌లు, కలుషిత రక్తం ద్వారాహెచ్.ఐ.వి వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ శరీరంలో ప్రవేశించి సుమారు 3 నుంచి 6 నెలల వరకు నిద్రాణంగా ఉంటుంది. ఈ సమయాన్ని ‘విండో పిరియడ్’ అంటారు. ఈ దశ నుంచి ఎయిడ్స్ గా మారేందుకు కొన్ని ఏళ్ళ సమయం పట్టవచ్చు. అయితే నివారణే ఎయిడ్స్ ను ఎదుర్కొనే ఏకైక ఉత్తమ మార్గం. ఈ వైరస్ సోకకుండా టీకాలూ అందుబాటులో లేవు. ఒకవేళవైరస్ సోకినా వైద్యులను కలిసి మందులు వాడుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. గర్భవతులకు ఈ వైరస్ సోకినా కడుపులోని బిడ్డకు దీనివల్ల ఎలాంటి ఇబ్బ్బంది లేకుండా చేసే ‘యాంటి రిట్రోవైరల్ మందులు’ అందుబాటులో ఉన్నాయి. హెచ్‌ఐవీ బాధితులతో కలిసి ఉండటం, వారిని హత్తుకోవటం, కరచాలనం చేయటం, వారు వాడిన వంటపాత్రలు, ఇతర వస్తువులు వాడినా, వారితో కలిసి భోజనం చేసినా ఎయిడ్స్ రాదు.  అందుకే ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష చూపకుండా మానవీయ కోణంలో వారినీ అందరితో పాటు సమానంగా గౌరవిద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE