శారీరకంగానే గాక మానసికంగా కుంగదీసే చర్మ వ్యాధి విటిలిగో. వైద్య పరిభాషలో ల్యూకోడెర్మా గా పిలిచే దీన్నివాడుక భాషలో బొల్లి అంటారు. దీని బాధితుల్లో శరీర ఛాయను నిర్దేశించే  చర్మ కణాల పనితీరును   జన్యు లోపాలు, మానసిక ఒత్తిడి, పలు ఇతర కారణాలు ప్రభావితం చేసి క్రమంగా ఆ భాగపు చర్మం తెల్లగా మారతాయి. సాధారణంగా పెదవులు, కనురెప్పలు, కనుబొమ్మలు, మాడు, మర్మావయవాల వంటి సున్నితమైన భాగాల్లో ముందుగా ఈ మచ్చలు వస్తాయి. ఈ భాగాల్లో ఉండే వెంట్రుకలు సైతం తెల్లగా మారతాయి. బొల్లి వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఎలాంటి హానీ జరగదు. అయితే బాధితులు నలుగురిలో కలవలేక ఆత్మ న్యూనతకు గురవుతుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఈ సమస్యకు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 

అవగాహనే సగం పరిష్కారం

మచ్చలు ఎంతకాలంగా ఉన్నాయి? వాటి పరిమాణం ఎంత? శరీరంలో ఏ భాగంలో ఉన్నాయి? బాధితుడి జీవనశైలి, వైఖరి తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే వైద్యులు బొల్లికి తగిన చికిత్సను ఆరంభిస్తారు. ఈ చికిత్స ఒక్కక్కరిలో ఒక్కోలా ఉంటుంది. చికిత్సకు శరీరం స్పందించే తీరు, ఫలితాలు కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండొచ్చు. బొల్లి మచ్చలు ఎంత నెమ్మదిగా పెరిగి పెద్దవిగా మారుతాయో, చికిత్స తర్వాత కూడా అంతే నెమ్మదిగా తగ్గుతాయి. ఈ విషయం తెలియక చాలా మంది ఒకటి, రెండు నెలలు మందులు వాడి మందులను, వైద్యులను మారుస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల సమస్య మరింత జటిలం కావటమే గాక చికిత్సకు పట్టే సమయం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి తగిన అవగాహనను పెంచుకొని పూర్తికాలం చికిత్స తీసుకోవాలి. 

ఆధునిక చికిత్సలు

  • శరీరంలో ఉత్పత్తి అయ్యే మెలనిన్ అనే రసాయనం చర్మపు రంగును నిర్దేశిస్తుంది. అందుకే వైద్యులు స్టెరాయిడ్ క్రీములు, ఇతర మందుల సాయంతో మెలనిన్ నష్టాన్ని నివారించి శరీరం మీద మరిన్ని మచ్చలు రాకుండా, ఉన్న మచ్చలను కట్టడి చేసి తెల్లగా మారుతున్న చర్మాన్ని పూర్వస్థితికి వచ్చేలా చేస్తారు. 
  • బొల్లి చికిత్సకు ఫొటోథెరపీ ఒక ప్రత్యామ్నాయం. ఈ విధానాల్లోపరిమిత తీవ్రత గల అతినీలలోహిత కిరణాలను (అల్ట్రావయొలెట్ కిరణాలు) మచ్చల మీద పడేలా చేసి మచ్చలను అదుపు చేస్తారు. 
  • శరీరపు రోగనిరోధక శక్తిలో సానుకూల మార్పులు తేవటం ద్వారా బొల్లిని అధిగమించే విధానాలు కూడా కాస్త ఆలస్యం గానైనా సత్ఫలితాలను ఇస్తాయి. 
  • ఇప్పటికే 80 శాతం శరీరం తెల్లబడి తిరిగి పూర్వస్థితికి వచ్చే అవకాశమా లేనివారిలో డి-పిగ్మెంటేషన్ చికిత్స సాయంతో మిగిలిన నల్లని చర్మాన్ని కూడా తెల్లగా మార్చుతారు. 

బొల్లికి ఇప్పుడు పలు ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నందున బాధితులు మునుపటిలా ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరం లేదు. వీలున్నంత త్వరగా వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోగలిగితే కాస్త ఆలస్యంగానైనా ఈ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE