• HOME
  • ఆరోగ్యం
  • సత్వర గుర్తింపుతో అపెండిసైటిస్ ఆటకట్టు

 'అపెండిసైటిస్' అనగానే చాలామందికి తెలియని భయం. దీన్నే '24 గంటల నొప్పి' అనీ అంటారు. ఈ నొప్పి మొదలైన 24 గంటల్లో సర్జరీ చేయకుంటే మనిషి చనిపోతాడని అపోహ ఇప్పటికీ జనసామాన్యంలో బలంగా ఉంది.  చాలా సందర్భాల్లో మందులతో సమస్యను అధిగమించే అవకాశం ఉన్నా ఇప్పటికీ దీనిపట్ల భయం అలాగే ఉంది. అయితే సమస్య పట్ల కొద్దిపాటి అవగాహన ఉంటే దీనిని సమర్ధవంతంగా  అధిగమించవచ్చు.

సమస్యకు కారణం

  కడుపులో చిన్నపేగూ, పెద్దపేగూ కలిసేచోట ఉండే చిన్న తిత్తిలాంటి భాగం ఉండుకం(అపెండిక్స్‌).  పేగుల్లో భాగమే అయినా వంగి ఉండటం, దీని ప్రవేశ మార్గం చిన్నదిగా ఉండటం వల్ల ఎలాంటి పదార్ధాలూ లోపలి వెళ్లవు. దీనిలో తయారయ్యే స్రావాలు ఎప్పటికప్పుడు బయటకు వచ్చి పేగుల్లో కలిసిపోతుంటాయి. అయితే ఒక్కోసారి పేగుల్లో మలం లేదా నులిపురుగులు ఉండుకం ముఖద్వారానికి అడ్డుపడి వ్యర్థాలు లోపలే ఉండిపోయి వాపునకు గురవుతుంది. ఈ పరిస్థితిని 'అబ్‌స్ట్రక్టివ్‌ అపెండిసైటిస్‌' అంటారు. మరికొన్ని సందర్భాల్లో ఆహారం, నీటి ద్వారా పేగుల్లోకి చేరిన బ్యాక్టీరియా ఉండుకంలోకి ప్రవేశించి ఉండుకం వాపునకు కారణమవుతుంది. దీంతో ఆ భాగములో భరించలేని నొప్పి మొదలవుతుంది. దీన్ని 'ఇన్‌ఫెక్టివ్‌ అపెండిసైటిస్‌'అంటారు.

ప్రధాన లక్షణాలు

 అపెండిసైటిస్‌ సమస్య ఉన్నవారికి మొదట కడుపు నొప్పి వస్తుంది. ఈ నొప్పి బొద్దు చుట్టూ మొదలై క్రమంగా ఉండుకం వైపు పాకుతుంది. ఈ సమయంలో జ్వరం మొదలై ఎంతకూ తగ్గదు. ఒకటి రెండు సార్లు వాంతులు కూడా కావచ్చు. మనసు ఆహారం మీదికి పోనేపోదు. బాధితులు ఎడమ కాలును సులభంగా కదిలిస్తారు గానీ నొప్పి కారణంగా కుడికాలు కదపలేకపోతుంటారు. ఉండుకం భాగంలో వేలితో నొక్కితే విలవిలలాడిపోతారు.

తేడా గురించాలి

పొట్ట కుడివైపు వచ్చే ప్రతి నొప్పీ అపెండిసైటిస్ అనలేము. తీవ్ర విరేచనాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీఇన్ఫెక్షన్‌, ఉదరంలో లింఫ్‌ గ్రంథులు వాపు సందర్భాలలో సైతం పొట్ట కుడి భాగంలో నొప్పిగా ఉంటుంది.

 పరీక్షలు.. చికిత్స

పై లక్షణాలు ఉన్నప్పుడు సత్వరం వైద్యుడిని సంప్రదిస్తే వారు లక్షణాలను బట్టి అపెండిసైటిస్ ను గుర్తిస్తారు. లక్షణాలు అస్పష్టంగా ఉంటే అల్ట్రాసౌండ్‌ పరీక్ష, రక్తపరీక్షలు చేసి సమస్యను నిర్ధారిస్తారు. ఇన్ఫెక్షన్ ప్రాథమిక దశలో ఉంటే మందులతోనే పరిస్థితిని దారికి తెస్తారు. సమస్య తగ్గినా మళ్ళీ ఇన్ఫెక్షన్ బలపడే ప్రమాదం ఉంటే సర్జరీ చేస్తారు. ఒక్కోసారి సమస్యను నిర్లక్ష్యం చేసి కాలం గడిపితే ఉబ్బిన ఉండుకం పగిలి అందులోని చీము, మలం పొట్ట అంతా వ్యాపించి పేగులు అతుక్కుపోవటం, ఇతర అవయవాల పనితీరు దెబ్బతినటం వంటి సమస్యలు రావచ్చు. అందుకే పై లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా కోరాలి.  

 గమనిక:  ఊబకాయులైన పిల్లల్లో అపెండిసైటిస్ సమస్య తలెత్తినా ఉండుకం భాగంలో పెద్దగా నొప్పి తెలియదు. ఇలాంటి వారిలో సమస్య ముదిరి ఉండుకం పగిలే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే బొద్దుగా ఉండే  పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే సత్వరం వైద్య సలహా కోరాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE