• HOME
  • ఆరోగ్యం
  • మోకాలి చిప్ప మార్పిడి... అపోహలు,వాస్తవాలు 

వయసు పైబడేకొద్దీ వచ్చే సమస్యలో మోకాలి నొప్పి ఒకటి. పెద్ద వయసు వచ్చే సరికి మోకాలి చిప్ప భాగపు జిగురు వంటి సున్నితమైన కణజాలం నశించి మోకాలి ఎముకల మధ్య రాపిడికి కారణమై, అంతిమంగా భరించలేని నొప్పిగా పరిణమిస్తుంది. మోకాలి చిప్ప మార్చుకోవటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రస్తుతం అందివచ్చిన ఆధునిక వైద్య విధానాల సాయంతో  సులభంగా, చౌకగా ఈ మోకాలి చిప్ప మార్పిడి చేయవచ్చు. అయితే ఈ అంశంపై జనసామాన్యంలో ఉన్న అపోహల కారణంగా ఇప్పటికీ అవకాశం ఉన్నవారు సైతం ఇందుకోసం చొరవగా ముందుకు రావటం లేదు. అవగాహనే ఈ అపోహలను దూరం చేయగల ఏకైక మార్గం. ఈ నేపథ్యంలో మోకాలి చిప్ప మార్పిడి పై నెలకొని ఉన్న కొన్ని బలమైన అపోహలు, వాటి వెనక వాస్తవాలను పరిశీలిద్దాం. 

అపోహ: ఈ సర్జరీ అందరికీ సక్సెస్ కాదు.  

వాస్తవం:  ఇది పూర్తిగా అవాస్తవం. మంచి సౌకర్యాలు, నిపుణులున్న ఆసుపత్రిలో చేస్తున్న ప్రతి 100 మోకాలి మార్పిడి సర్జరీల్లో 95 విజయవంతం అవుతున్నాయి. ఒక్క అమెరికాలో ఏటా 6 లక్షల మంది మోకాలి చిప్ప మార్పిడి చేయించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి . మనదేశంలో దీన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్యా ఏటికేడు పెరుగుతోంది. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే ఏడాదిలో  సుమారు 5వేలకు పైగా సర్జరీలు జరుగుతున్నాయి. వీటిలో నూటికి 90 శాతం కేసులు విజయవంతం అవుతున్నాయి. 

అపోహ: బీపీ, షుగర్ ఉన్నవారికి వైద్యులు మోకాలి చిప్ప మార్పిడి చేయరు. 

వాస్తవం: ఇది పూర్తిగా అపోహే. బీపీ, షుగర్ బాధితులు నిరభ్యంతరంగా మోకాలి చిప్ప మార్పిడి చేయించుకోవచ్చు. అయితే మోతాదుకు మించి బీపీ, షుగర్ చికిత్స ఉంటే శస్త్ర చికిత్స కష్టం గనుక వాటిని వైద్యులు ముందుగా వాటిని అదుపులోకి తెచ్చిన తర్వాత ఈ సర్జరీ చేస్తారు. 

అపోహ: మోకాలి చిప్ప మార్పిడి తరువాత పూర్వం మాదిరిగా మోకాలు వంగదు.

వాస్తవం: బహుకొద్దిమందిలో అదీ.. వారి నిర్లక్ష్యం వల్ల ఇలా జరగొచ్చు. నిజానికి ఇది సర్జరీ తర్వాత తీసుకొనే ఫిజియో థెరపీ వంటి కొనసాగింపు చికిత్స మీద ఆధారపడి ఉంటుంది. కొందరు దీనిమీద సరైన శ్రద్ధ పెట్టని వారిలోనే ఇలా జరుగుతుంది. సర్జరీకి ముందు కాలు పరిస్థితిని బట్టి కూడా కాలు వంగటం ఆధారపడి ఉంటుంది మొత్తంమీద నూటికి 80 శాతం మంది సర్జరీ తర్వాత  మునుపటి కంటే మెరుగైన రీతిలో కాలు వంచగలరు. 

అపోహ: మోకాలి చిప్ప మార్పిడి తర్వాత డ్రైవింగ్‌ చేయలేము.

వాస్తవం: ఇది పూర్తిగా అపోహ మాత్రమే. సర్జరీ తర్వాత మునుపటికంటే సౌకర్యంగా, కేవలం 2 నెలల తర్వాతే డ్రైవింగ్‌ చేయొచ్చు. 

అపోహ:  మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ తర్వాత నేలమీద సౌకర్యంగా కూర్చోలేము.

వాస్తవం: ఇది సర్జరీ అందుబాటులోకి వచ్చిన తొలినాళ్ల(15 ఏళ్ళ క్రితం) నాటి మాట. ఆధునిక చికిత్సా విధానాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో సర్జరీ తర్వాత ఒకటి రెండు వారాల్లోనే ఎంచక్కా నేలమీద కూర్చొని పూజ చేసుకోవటం, నమాజ్ సైతం చేసుకోవచ్చు. ముందుగా మీ అవసరాలను వైద్యుడికి వివరించటం, అమర్చిన పరికరాల స్థాయి, వైద్యుల నైపుణ్యం, బాధితుడి శారీరక స్థితి తదితర  అంశాలను బట్టి కూడా ఈ ఫలితం ఉంటుంది. 

అపోహ: వయసు పైబడిన తర్వాత మోకాలి చిప్ప మార్చినా చెప్పుకోదగ్గ మార్పు ఉండదు.

వాస్తవం: ఇది అపోహ మాత్రమే. వ్యక్తి ఆరోగ్యం బాగుంటే 55 నుంచి 88 ఏళ్ళ వరకు ఈ సర్జరీ చేయొచ్చు. చక్కగా పనిచేస్తుంది కూడా. 

అపోహ: 35 ఏళ్ళ లోపు వారికి మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ చేస్తే దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయి.

వాస్తవం: ఇది సదరు వ్యక్తి ఆరోగ్యం, అవసరాలను బట్టి ఉంటుంది. వైద్యులు సాధారణంగా ప్రమాదాల గాయాలు లేదా రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వల్ల నొప్పి వస్తుంటే ఈ సర్జరీ  సిఫారసు చేస్తారు. ఆస్టియో ఆర్ధరిటిస్‌ బారిన పడిన యువతీ యువకులకు వారి వారి పరిస్థితిని బట్టి వైద్యురాలు తగు పరిష్కారాలను సూచిస్తారు. 

అపోహ:  మోకాలి చిప్ప మార్పిడి చేసిన 10 ఏళ్ళకే అరిగిపోతుంది గనుక మళ్ళీ 10 ఏళ్లకు సర్జరీ తప్పదు.

వాస్తవం: ఇది నిరాధార వాదన. శరీర బరువు, వృత్తి, ఆరోగ్యం, తీసుకొనే జాగ్రత్తలు వంటి ఎన్నో అంశాలను బట్టి అరుగుదల ఆధారపడి ఉంటుందితప్ప అందరికీ ఆ అవసరం వస్తుందని నిర్ధారించి  చెప్పలేము. కొందరిలో అమర్చిన 10 ఏళ్లకే చిప్ప అరిగిపోవచ్చు. అలాంటివారికి మాత్రమే మళ్ళీ రివిజన్‌ సర్జరీ అవసరం అవుతుంది. 

అపోహ: కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేసే  మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ మాత్రమే సక్సెస్ అవుతుంది.

వాస్తవం:  అనుభవజ్ఞుడైన సర్జన్‌, సౌకర్యాలున్న ఆసుపత్రి,  నాణ్యమైన, అవసరాలకు తగిన ఇంప్లాంట్‌ సమకూరితే సర్జరీ ఎక్కడ చేసినా సఫలమవుతుంది తప్ప అది కార్పొరేట్ ఆసుపత్రిలోనే సాధ్యమని చెప్పలేము.  

అపోహ: అధిక ధర ఉండే ఇంప్లాంట్స్‌ మాత్రమే  బాగా పనిచేస్తాయి.

వాస్తవం: ఇంప్లాంట్స్‌ ఎంపిక విషయంలో ధరతో బాటు వాటి గత చరిత్ర, డిజైన్, నాణ్యతా ప్రమాణాలనూ పరిగణలోకి తీసుకోవాలి.  ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలు తయారీ సంస్థలు చక్కని ప్రమాణాలతో వీటిని అందిస్తున్నాయి. ఏటా వీటి ధర తగ్గి, మధ్యతరగతి వారికి సైతం అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం ధర తక్కువని వీటి పనితీరును తగ్గించి చూపలేము. 

అపోహ: పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ బదులు టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ చేయించుకోవటం మంచిది. 

వాస్తవం: పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ విధానంలో పాత కీలుతో బాటు లిగమేట్స్‌ను అలాగే ఉంచుతారు. పైగా ఇది చిన్న కోతతో పూర్తవుతుంది. వేగంగా కోలుకుంటారు. కనుక వ్యక్తికీ మానసికంగా కొంత రిలీఫ్ ఉంటుంది. టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ విషయంలో కాస్త భిన్నమైన పరిస్థితి ఉంటుంది. ఈ రెంటిలో ఏది అవసరం అనేది మాత్రం వైద్యులు మాత్రమే నిర్ణయించాల్సిన అంశం. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE