• HOME
 • ఆరోగ్యం
 • వేసవిలో గర్భిణుల ఆరోగ్యం.. జాగ్రత్తలు

వేసవిలో గర్భిణులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భం ధరించినప్పుడు శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉండటం, వేవిళ్ల మూలంగా వాంతులై శరీరంలో నీటి శాతం వేగంగా పడిపోయే ముప్పు వేసవిలో మరింత ఎక్కువ. దీనికితోడు గర్భిణులకు ఎదురయ్యే ఇతర అనారోగ్య సమస్యలు ఉండనే ఉంటాయి. నిపుణులు సూచించే ఈ దిగువ సలహాలను పాటించటం ద్వారా వేసవిలో గర్భిణులు చక్కని ఆరోగ్యంగా ఉండొచ్చు. అవి.. 

 • వేసవిలో ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల వల్ల గర్భిణుల్లో నీటిశాతం పడిపోతుంది. అందుకే వీరు దాహంతో నిమిత్తం లేకుండా కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూనే ఉండాలి. ఒకవేళ వేవిళ్ల వల్ల వాంతులు అవుతున్నా నీరు తాగటం మానొద్దు.
 • వేసవిలో గర్భిణులు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. అలాగే.. మజ్జిగ, పండ్లరసాలు, కొబ్బరి నీరు తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వేసవిలో టీ, కాఫీ లకు బదులు గ్రీన్‌ టీ, రాగిజావ, నిమ్మరసం తాగటం మంచిది. మసాలా వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
 • కొన్ని అపోహల కారణంగా గర్భిణులకు మోతాదుకు మించిన ఆహారం ఇస్తుంటారు. దీనివల్ల వేసవిలో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కొద్దికొద్దిగా ఎక్కువ సార్లుగా ఆహారం తీసుకోవాలి.
 • ముఖ్యంగా గర్భిణుల్లో మధుమేహం, బీపీ పెరిగే అవకాశం ఎక్కువ కనుక అతిగా స్వీట్లు, నిల్వ పచ్చళ్లు తీసుకోవద్దు. గర్భిణులలో నీటిశాతం తగ్గడం వల్ల కాళ్ల వాపులొచ్చే ఇబ్బంది ఉంటుంది గనుక ఉప్పు వాడకం తగ్గించాలి.
 • వేసవిలో గర్భిణులు వదులైన, మెత్తని నూలు దుస్తులు ధరించాలి. దీనివల్ల తగినంత గాలి ఆడటమే గాక పట్టిన చెమటను దుస్తులు పీల్చుకుంటాయి. ముదురు రంగుల స్థానంలో లేత రంగుల దుస్తులు వాడటం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది.
 • వేసవిలో గర్భిణులు రోజూ సూర్యోదయ వేళ , సూర్యాస్తమయం తర్వాత కనీసం 40 నిమిషాలు నెమ్మదిగా వాకింగ్‌ చేయటం మంచిది. దీనివల్ల రక్తప్రసరణ మొదలు పలు జీవక్రియలు చురుగ్గా ఉండటమే గాక ఉల్లాసంగా ఉంటుంది. వాకింగ్ చేసేటప్పుడు మెత్తని షూ వేసుకుంటే గాయాల ముప్పు ఉండదు.
 • గర్భిణులు వేసవిలో తలకు కొబ్బరినూనె రాస్తే మాడు చల్లబడి తలనొప్పి వంటి బెడద ఉండదు. స్నానానికి గోరు వెచ్చని నీరు వాడితే శరీరానికి తగినంత విశ్రాంతి కూడా లభిస్తుంది.
 • మధ్యాహ్నం వేళ ఇంటిపట్టునే ఉండటం, ఒకవేళ అవసరమైతే బస్సు, కారు వంటి వాహనాల్లో వెళ్ళటం మంచిది. ఇలా వెళ్లే సమయంలోనూ ముక్కు, చెవులు కప్పేలా తలకు బట్ట చుట్టుకోవటం మరువొద్దు.
 • గర్భిణులు తగినంత గాలి, వెలుతురుండే గదుల్లో పడుకోవాలి. ఏసీ, కూలర్‌ల్లో ఎక్కువ గాలి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటినిండా నిద్ర పోవాలి.
 • వేసవిలో గర్భిణుల్లో కొద్దిగా చిరాకు, ఆందోళన, భయం ఉండటం సహజమే. వీటిని అధిగమించేందుకు సంగీతం వినటం, జోక్స్ చదవటం, కంటి నిండా నిద్రపోవటం, కుటుంబ సభ్యులతో గడపటం, పచ్చని మొక్కలు మధ్య తిరగటం వంటివి చేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE