ప్రేమకు చిహ్నంగా హృదయాని సూచించటం మనందరికీ తెలుసు. కానీ మనలో ఎంతమంది నిజంగా హృదయాన్ని ప్రేమిస్తున్నామనేది మాత్రం అనుమానమే. జీవితమంతా అలుపు, సొలుపూ లేకుండా పని చేసే గుండె గోడు వినకపోవటం వల్లే ఈరోజుల్లో యువకులు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తముగా నమోదవుతున్న మరణాలలో గుండెపోటు కారణంగా సంభావిస్తున్నవే ఎక్కువ. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే గుండెకు సంబంధించిన చాలా అనారోగ్యాలను ఆరంభంలోనే నివారించవచ్చు. అందుకు దోహదపడే పది అంశాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సమస్యను గుర్తించటం
గుండె పనితీరు మీద స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే దాని గోడేమిటో సరిగా అర్థమవుతుంది. ఈ అవగాహన లేకపోవటం వలెనే చాలా మంది గుండె నొప్పిని గ్యాస్ వల్ల వచ్చే సమస్యగా పొరబాటు పడుతుంటారు. గుండెనొప్పి ఉన్నప్పుడు ముందు ఛాతీలో అసౌకర్యంగా ఉండి, క్రమంగా గుండెల్లో మంట, గుండె బరువు వంటి లక్షణాలుగా మారుతుంది. కొందరిలో ఇది గుండె మధ్య భాగానికి, అక్కడినుంచి మెడ, దవడ, భుజ భాగాలకు పాకుతుంది. మరికొందరిలో చెమట పట్టటం, తల తిరగటం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
కొలెస్ట్రాల్ ముప్పు
రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువయ్యే కొద్దీ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలకు సమస్య మొదలవుతుంది. ఇది మంచి, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలుగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగానూ, చెడు కొలెస్ట్రాల్ తక్కువగానూ ఉండేలా చూసుకోవటం ద్వారా గుండెకు ఇబ్బంది రాకుండా చోసుకొవచ్చు. మంచి కొలెస్ట్రాల్ పురుషులకు 45, మహిళలకు 55 కంటే ఎక్కువగా ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ వంద లోపు ఉండేలా చూసుకోవాలి.
రక్తపోటు,చక్కెరల ప్రభావం
నలభై ఏళ్ళు దాటిన వారంతా రక్తంలో చక్కెర నిల్వల గురించి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం మంచిది. కుటుంబ పెద్దల్లో ఎవరికైనా మధుమేహం, ఊబకాయం, రక్తపోటు వున్నాలేక నీడపట్టున ఉండి పని చేసుకునే ఉద్యోగులయినా తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలి. 120/80 రక్తపోటు ఎక్కువ వున్నవారు జీవనశైలి మార్పులకు సిద్దం కావటం మంచిది. రక్తపోటు 140/90 దాటినా వారు తక్షణం వైద్య సలహా తీసుకోవటం తప్పనిసరి.
ఒళ్లువంచాల్సిందే
శారీరక దృఢ త్వం ఎక్కువగా ఉన్న వారితో పోల్చినప్పుడు అది తక్కువగా ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే వారానికి కనీసం అయిదు రోజులు ముప్పావు గంట సమయం ఏదో ఒక వ్యాయామం చేయాల్సిందే. రోజూ సాధన చేస్తూ క్రమంగా ఈ సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. శరీర బరువు తరచూ మారకుండా జాగ్రత్త పడాలి.
కుటుంబ చరిత్ర
గుండె జబ్బులకు దోహదపడే మరో ప్రధాన మైన అంశం జనుపరమైన కారణాలు. అందుకే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 65 ఏళ్ళ లోపు గుండెజబ్బుల చరిత్ర వుండి, కాస్త అనుమానాస్పద లక్షణాలున్నప్పుడు ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది.
నో స్మోకింగ్
పొగతాగని వారితో పోల్చినప్పుడు తాగేవారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం సుమారు రెట్టింపుగా ఉంటుంది . అందుకే ఈ అలవాటున్నవారు తక్షణం దానికి స్వస్తి పలకటం అవసరం. కాస్త కష్టమే అయినా ఈ అలవాటును మానుకోగలిగితే రెండేళ్ళల్లో గుండెపోటు వచ్చే అవకాసం బాగా తగ్గిపోతుంది. అవసరమైతే వైద్యుల సలహా మీద నికోటిన్ గమ్స్ కూడా ప్రయత్నిచి చూడొచ్చు.
బలమైన ఆహారం
మంచి పోషకాలున్న ఆహారంతో బాటు తాజా పండ్లు,కూరగాయలు, మొలకెత్తిన గింజలు రోజూ తీసుకుంటే గుండె సమస్యల ముప్పు బాగా తగ్గినట్లే .
ఒత్తిడిని జయించటం
వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ఒత్తిడిని ఎప్పటికప్పుడు అధిగమిస్తే గుండెపోటు ముప్పు సగం తగ్గినట్లే . యోగ, ధ్యానం, వంటి సాధనాలతో మనసును ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవటం ఎంతయినా అవసరం.
ముందు జాగ్రత్తలు
గతంలో ఒకసారి గుండెపోటు వచ్చినవారు లేక ఆ తరహా లక్షణాలు కనిపించిన వారు యాస్పిరిన్ వంటి మందులను దగ్గరున్చుకోవటం అవసరం. అనుకోకుండా గుండెపోటు వస్తే వీలున్నంత త్వరగా వైద్య సహాయం పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలి .
మద్యానికి వీడ్కోలు
ఒకసారి గుండె సమస్య వచ్చిన తర్వాత ఇక మద్యం జోలికి పోవద్దు . ఎలాంటి అనారోగ్యం లేనివారు సైతం ఒకటి, రెండు పెగ్గులకు పరిమితమయితే మంచిది.