ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు నూటికి తొంభై మంది  డాక్టర్ సలహా కోరటమో లేక తెలిసిన మందూ మాకూ వాడటమో చేస్తుంటారు. సమస్యకు ఇవి తప్ప మరో పరిష్కారం లేదనేది వీరి భావన. అయితే  విశ్వం నుంచి అనంతంగా ప్రసరిస్తున్న ప్రకృతి శక్తికి పలు రకాల రుగ్మతలను నివారించే, నయం చేసే శక్తి ఉందని తెలుసుకున్న తర్వాత మాత్రం వీరు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. తీవ్రమైన భౌతిక, మానసిక సమస్యలను ఎదుర్కొని, వాటిని నయం చేసుకునే శక్తీ మనిషికి జన్మతహా సంక్రమిస్తుంది. అయితే మనలోని పలు ప్రతికూల భావనల మూలంగా ఈ శక్తిని అందుకోలేక పోతున్నాము. ఈ ఇబ్బందిని అధిగమించిన వారికి  కేవలం ఈ శక్తితోనే తీవ్రమైన  వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంది.

కొందరు ఈ ప్రాణ శక్తిని పవిత్రమైన దైవిక శక్తిగా భావిస్తారు. ప్రేమ, సుహృద్భావం, శాంతి, క్షమ వంటి గుణాలున్న వారు మరింత సులభంగా ఈ ప్రాణ శక్తిని సొంతం చేసుకోగలరు. ధ్యానం, యోగా, ప్రాణాయామం, వ్యాయామం చేసే అలవాటున్న వారూ ఈ ప్రాణిక శక్తిని  ఇతరుల కంటే వేగంగా అందిపుచ్చుకోగలరు.

సాధనా విధానం: చాలామంది అపోహ పడుతున్నట్లు ఈ శక్తిని పొందటం అంత కష్టమైన వ్యవహారమే... కాదు. చేయాల్సిన  సాధన చేయగలిగితే ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ ఈ శక్తి సొంతమవుతుంది. ఈ సాధనకు సంబంధించిన కొన్ని వివరాలు...

  • పూర్తి ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో సుఖాసనంలో కూర్చోవాలి. మనసులోని ఆలోచనలను పక్కకుబెట్టి ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆసాంతం ఆస్వాదించడానికి ప్రయత్నించండి.
  • నెమ్మదిగా కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాసను పీల్చి వదలాలి. ఇలా కనీసం అయిదు నిమిషాల పాటైనా చేయాలి.
  • ఇప్పుడు శ్వాసను సాధారణ స్థాయికి తీసుకొచ్చి మనసును పూర్తిగా శ్వాస మీదే నిలపాలి. ప్రతి ఉచ్చ్వాస, నిశ్వాసలను నిశితంగా గమనిస్తూ సాధనను కొనసాగించాలి.
  • విశ్వం నుంచి అపారమైన ప్రాణ శక్తి వర్షిస్తున్నట్లు, తీసుకునే ప్రతి శ్వాసలోనూ ఆ ప్రాణ శక్తి మనలోకి ప్రవే శిస్తున్నట్లు ఊహించుకోవాలి.
  • తెల్లని మిరుమిట్లు గొలిపే ఆ పవిత్రమైన ప్రాణ శక్తి శరీరంలోని అన్ని చక్రాలనూ శుద్ది చేస్తున్నట్లు భావించండి.

 రోజూ పావు గంట నుంచి ఇరవై నిమిషాలపాటు ఈ విధంగా సాధన చేయటంతో బాటు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.  వేగంగా, మెరుగైన ఫలితాలు  కోరేవారు రోజుకు రెండు, మూడు సార్లు దీనిని సాధన చేయాలి.

సాధనకు సంసిద్ధత: ఏదైనా పని ఆరంభించినప్పుడు కాస్త స్థిమితంగా కూర్చొని మానసికంగా, శారీరకంగా  మనల్ని  మనం సిద్ధం చేసుకున్నట్లే, ప్రాణ శక్తి విషయంలోనూ ఈ తరహా సన్నద్ధత అవసరం. ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన మరి కొన్ని అంశాలు..

పరిశుభ్రత: సాధన చేసేముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాధన చేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా వుండాలి.

ఏకాగ్రత: మనసులోని అన్ని ఆలోచనలనూ పక్కన బెట్టి ఇదే అంశం మీద దృష్టి నిలపాలి. మొదట్లో ఇది కాస్త కష్టమే అయినా కాలం గడిచేకొద్దీ అలవాటవుతుంది.

ప్రార్థన: ప్రాణశక్తి సాధనలో ప్రార్థనలు, ఆయా వ్యక్తుల ఆధ్యాత్మిక ఆసక్తులు ఎంతగానో దోహదపడతాయి. ప్రతి రోజూ సాధనకు ముందు సమర్పణా భావనతో విశ్వవ్యాపితమైన ఆ ప్రాణ శక్తికి విధేయత ప్రకటిస్తూ ఆహ్వానించాలి. సాధన తర్వాత ధన్యవాదాలు తెలపటం మరచిపోవద్దు. దురలవాట్లను వదులుకుని, సాత్వికమైన ఆలోచనలతో సాధన చేస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. నేను అన్న అహాన్ని వదులుకుని, అనంత విశ్వంలో నేనూ భాగమేనని భావిస్తూ సాధన చేయాలి.

ప్రాణశక్తి కేవలం వ్యాధుల నివారణ, చికిత్సలకే గాక  జ్ఞాపక శక్తి పెరుగుదలకూ ఉపయోగపడుతుంది. గతంలోని విభేదాలను మరచి, అందరితో స్నేహభావంతో మెలిగేందుకు కూడా ఇది దోహదపడుతుంది. ఆత్మాన్వేషణలో ఉన్నవారికి ఈ శక్తి మరింత సులువుగా సొంతమవుతుంది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE