ఇటీవలి కాలంలో హెపటైటిస్ కేసులు చాలా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1. కోట్ల హెపటైటిస్ కారక మరణాలు సంభవిస్తున్నాయంటే సమస్య తీవ్రత ఎంతో ఊహించవచ్చు. చాలామంది అనుకొంటున్నట్లు హెపటైటిస్ జబ్బు కాదు. ఇది కేవలం కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం మాత్రమే. ఏ, బి,సి,డి,ఈ అనే ఐదు రకాల హెపటైటిస్‌ వైరస్ ల కారణంగా కాలేయం వాపునకు గురై ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాగని ఇది ప్రాణాంతక సమస్యేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్ని పూర్తిగా నివారించటమే గాక దీనికి ఇప్పుడు మంచి చికిత్సా అందుబాటులో ఉంది. ఈ సమస్య గురించి సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఏటా జులై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సమస్య గురించి మరింత సమాచారం..

రకాలు 

హెపటైటిస్-ఏ

 కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా మలవ్యర్థాలు తాగు నీటితో కలవడం వల్ల వ్యాప్తిచెందుతుంది.  ఏటా కోటీ నలభై లక్షల ఈ తరహా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది వికారం, వాంతులు, కామెర్లతో ఇది బయటపడుతుంది. ఇది చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. ఈ వైరస్ బాధితుల్లో జ్వరం, ఆకలి లేమి, నీళ్ల విరేచనాలు, కడుపులో ఇబ్బంది, మూత్రం పచ్చగా రావడం, లక్షణాలూ ఉండకపోవచ్చు. ఈ లక్షణాలు బయటపడేందుకు 2-6 వారాలు పట్టవచ్చు. ప్రత్యేక రక్తపరీక్ష, రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్) పరీక్షల సాయంతో ఈ వైరస్ నిర్ధారణ చేస్తారు. టాయెలెట్ల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత తో బాటు సురక్షిత నీరు వాడటం ద్వారా దీన్ని పూర్తిగా నివారించొచ్చు. దీని నివారణకు పలు టీకా మందులు అందుబాటులో ఉన్నాయి.

హెపటైటిస్-బి

 అన్నిహైపటైటిస్‌ వైరస్‌లలోనూ ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ వైరస్ వ్యక్తి శరీరం బయటా 7 రోజుల పాటు సజీవంగా ఉండగలదు. ఏటా దాదాపు 7,80,000 మంది దీనివల్ల మరణిస్తున్నారు. గర్భవతి అయిన తల్లి నుంచి బిడ్డకూ, సెక్స్ ద్వారా, ఒకరు వాడిన సూది మరొకరు వాడటం వల్ల, అజాగ్రత్తగా వాడిన పచ్చబొట్టు పరికరాల వల్ల ఇది వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకినవారిలో కామెర్లు, మూత్రం చాలా పచ్చగా రావడం, తీవ్రమైన అలసట, నీరసం, వికారం, వాంతులు, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ దీర్ఘకాలం కాలేయంపై ప్రభావం చూపితే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌గా మారొచ్చు. 90 శాతం మంది యువకుల్లో ఇది ఆర్నెల్లలో దానంతట అదే తగ్గిపోతుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించాక సగటున 3 నెలల్లో లక్షణాలు బయట పడొచ్చు. సాధారణ రక్త పరీక్షతో దీన్ని గుర్తించవచ్చు. దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. సమతుల ఆహారం ఇస్తూ రోగిని సౌకర్యవంతంగా ఉంచడం, లక్షణాలను తగ్గించే మందులు ఇవ్వడం (సింప్టమాటిక్ ట్రీట్‌మెంట్) మాత్రమే దీనికి చేయగల చికిత్స. ఒకవేళ కాలేయ క్యాన్సర్ గా మారితే ఆ భాగం తొలగించాల్సిరావచ్చు. దీని నివారణకు ఇప్పుడు టీకా అందుబాటులో ఉంది. బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఈ టీకా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు, డయాలసిస్ పేషెంట్స్, ఇంజెక్షన్స్ చేయించుకునే వారు, సెక్స్‌వర్కర్స్, ఒకరి కంటే ఎక్కువగా సెక్స్ భాగస్వాములు ఉన్నవారు, దూర ప్రయాణాలు చేసేవారు ముందు జాగ్రత్తగా ఈ టీకా తీసుకోవడం మంచిది.

హెపటైటిస్- సి

 స్టెరిలైజ్ చేయని వైద్య పరికరాల వినియోగం, ఒకరు వాడిన సూదులు మరొకరు వాడటం, సెక్స్ వల్ల, తల్లి నుంచి గర్భస్థ శిశువుకు ఇది వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన 80 శాతం మందిలో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. కానీ కొందరిలో జ్వరం, నీరసం, ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, మలం నల్లరంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు బయటపడటానికి రెండు వారాల నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. ఏ లక్షణాలు కనిపించని కారణంగా ఇది చాలా ఆలస్యంగా బయటపడుతోంది. ఈ లోపు ఇది కాలేయాన్ని బాగా దెబ్బతీస్తోంది. రక్తపరీక్షతో బాటు న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష ద్వారా దీన్ని గుర్తించొచ్చు. సంక్రమించిన 15 - 45 శాతం మందిలో ఇది దానంతట అదే తగ్గిపోతుంది. ఇప్పటివరకూ హెపటైటిస్-సి కి టీకా అందుబాటులో లేదు గనుక నివారణే దీనికి ఉన్న ఏకైక మార్గం.

హెపటైటిస్-డి

ఇది డ్రగ్స్ వాడే వారిలో ఎక్కువగానే కనిపిస్తుంది. హెపటైటిస్-బి సాయం లేకుండా ఇది వ్యాప్తి చెందలేదు గనుక దీన్ని ఉప-వైరస్‌గా పరిగణిస్తారు. ఇది హెపటైటిస్-బితో పాటూ లేక హెపటైటిస్-బి సంక్రమించిన తర్వాతా రావచ్చు. అయితే ఎలా సంక్రమించినా ఇది హెపటైటిస్-బి కంటే కాలేయం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇదీ హెపటైటిస్-బి వ్యాపించే కారణాల వల్లే వ్యాపిస్తుంది. కనుక దీని హెపటైటిస్-బి నివారణకు వాడే మార్గాలే దీని నివారణకూ దోహదపడతాయి. హెపటైటిస్-బి టీకాతో దీనికీ రక్షణ లభిస్తుంది.

హెపటైటిస్-ఈ 

ఇది కలుషితమైన నీరు, ఆహారం వల్ల వ్యాప్తి చెందే ఈ వైరస్ 4-6 వారాల్లో పూర్తిగా తగ్గుతుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మంది కొత్తగా దీని బారిన పడుతున్నారు. మలం కలిసిన నీరు తాగటం, వాడటం, రక్తమార్పిడి,గర్భవతికి ఇన్ఫెక్షన్ ఉంటే బిడ్డకు సోకుతుంది. కామెర్లు, ఆకలి లేమి, కాలేయవాపు, పొత్తికడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా 1-2 వారాల్లోఅవే తగ్గిపోతాయి. గర్భిణుల్లో దీని దుష్ఫలితాలు ఎక్కువ. ఈ వైరస్‌కు టీకా అందుబాటులో లేదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE