ఇప్పటిరోజుల్లో మనం చూస్తున్న రోగాల్లో నూటికి 80 శాతం అనారోగ్యకరమైన జీవన శైలి వల్లే వస్తున్నాయి. గతంలో నడివయసు తర్వాత కనిపించే మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు ఇప్పుడు నిండా 20 ఏళ్ళు లేనివారికీ రావటం మనం చూస్తున్నాం. మనదేశంలో 40-60 ఏళ్ళ మధ్య వయస్కుల్లో ఏటా 1. 3 కోట్ల మంది జావనశైలి రోగాల వల్లే మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే జీవనశైలి రోగాల విషయంలో తగు జాగ్రత్త అవసరం.
ప్రధాన కారణాలు
- వేళకు తినకపోవడం, విశ్రాంతి లేకుండా పనిచేయటం, ఎడతెగని ప్రయాణాలు, నిద్రలేమి
- నైట్ షిఫ్ట్ పని, రోజుకో షిఫ్ట్ లో పనిచేయటం, మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వినియోగం
- రోజంతా కూర్చొని పనిచేయటం, ఏసీ గదుల్లో కంప్యూటర్ మీద విరామ లేకుండా పనిచేయటం
ఇవీ సమస్యలు
- జీవనశైలి రోగాల్లో మొదటిది.. ఊబకాయం. దీని బాధితుల్లో హార్మోన్ల ఉత్పత్తి, పనితీరులో మార్పులు, మలద్వార, పెద్దపేగు, బ్రెస్ట్ కేన్సర్లు, థైరాయిడ్ వంటి సమస్యల ముప్పు అధికం. ఈ సమస్య నివారణ, కట్టడికి తగిన ప్రణాళిక అవసరం. మనదేశంలో సగం మంది ఏదో రకమైన మధుమేహం బాధితులే. గుండెజబ్బుల మొదలు పలు అనారోగ్యాలకు ఇదే మూలం.
- నిశ్శబ్ద హంతకిహెగా పేరున్న అధిక రక్తపోటు( హైబీపీ) ఇప్పుడు 30 ఏళ్లకే వస్తోంది. విడువని తలనొప్పి, నిద్రలేమి, భరించలేని మెడనొప్పి ఉంటే హైబీపీ గా అనుమానించి పరీక్ష చేయించుకోవాలి.
- పలు అనారోగ్యాలకు నిద్రలేమి ప్రధాన కారణం. పనివేళల్లో గందరగోళం, ఒత్తిడి ఈ సమస్యకు కారణాలు. నిద్రలేమి వల్ల జీవక్రియలు దెబ్బతినటంతో బాటు ఏకాగ్రతలోపం, మానసిక కుంగుబాటు వంటి సమస్యలు తప్పవు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలకూ దారితీయొచ్చు.
- నిద్రించే సమయంలో ముక్కు పనిచేయక నోటితో గాలి పీల్చుకోవటం వల్ల తగినంత ప్రాణవాయువు అందక గురక, అలసట వంటి సమస్యలు రావచ్చు.
- రక్తంలో ట్రై గ్లిజరాయిడ్స్ పెరగటం, మంచి కొలెస్ట్రాల్ తగ్గటం వంటి అంశాలు జీవక్రియల్లో మార్పులకు కారణమై అంతిమంగా..గుండెజబ్బులకు కారణమవుతున్నాయి.
చిన్నారుల పాలిట శత్రువు
అధిక కేలరీల జంక్ ఫుడ్, శీతల పానీయాల మితిమీరిన వినియోగం వల్ల చిన్నారులు ఊబకాయం బారిన పడుతున్నారు. అదే సమయంలో పట్టణీకరణతో పిల్లలు ఆడుకొనే మైదానాలు, ఆటస్థలాలు కరువవడం, పిల్లల విషయంలో స్కూళ్ళు, తల్లిదండ్రులు సైతం చదువుకిచ్చే ప్రాధాన్యం ఆటలకు ఇవ్వకపోవటం, అభివృద్ధి మూలంగా వస్తున్న పర్యావరణ, సామాజిక మార్పులు పిల్లలను ఆటపాటలు దూరం చేసి అంతిమంగా ఊబకాయం బారిన పడేలా చేస్తున్నాయి.
ఇవీ పరిష్కారాలు
జన్యుపరమైన అంశాల మినహా ఇతర ఏ కారణం వల్ల వచ్చే జీవనశైలి రోగాలకు చక్కని పరిష్కార మార్గాలున్నాయి. అవి..
- సమయానికి తిండి, నిద్ర, పనివేళలు ఉండేలా చూసుకోవాలి.
- తక్కువ కార్బోహైడ్రేట్స్, కొవ్వు తో బాటు ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఆహారంలో 3 భాగాలు కూరగాయలు, 2 భాగాలు పండ్లు ఉండేలా చూసుకోవాలి.
- తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
- వారానికి కనీసం 5 రోజుల పాటు, రోజుకో గంటైనా వ్యాయామం చేయాలి. పరుగు, నడక వంటివైనా చాలు.
- మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాల్సిందే.
- రోజులో తగినన్ని మంచి నీళ్లు తాగాలి. దీనివల్ల ఎప్పటికప్పుడు వ్యర్ధాలు బయటకుపోతాయి.