కంటి నిండా నిద్ర ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. రోజంతా అలసి సొలసిన మనిషిని మైమరిపింపజేసి నూతనోత్తేజం కలిగించే మాధ్యమమే నిద్ర. అయితే కొందరు రాత్రంతా హాయిగా నిద్రపోయినా మరునాడంతా మగతగా, ఆవలిస్తూ కనిపిస్తుంటారు. వినటానికి ఇది కాస్త చిత్రంగా ఉన్నా ఇది ముమ్మాటికీ ఒక అనారోగ్య సమస్యే. దీన్నే వైద్య పరిభాషలో ' స్లీప్ అప్నియా సిండ్రోమ్' అంటారు. నిద్రిస్తున్నప్పుడు శ్వాసలో కలిగే అంతరాయాలే ఈ సమస్యకు మూలం. ఇది స్థూలకాయుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

ఎవరికెంత నిద్ర?

 ఆరోగ్యవంతుడైన మనిషికి 6 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది. 3 నెలల లోపు వయసు పిల్లలు 14 నుంచి 20 గంటలు, ఏడాది నుంచి 3 ఏళ్ళ లోపు పిల్లలు 8-10 గంటలు నిద్రపోతారు. సాధారణంగా 50 ఏళ్ల తర్వాత నిద్ర క్రమేపీ తగ్గుతుంది. 60 ఏళ్లకు 4-6 గంటలు, 70 ఏళ్లకు 4-5 గంటలు, 80 ఏళ్లకు 3 -4 గంటలు మాత్రమే నిద్ర సరిపోతుంది. మెదడులో నిద్రకు సంబంధించిన భాగాన్ని పీనియల్‌గ్లాండ్’ నుంచి వెలువడే 'మెలటోనిన్' అనే రసాయనపు పరిమాణాన్ని బట్టి నిద్రా సమయం మారుతుంది.

ప్రధాన లక్షణాలు

స్లీప్ అప్నియా బాధితుల్లో నిద్రా సమయంలో జీవ ప్రక్రియల వేగం పడిపోయి శ్వాస నెమ్మదించి కొన్ని క్షణాల పాటు నిలిచిపోతుంది. మతిమరుపు, మాట్లాడుతూనే నిద్రపోవడం, విపరీతమైన గురక, పగటి పూట సైతం మగతగా, అలసటగా, ఆవలిస్తూ కనిపిస్తారు. స్లీప్ అప్నియా బాధితుల్లో కోపం,అసహనం ఎక్కువ. దీంతో బాధితులు అధిక రక్తపోటు, గుండెజబ్బుల బారిన పడుతుంటారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • రోజూ వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ సమకూరి సమస్య నెమ్మదిస్తుంది.
  • మద్యపానం మానుకోవాలి.
  • కడుపునిండా తినటం, తిన్న వెంటనే పడుకోవటం చేయరాదు.
  • ఆహారంలో క్రొవ్వు పదార్థాలను బాగా తగ్గించాలి. 

నిర్ధారణ, చికిత్స

ఈ సమస్యను పోలిసోమ్నోగ్రామ్ ద్వారా గానీ లేదా ఒక రాత్రి నిద్రా పరీక్షతో గానీ నిర్ధారణ చేయవచ్చు. సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. మానసిక ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్న బాధితులకు ప్రవర్తన లేదా మానసిక సంబంధిత వైద్య విధానాలు ఉపయోగపడతాయి. సమస్య తీవ్రంగా ఉన్నవారికి ‘సిప్యాప్’ (కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్) అనే పరికరాన్ని వాడట ద్వారా సమస్యను అదుపు చేయవచ్చు. దీన్ని నిద్రపోయే ముందు ముక్కుమీద గాని, ముఖం మీద గాని అమర్చుకుంటే రాత్రంతా గాలి ఆగిపోకుండా పంపు చేస్తుంది. నాలుక గొంతులో అడ్డం పడకుండా చూస్తుంది. బాధితులు శరీర బరువు తగ్గే కొద్దీ ఈ పరికరం అవసరం తగ్గుతుంది. ఈ పరికరం వల్ల కూడా ఆశించిన ఫలితాలు లేనప్పుడు చివరి ప్రత్యామ్నాయంగా సర్జరీ అవసరం అవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE