ఎముకలు శరీరానికి మంచి ఆకృతినిచ్చి, లోపలి అవయవాల్ని కాపాడుతూ, కండరాలకు దన్నునిస్తాయి. శరీర అవసరాలకు తగిన క్యాల్షియం ను నిల్వ చేసుకునే కీలక నిర్మాణాలివే. అయితే... ఇప్పటిరోజుల్లో పలువురు 40 ఏళ్లకే ఎముకలు గుల్లబారటం, మోకాళ్ల నొప్పుల వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా  మహిళల్లో ఈ తరహా ఎముకల సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. మారిన జీవనశైలి, అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ బొత్తిగా తగ్గటం వంటి అంశాలే పై తరహా సమస్యలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. మొదటి నుంచి ఎముక పుష్టి మీద ద్రుష్టి పెడితే వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండొచ్చని వారు సూచిస్తున్నారు.

ఎముకల నిర్మాణం, ఎదుగుదల   

మనిషి పుట్టినప్పటి నుంచి శరీరానికి ఏటా 10 శాతం బోన్‌ స్టాక్‌ అందటం, కోల్పోవటం జరుగుతుంది. ఈ క్రమంలో ఎముకలు నశించటం, కొత్తవి ఏర్పడి ఎదగటం జరుగుతూ వస్తుంది. సుమారు పాతికేళ్ల నాటికి ఎముకలు పూర్తి స్థాయి సాంద్రతను సంతరించుకొంటాయి. ఈ మార్పులన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత క్యాల్షియం ఆహారం రూపంలో బాల్యం నుంచే శరీరానికి అందుతూ ఉండాలి. నిపుణుల లెక్కల ప్రకారం బాల్యం నుంచి ప్రతి మనిషికీ రోజుకి 1 గ్రాము కాల్షియం అవసరం. ఇలా అందని పక్షంలో శరీర అవసరాలకు కావలసిన కాల్షియాన్ని ఎముకల మజ్జ నుంచి నుంచి శరీరం తీసుకోవటం మొదలుపెడుతుంది. దీనివల్ల ఎముకల్లోని కాల్షియం తగ్గుతూ పోయి కొన్నాళ్ళకు ఎముకలు గుల్లబారి చిన్నపాటి ఒత్తిడికే విరుగుతాయి . వయసుపెరిగే కొద్దీ ఈ ముప్పు మరింత పెరిగి వృద్ధాప్యం రాకముందే ఆస్టియోపొరోసిస్‌,వెన్ను, తుంటి సమస్యలతో మంచాన పడాల్సి వస్తుంది. 

దెబ్బతీసే అంశాలు   

ఎముకల బలహీనతకు ఆహారంలో తగినంత క్యాల్షియం లేకపోవటం, సమయానికి తినకపోవటం, తగినంత తినకపోవటం, పాలు తాగకపోవటం, టీ, కాఫీల వినియోగం పెరగటం, బొత్తిగా వ్యాయామం లేకపోవటం, మితిమీరిన మద్యపానం, ధూమపానం, వయసు పైబడటం, జన్యుపరమైన అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వీటికితోడు 60 ఎల్లలుదాటిన  మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌,  అదే వయసు పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్ తగ్గటం మూలంగా శరీరం నుంచి  క్యాల్షియం నష్టం ఎక్కువై ఎముకలు గుల్లబారతాయి. 

తీసుకోవాల్సిన ఆహారం

  • రోజూ 1 గ్లాసు పాలు తాగాలి. అధిక బరువున్న వారు వెన్నతీసిన పాలు తాగాలి. పాలు పడనివారు పెరుగు, జున్ను వంటివి వాడొచ్చు .
  • ఆహారంలో రాగులు, మొక్కజొన్న, నువ్వులతో బాటు చిరుతిండిగా తరచూ పప్పులు, బాదం, పిస్తా తినాలి.
  • తరచూ చేప తినటం మంచిది. నేరుగా తీసుకోలేకపోతే కాడ్‌ లివర్‌ ఆయిల్‌ వాడినా మంచిదే.
  • సీతాఫలం, సపోటా వంటి పండ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది గనుక తరచూ వీటిని తినాలి.
  • పాలు కాచినప్పుడు క్యాల్షియం అడుగున పేరుకుంటుంది గనుక తాగేముందు బాగా కలపాలి.

మేలుచేసే ఇతర అంశాలు

  • రోజువారీ వ్యాయామంతో ఎముకలు బలపడతాయి. కనుక వయసుతో నిమిత్తం లేకుండా అందరూ రోజుకు గంటపాటైనా తగిన వ్యాయామం చేయాలి. మరీ ముఖ్యంగా స్త్రీలు ఈ నియమాన్ని పాటించాలి. నడవటం, జాగింగ్‌, స్కిప్పింగ్‌ వంటివి చేసినా చాలు.
  • ఎముకల సాంద్రత తక్కువగా ఉన్నవారు వైద్యుల సలహాపై క్యాల్షియం మాత్రలు తీసుకోవాలి. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గుదల వల్ల ఎముకలు గుల్లబారుతుంటే ‘హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ’(హెచ్‌ఆర్‌టీ)తో సమస్య చక్కదిద్దవచ్చు.
  • జీర్ణ సమస్యలు, థైరాయిడ్‌ వంటి వాటి మూలంగా ఎముకలు దెబ్బతింటే తగిన చికిత్స తీసుకోవాలి.
  • మనం తీసుకునే కాల్షియంలో కేవలం 10 నుంచి 15 శాతమే శరీరం శోషించుకుంటుంది. శరీరం తగినంత క్యాల్షియం ను శోషించుకోవాలంటే తగినంత విటమిన్‌ డి అవసరం. ఉదయం, సాయంత్రం ఒంటికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవటం, లేనిపక్షంలో వైద్యుల సలహాపై సప్లిమెంట్ల రూపంలో భర్తీ చేసుకోవాలి.
  • ఆరు నెలలకోసారి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకొని వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు పాటించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE