మన దేశంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు 30లక్షల మంది వరకు ఉన్నారని ఒక అంచనా. ఏటా అదనంగా 3 లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు.  కేవలం హైదరాబాద్ నగరంలోనే నగరంలో 30వేల మంది నుంచి 40 వేల మందికి  డయాలసిస్‌ అవసరం అవుతోంది.  ఈ కిడ్నీ సమస్యలకు ప్రధానంగా మధుమేహం (42శాతం), హైబీపీ (32శాతం) కారణమవుతున్నాయి. ఈ రెండు సమస్యలను అదుపులో వుంచుకోగలిగితే కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. అందుకే వీటిని కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైతే దాన్ని తిరిగి బాగుచేయటం అసాధ్యం.   పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకునేందుకు డయాలసిస్ మీద ఆధారపడాల్సిందే. ఇందుకు నెలకు సుమారు రూ.7-8వేలు వెచ్చించాల్సి రావచ్చు. 

ఇతర ఇబ్బందులు

ఒకసారి కిడ్నీల పనితీరు దెబ్బతినటం మొదలైతే ఆ ప్రభావం గుండె వంటి కీలక అవయవాల పనితీరునీ దెబ్బతీయవచ్చు. కిడ్నీ బాధితుల బాధలు అన్నీ ఇన్నీ కాదు. చాలా సందర్భాల్లో కిడ్నీ దాతలు దొరకటం కష్టం. దొరికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నా అది ఏమేరకు విజయవంతం అవుతుందో తెలియదు. సర్జరీ తర్వాత జీవితాంతం మందులు వాడాల్సిందే. అందుకే అందరూ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని  అసలు కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. 
జీవనశైలి మార్పుల ముప్పు  
మన దేశంలో జీవనశైలి రోగాలు వేగంగా విస్తరిస్తున్నాయనీ 2020 నాటికి మధుమేహుల సంఖ్య  రెట్టింపు కానుందని జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. టైప్‌-1 మధుమేహ బాధితుల్లో 10-30శాతం, టైప్‌-2 మధుమేహుల్లో 40శాతం మంది కిడ్నీ సమస్యల బారినపడే అవకాశం ఉంది. మూత్రపిండాల సమస్య ఏదైనా,  తొలిదశలో గుర్తించగలిగితే పరిస్థితి  మరీ విషమించకుండా చూసుకోవచ్చు. అందుకే మధుమేహులంతా కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ ఆరోగ్యవంతులు అసలు మధుమేహం బారినపడకుండా చూసుకోవాలి.
పరీక్షలు

టైప్‌-1 రకం బాధితులు మధుమేహం బారినపడిన ఐదేళ్ళ నుంచి ఏటా కిడ్నీ పరీక్షలు చేయించుకోవటం అవసరం.  టైప్‌- 2 మధుమేహులైతే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

కిడ్నీ ముప్పుకు సూచికలు 

  • మన కిడ్నీల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పేందుకు రక్తంలోని  సిరమ్‌ క్రియాటిన్‌  పరీక్ష కీలకం. దీని ఆధారంగా వడపోత సామర్ధ్యాన్ని(ఎస్టిమేటెడ్‌ గ్లోమెరూలార్‌ ఫిల్టరేషన్‌ రేట్‌-ఈజీఎఫ్‌ఆర్‌)ను లెక్కించి... కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందన్నదనే అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. వరకూ ఉంటుంది. ఇది 60 మి.లీ.కన్నా తక్కువుంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కేవలం క్రియాటినైన్‌ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50శాతం దెబ్బతినే వరకూ కూడా సిరమ్‌ క్రియాటినైన్‌ పెరగకపోవచ్చు. కాబట్టి ‘ఈజీఎఫ్‌ఆర్‌’ను చూసుకోవటం ముఖ్యం. సీరమ్‌ క్రియాటినైన్‌ పరీక్షించి దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి ప్రమాణాల ఆధారంగా ‘ఈజీఎఫ్‌ఆర్‌’ లెక్కిస్తారు.
  • మూత్రంలో ఆల్బుమిన్ (ఓ రకమైన ప్రోటీన్) పోవటం ఎక్కువవుతుందంటే కిడ్నీల పనితీరు తగ్గతమో లేక దెబ్బతినటం గానో  భావించాలి. తగిన పరీక్షల సాయంతో సమస్య తీవ్రతను అంచనా వేసి చికిత్స తీసుకోవాలి

    కిడ్నీలను కాపాడుకోవాలంటే?
    మధుమేహం, అధిక రక్తపోటు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహులు- హెచ్‌బిఎ 1సి (గ్లైకాసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌) పరీక్ష ఫలితం 7కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గత మూడు నెలల సమయంలో మధుమేహం కచ్చితంగా అదుపులో ఉందా లేదా? అని చెప్పే పరీక్ష. మధుమేహం, హైబీపీ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి చేరకుంటాయి. అందుకే రక్తపోటును 130/80 కంటే తక్కువే ఉండేలా చూసుకోవాలి.రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి. అలాగే రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి.మూత్రంలో సుద్ద పోతుంటే వెంటనే గుర్తించి తక్షణం చికిత్స తీసుకోవాలి. అందుకే తరచూ పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE