ఈ రోజుల్లో పట్టుమని పాతికేళ్ల వారూ గుండెజబ్బుల పాలిట పడుతున్నారు. వ్యాయామం బొత్తిగా లేకపోవటం, మద్యం, ధూమపానం , గతి తప్పిన జీవనశైలి, నానాటికీ పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరం పలురకాలుగా దెబ్బతింటూ, అంతిమంగా ప్రమాదకరమైన గుండె జబ్బులకు దారి తీస్తోంది. ఈ పరిస్థితిని నివారించాలంటే ఈ కింది అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనని వారు సూచిస్తున్నారు.
ప్రధాన శత్రువు.. ధూమపానం!
గుండె జబ్బులకు కారణమయ్యే అంశాల్లో ప్రధానమైనది ధూమపానం! ధూమపానం వల్ల రక్తం చిక్కబడటమే గాక రక్త నాళాలు కుచించుకుపోయి రక్త ప్రసారం నెమ్మదిస్తుంది. దీంతో గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందక అవి సామర్ధ్యాన్ని కోల్పోతాయి. ధూమపానానికి మధుమేహం, స్థూలకాయం, హై కొలెస్ట్రాల్, వ్యాయామలేమి, కుటుంబ చరిత్ర తోడైతే గుండె జబ్బుల ముప్పు మరింత ఎక్కువ. వేరొకరు వదిలిన పొగను పీల్చినా గుండెజబ్బుల ముప్పు తప్పదు.
చిత్తు చేస్తున్న ఒత్తిడి
కాలంతో పరుగులు పెట్టేందుకు అలవాటు పడిన ఆధునిక యుగంలో శారీరక ఒత్తిడి కంటే మానసిక ఒత్తిడి పెరుగుతోంది. దీనికి వృత్తి, కుటుంబ, సామాజిక, ఆర్థిక అంశాలే ప్రధాన కారణాలు. షిఫ్టుల్లో పని చేయటం, ఎడతెగని ప్రయాణాలు కూడా చిన్న వయసులోనే కనిపిస్తున్న గుండెపోటుకు ఇతర కారణాలు.
మారిన ఆహారపుటలవాట్లు
వేళపట్టున తినే అలవాటుకు యువత దూరమైంది. రోజూ జంక్ ఫుడ్ తినేయటం, శీతల పానీయాలు, కాఫీ, టీలతో కడుపు నింపేయటం అలవాటైపోయింది. దీంతో జంక్ ఫుడ్ లోని కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్, కృత్రిమ చక్కెరలు, నూనెలు, కొవ్వులు ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. రాత్రి పొద్దుపోయాక అతిగా తినటం కూడా పలు సమస్యలకు దారితీస్తోంది.
వేధిస్తున్న నిద్రలేమి
నిపుణులు సూచిస్తున్న ప్రకారం రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర మూలంగా శరీరం సేద తీరి మరునాడు పనిచేసేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. అయితే క్రికెట్, సినిమాలు, చాటింగ్ పేరిట యువత రాత్రి 2 గంటల వరకు మేలుకొని ఉదయం 6 గంటలకే లేచి చదువు, ఉద్యోగాలకు పరుగులు పెడుతున్నారు. ఆ ప్రభావం ఆరోగ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వారిని రక్తపోటు బాధితులుగా మారుస్తోంది. ఇదే.. హృద్రోగాలకు దారితీస్తోంది.
కాలుష్యమూ కారణమే..!
వాతావరణ కాలుష్యం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందనే విషయం తెలిసిందే! ఈ ముప్పు పట్టాన వాసులకు మరింత ఎక్కువ. ట్రాఫిక్ రద్దీలో తిరిగే వారికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు పెరిగి ఫలితంగా గుండె కవాటాలు, కండరాలు దెబ్బతింటాయి. అలాగే శబ్ద, జల కాలుష్యం సైతం ఈ ముప్పును మరింత పెంచుతున్నాయి. కాలుష్యం నుంచి రక్షణ పొందాలంటే బయట తిరిగేటప్పుడు ముక్కుకు మాస్క్ ధరించటం, శుభ్రమైన నీరు తాగటం, విపరీతమైన శబ్దాలకు దూరంగా ఉండటం ఎంతైనా అవసరం.
వ్యాయామలేమి
రోజంతా కదలకుండా ఏసీల్లో, కంప్యూటర్ల ముందు పని చేయటం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. వ్యాయామంతో ఈ అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. అయితే వ్యాయామానికి సమయం ఇవ్వక పోవటం వల్ల హృద్రోగాల ముప్పు పెరుగుతోంది. రోజు మొత్తంలో కనీసం అరగంటపాటు నడక, జాగింగ్, కార్డియో, వెయిట్ ట్రైనింగ్, ఈత, కబడ్డీ వంటి ఆటలకు కేటాయించాలి.
ఏడాదికోసారి పరీక్షలు
ఏడాదికోసారి వైద్య పరీక్షలు చేయించుకొంటే పుట్టుకతోనే ఉన్న హృదయ సమస్యలు బయటపడతాయి గనుక ముందస్తు చికిత్స తీసుకోవచ్చు. అలాగే.. రుమాటిక్ హార్ట్ డిసీజ్, కవాటాల సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, జన్యుపరంగా వచ్చే కార్డియోమయోపతి మొదలైన సమస్యలున్నవారు నిపుణుల సలహాలు తీసుకోవటం అత్యంత అవసరం.
అనుమానిత లక్షణాలు
అలాగే చిన్న చిన్న బరువులు ఎత్తినా అలసిపోవడం, మెట్లు ఎక్కినా, పరిగెత్తినా, వ్యాయామం చేస్తున్నా అలసటగా ఉన్నా లేక అతిగా చెమటలు పట్టినా, గుండె లయ పెరిగినా, వాంతి వచ్చినట్లు అనిపించినా గుండె సమస్యగా అనుమానించి వైద్యులను కలవాలి.