ట్యూబర్ క్యులోసిస్.. సాధారణ పరిభాషలో టీబీ లేదా క్షయ. ఇది ఇట్టే సోకే అంటువ్యాధి. దీనికి వయోభేదం లేదు. పట్టణం గ్రామం అనే తేడా కూడా ఉండదు. దగ్గు లేదా తుమ్ములతో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. టీబీ రోగి గట్టిగా తుమ్మినా లేదా దగ్గినా వెలువడే తుంపర్లలోని మైకోబ్యాక్టీరియమ్ టూబరిక్లోసిస్ అనే బ్యాక్టిరీయా ఆ సమీపంలోని వ్యక్తి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. క్షయ నియంత్రణ దినోత్సవం సందర్భంగా టీబీ లక్షణాలు, నివారణ వంటి అంశాలమీద నిపుణులిస్తున్న కొన్నిసలహాల గురించి తెలుసుకొందాం.
వ్యాపించే తీరు
ప్రమాదకరమైన ఈ వ్యాధి చాలా సులువుగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు క్రిములు గాలిలో వ్యాపించి వ్యాధిని విస్తరిస్తాయి. ఇతరులకంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఎయిడ్స్ బాధితులు మరింత సులువుగా దీని బారిన పడతారు.
లక్షణాలు
3 వారాలకు మించిన దగ్గు, రోజూ సాయంత్రం జ్వరం రావటం, బహు తక్కువ ఆహారం తీసుకోవటం, శరీర బరువు తగ్గటం, ఛాతి నొప్పి, తెమడలో రక్తం పడటం
నిర్ధారణ, చికిత్స
మూడు రోజుల పాటు ఉదయం తెమడ పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో నెగిటివ్గా వస్తే, ఎక్స్రే తీయించుకోవడం ద్వారా ఇతర సమస్యలుంటే బయటపడుతుంది. ఒకవేళ అప్పటికే టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయితే వైద్యుల సలహా మేరకు మందులు వాడుకోవాలి. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ టీబీకి పూర్తి ఉచిత చికిత్స అందిస్తున్నారు. వైద్యులు చెప్పినంత సమయం మందులు వాడటం తప్పనిసరి. కాస్త ఉపశమనంగా ఉందని మధ్యలో టీబీ మందులు ఆపితే వ్యాధి రెట్టించిన శక్తితో తిరగబెడుతుంది. ఈ దశలో అది మందులకు కూడా అదుపు కాకపోవచ్చు కనుక నిర్ధారిత సమయం వరకు మందులు వాడుతూ వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించాల్సిందే.
నివారణ
పుట్టిన బిడ్డకు వెంటనే(బీజీజీ) సూది మందు వేయించాలి. క్షయ రోగులు దగ్గినా, తుమ్మినా నోటికి రుమాలును అడ్డు పెట్టుకోవాలి. రోగి ఎక్కడపడితే అక్కడి ఉమ్మివేయరాదు. జబ్బు నయమయ్యే వరకూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. ఈ వ్యాధి పిల్లల్లో వేగంగా సోకుతుంది గనుక రోగి ఇంట్లో పిల్లలు ఉంటే వైద్యుడి సలహాలు పాటించాలి.