• HOME
  • భక్తి
  • నేడే ఒంటిమిట్ట రామయ్య కల్యాణం

ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా, ఒంటిమిట్టలో కొలువై ఉన్న కోదండరాముని కల్యాణం నేడు జరగనుంది. ఈ క్షేత్రము ఏకశిలానగరముగానూ ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఈ ఆలయమున్న ఒంటిమిట్ట ఆంధ్రా భద్రాచలం గా పేరుగాంచింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.   కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది.

ఆలయ విశేషాలు

కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి ఏక శిలపై ఉండటం ఇక్కడి విశిష్టత . రాముని విగ్రహం పక్కన హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే. సీతారామ కల్యాణం జరిగాక మృకండు మహర్షి, శృంగి మహర్షి కోరిక మేరకు శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ ప్రాంతానికి వచ్చియాగ రక్షణ చేశాడని స్థల పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, శ్రీరామహనుమంతుల కలయికకు ముందే దీనిని ప్రతిష్ఠించాడనీ  చెబుతారు.  సీత కోరికపై  రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చినట్లు  స్థల పురాణంల వివరిస్తోంది. ఇందుకు గుర్తుగా ఈ ఆలయంలో రామ తీర్థము ఉంది.

ఆకట్టుకొనే శిల్పకళా వైభవం

        ఆలయ రాజ గోపురం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ ఈ గోపురాన్ని దేశంలోని అతి పెద్ద గోపురాలలో ఒకటిగా పేర్కొన్నాడు.  ఈ ఆలయానికి మూడు గోపురద్వారాలతో బాటు విశాలమైన ఆవరణ ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో, రంగ మంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది.

ఆధునిక చరిత్ర

కలియుగంలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ఒంటెడు, మిట్టడు అనే సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వారిపేరుతోనే ఒంటిమిట్టగా ఈ గ్రామం ఖ్యాతిచెందింది. వీరి విగ్రహాలను కూడా ఆలయప్రాంగణంలో చూడవచ్చు.  తర్వాతి కాలంలో దెబ్బతిన్న ఈ ఆలయాన్ని ఆంధ్రవాల్మీకిగా పేరొందిన  వావిలికొలను సుబ్బారావు (1863 - 1936)  భిక్షాటన చేసి వచ్చిన పది లక్షల రూపాయల  సొమ్ముతో పునరుద్ధరించటమే గాక స్వామికి ఆభరణాలను చేయించారు. ఆయనే ఇక్కడి  రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగీకరించిన పోతన తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకోవటమే గాక తన  భాగవతాన్ని ఇక్కడి ఈ కోదండ రామునికే  అంకితమిచ్చాడు. పోతనతో బాటు , అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి వంటి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.

మతసామరస్యానికి ప్రతీక

ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన రాజు  ప్రతినిధి.  ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తుల మాట మీద రాముడిని పిలవగా స్వామి బదులిచ్చాడనీ, ఆ తర్వాత ఆయన స్వామి  భక్తుడిగా మారి ఆలయ నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించాడనీ చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

రాత్రి కల్యాణం ప్రత్యేకత

 ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఎలా చేరుకోవచ్చు

* కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది. కడప-తిరుపతి రహదారిపై 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది. తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE