• HOME
  • భక్తి
  •   ఆత్మశుద్ధికి, అమరత్వ సిద్ధికి.. అమరనాథ్‌ యాత్ర

కనుచూపు మేర ధవళ కాంతులతో మెరిసే బ్రహ్మాండమైన మంచు పర్వతాలు.. అడుగడుగునా పలకరించే హిమానీ నదాలు, దారిపొడవునా భక్తుల బోలేనాథ్ కీ జయహో, హరహర మహాదేవ జయధ్వానాలు, చేతికి అందుతాయా అన్నంత దిగువగా ముందుకు సాగే మేఘాలు,  క్షణాల్లో వచ్చి పలకరించిపోయే చిరుజల్లులు, దారి పొడవునా కన్ను ఆర్పకుండా ఆయుధాలు చేత బూని గస్తీ కాసే సైనిక బృందాలు.. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటూ దుర్గమమైన కొండవాలు వెంట శివనామ స్మరణ చేసుకుంటూ ముందుకు సాగిపోయే సాధుగణం.. ఇవన్నీ అమరనాథ్ యాత్రలో కనిపించే దృశ్యాలు, ఎదురయ్యే అనుభూతులు. హిందువులు జీవితకాలంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్రలలో అమరనాథ్ ఒకటి. అమరనాథుడంటే జరామరణములు లేనివాడు అని అర్ధం.ఈ శివలింగానికి సుమారు 5 వేల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ హిమలింగాన్ని దర్శించుకుంటే ఆత్మశుద్ధి, ఆత్మశక్తి కలుగుతాయని భక్తుల వారి నమ్మకం. భక్తిభావంతో బాటు రవ్వంత సాహసమూ అవసరమయ్యే అమరనాథ యాత్ర గురించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

 ఈ ఏడాది అమరనాథ యాత్ర ఇప్పటికే మొదలైంది. ఏటా ఆషాడమాస శుక్ల పాడ్యమి నుంచి శ్రావణమాస శుక్ల పౌర్ణమి వరకూ భక్తులను అమరనాథ్ యాత్రకు అనుమతిస్తారు. అక్కడి వాతావరణ పరిస్థితిని బట్టి యాత్రాకాలం మారుతూ ఉంటుంది. ఏటా జనవరి నెలాఖరులో ప్రభుత్వం ఈ యాత్రా తేదీలను పలు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకటిస్తారు. ఈ ఏడాది జులై 2 న మొదలైన ఈ యాత్ర ఆగస్టు 28 వరకు సాగనుంది. అమరనాథ్‌జీ ట్రస్టువారి వెబ్‌సైట్‌ (www.shriamarnathjishrine.com) లో ఈ వివరాలు లభిస్తాయి. ఈ యాత్ర చేయదలచిన వారంతా ముందుగా తప్పక నమోదు చేయించుకోవాలి. సముద్రమట్టానికి 13,600 మీటర్ల ఎత్తున ఉండే గుహాలయానికి వెళ్ళే మార్గాన మంచు తుఫానులు, కుండపోతగా కురిసే వర్షాల రూపంలో ప్రమాదం ఎల్లప్పుడూ పొంచి ఉండే ముప్పు కారణంగా ఏటా పరిమిత సంఖ్యలోనే యాత్రికులను అనుమతిస్తారు.

స్థలపురాణం

 ఒకరోజు పార్వతీ దేవి భర్త ధరించిన పుర్రెలమాల గురించి చెప్పమనగా, ‘పార్వతీ ! నీవు జన్మించిన ప్రతిసారీ నేను ఒక్కో పుర్రె చేర్చగా వచ్చినదే ఈ మాల" అని అన్నాడట. దానికి పార్వతి ‘నాథా ! నేను మరల మరల జన్మించటానికి, మీరు అమరులుగా నిలవటానికి కారణమేమిట'ని అడిగింది. అప్పుడు సృష్టి రహస్యాన్నిఏకాంత ప్రదేశాన అమరకథ రూపంలో చెప్పదలచిన స్వామి అందుకు అమరనాథ్ గుహాలయాన్ని ఎంపిక చేసారట. అందుకే గుహాలయానికి వెళ్ళే దారిలో నందీశ్వరుని, నాగాభరణాన్ని, నెలవంకను, పంచభూతాలను, ప్రమథగణాలను వదిలి గుహను చేరుకున్నాడనీ చెబుతారు. గుహాప్రవేశం చేయగానే మరెవరూ రాకుండా చుట్టూ అగ్నిని సృష్టించాడనీ, ఆ కారణంగానే ఇప్పటికీ గుహ చుట్టూ ఉన్న ప్రాంతమంతా తెల్లగా భస్మం రూపంలో ఉంటుందనీ చెబుతారు. అయితే అగ్ని జ్వాలలు చూసి భయపడిన ఓ పావురాల జంట గుహలో చేరి అప్రయత్నంగా స్వామి చెప్పిన కథ విని అమరత్వాన్ని పొందాయనీ అవే పావురాలు నాటి నుంచి యాత్ర చేసే భక్తులకు గుహాలయంలో కనిపిస్తాయని భక్తుల నమ్మిక.

యాత్రాక్రమం

యాత్రీకులు ముందుగా జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ చేరుకొని అక్కడినుంచి అమరనాథ యాత్ర ఆరంభమయ్యే బేస్‌ క్యాంపు చేరుకుంటారు. అక్కడినుంచి పహల్గావ్, బాల్టాల్ అనే రెండు మార్గాల గుండా అమరనాథుడు కొలువుతీరిన గుహకు చేరుకోవచ్చు. వీటిలో బాల్టాల్ దగ్గరి దారి కాగా పహల్గావ్ నుంచి వెళ్లేవారు కాస్త ఎక్కువ దూరం ప్రయాణించాలి. పహల్గావ్ నుంచి గుహకు సుమారు 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం నుంచే పరమేశ్వరుడు అమ్మవారిని గుహకు తీసుకెళ్లాడని చెబుతారు. సంప్రదాయ బద్ధంగా యాత్ర చేయాలనుకునే వారు, సాధుసంతులు ఎక్కువగా పహల్గావ్ మార్గాన్నే ఆశ్రయిస్తారు. ఇక.. దగ్గరదారి అయిన బాల్టాల్‌ మార్గంలో వెళ్ళేవారు 14 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అమరనాథగుహ చేరుకోవచ్చు. నడవలేని వారికోసం సంగం వరకు డోలీలు, గుర్రాలు అందుబాటులో ఉంటాయి. గుహను చేరేందుకు ముందు పార్వతీ పరమేశ్వరులు స్నానం చేసిన ప్రదేశమిది. పహల్గావ్ఇ మార్గం నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడే కలుస్తారు. ఇక్కడి నుంచి అమరనాథ్ గుహాలయం రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది.

సంగం వరకూ ఎలా వచ్చినా అక్కడినుంచి మాత్రం నడిచి గుహాలయాన్ని చేరుకోవాల్సిందే. సముద్రమట్టానికి 13, 600 అడుగుల ఎత్తున నెలవై ఉన్న అమరనాథుని దర్శనం కోరే భక్తులకు మార్గమధ్యంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఎత్తుకు పోయే కొద్దీ ఆక్సిజన్ అందటం తగ్గుతుంది గనుక శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలున్న వారిని ముందుగా గుర్తించి మధ్యలోనే వైద్యులు నిలిపివేస్తారు.  

గుహాలయం

గుహకు దగ్గరే ఉన్న అమరావతీ నదిలో స్నానం చేసి గుహ పాదం వద్దకు చేరుకున్న భక్తులు అక్కడి ౩౦౦ మెట్లు ఎక్కి గుహలోకి అడుగుపెడతారు. 60 అడుగుల పొడవూ, 30 అడుగుల వెడల్పూ, 15 అడుగుల ఎత్తయిన గుహాలయంలోకి వెళ్ళగానే ఎదురుగా ఉన్న శిలావేదికమీద స్వయంభువుగా నిలిచిన శ్వేత వర్ణ హిమలింగం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతుంది. శివలింగం పక్కన కనిపించే మరో రెండు మంచు మూర్తులను అమ్మవారు, వినాయకుడిగా చెబుతారు. పవిత్ర గుహాలయంలో శివలింగం పక్కనే నిర్భయంగా తిరుగాడుతున్న చక్కని పావురాల జంట అమరకథ నేపథ్యాన్ని గుర్తుకు తెస్తుంది.

కొన్ని సూచనలు

ఈ యాత్ర చేయదలచిన వారు ఒక బృందంగా ఏర్పడి తమ వివరాలు నమోదు చేయించుకోవాలి. ఈ బృందంలో గతంలో ఒకసారైనా యాత్ర చేసినవారు ఉంటే మంచిది. ఆ తర్వాత ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ యాత్రకు పలు ట్రావెల్ సర్వీసులు ప్యాకేజీలు అందిస్తున్నాయి. అయితే సదరు సంస్థల గత చరిత్ర తెలుసుకొని మాత్రమే వారి సేవలను వినియోగించుకోవాలి. శ్వాశ, ఊపిరి తిత్తుల సమస్యలు, తీవ్ర అనారోగ్యం బారిన పడినవారు ఈ యాత్ర చేయటం కష్టమని గుర్తించుకోవాలి. దారిలో ఎప్పుడైనా వర్షం కురిసే అవకాశం ఉన్నందున యాత్రీకులు తప్పక రైన్ కోట్ వంటివి వెంట తీసుకెళ్ళాలి. యాత్ర మధ్యలో ఏదైనా అనారోగ్యం బారిన పది ముందుకు సాగలేని పరిస్థితిలో ఆగిపోవటమే మంచిది. ఎందుకంటే ఒక దశ ప్రయాణం తర్వాత ఎలాంటి వైద్య సదుపాయం ఉండదు. ఈ సూచనలను దృష్టిలో పెట్టుకొని చక్కని ప్రణాళికతో ముందుకు సాగితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా అమరనాథ్ యాత్ర పూర్తిచేయవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE