• HOME
  • భక్తి
  • కృష్ణా పుష్కర ఘాట్ల సమాచారం

మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? ఇంకా కృష్ణా పుష్కర స్నానం చేయలేదా? నగరానికి వీలైనంత దగ్గరగా, సౌకర్యవంతంగా ఉన్నచోట పుష్కర స్నానం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే.

  • నగరానికి 150 కి.మీ దూరాన, 10 అడుగుల నీటితో భక్తులను ఆకర్షిస్తున్నాయి నాగార్జున సాగర్ లోని 2 ఘాట్లు. స్నానానంతరం అయ్యప్పస్వామి దేవాలయం, అమరలింగేశ్వరస్వామి దేవాలయం, ఎత్తిపోతల వద్ద దత్తాత్రేయ స్వామి, అనుపులో శ్రీరంగనాధ స్వామి దేవాలయాలు దర్శించుకోవచ్చు. శ్రీశైలం నుంచి లాంచీపై కూడా ఇక్కడకు చేరుకోవచ్చు.
  • శక్తి పీఠమైన జోగులాంబ దర్శనం కోరే భక్తులు గొందిమళ్ల ఘాట్ (అలంపూర్) వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి 200 కి.మీ దూరాన ఉన్న అలంపూర్ చౌరస్తా (కర్నూల్ జాతీయ రహదారి) చేరుకొని అక్కడినుంచి 15 కి.మీ దూరాన ఉన్న అలంపూర్‌ చేరాలి. అక్కడినుంచి 8 కి.మీ దూరాన ఈ ఘాట్ ఉంటుంది. రైలు ప్రయాణీకులు హైదరాబాద్- కర్నూల్‌ మార్గంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర రైల్వేహాల్ట్ వద్ద దిగి అక్కడినుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా 15 కి.మీ దూరాన ఉన్న గొందిమళ్ల ఘాట్ చేరుకోవచ్చు. స్నానానంతరం శ్రీజోగుళాంబ ఆలయం, నవగ్రహ బ్రహ్మా ఆలయాలు, సంగమేశ్వర ఆలయం మొదలగు ఆలయాలను దర్శించుకోవచ్చు.
  • నగరానికి దగ్గరగా ఉన్న ఘాట్ లలో కృష్ణా ఘాట్ ఒకటి. ఇది నగరానికి 182 కి.మీ దూరంలో ఉంది. ఇది మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు మండల పరిధిలో ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా స్నానం అచ్చరించవచ్చు. స్నానానంతరం కృష్ణా, భీమా నదులు కలిసే చోట ఉన్న దత్త మందిరం, శ్రీ క్షీరలింగేశ్వర ఆలయం, వెంకటేశ్వర ఆలయాలను దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బస్సుద్వారా అయితే మహబూబ్‌నగర్, మక్తల్ మీదుగా ఇక్కడకు చేరుకోవచ్చు. రైలు ప్రయాణికులు నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల నుంచి బెంగళూర్‌కు వెళ్లే ప్రతి రైలు కృష్ణ వద్ద ఆగుతోంది.
  • హైదరాబాద్ నుంచి 185 కి.మీ దూరంలో ఉన్న మరో ఘాట్ పస్పుల ఘాట్. ఇది మహబూబ్ నగర్, మక్తల్ పట్టణానికి దగ్గరలో ఉంది. ఇక్కడ నీటిమట్టం 20 అడుగుల వరకు ఉంది. ఇక్కడి దత్తాత్రేయ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్ రోడ్డుమార్గం గుండా ఇక్కడకు చేరుకొని అక్కడినుంచి ఖానాపూర్, కర్ని, చిట్యాల మీదుగా పస్పుల గ్రామం చేరుకోవచ్చు. మక్తల్ నుంచి ఈ ఘాట్ 19 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
  • నగరవాసులకు మరో ప్రత్యామ్నాయం రంగాపూర్ ఘాట్ (పెబ్బేరు). చెప్పుకోదగ్గ స్థాయిలో మాత్రమే నీళ్లున్న ఈ ఘాట్ నగరానికి 155 కి.మీ దూరాన ఉంది. స్నానానంతరం రంగనాయకస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 44వ నంబర్ జాతీయ రహదారిపై 150 కి.మీ ప్రయాణం చేసి పెబ్బేరు పట్టణానికి చేరుకొని అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లే దారిలో 5 కి.మీ దూరం ప్రయాణం చేస్తే రంగాపూర్ పుష్కరఘాట్‌కు చేరుకోవచ్చు.
  • యాత్రికులను ఆకర్షిస్తున్న మరో ఘాట్ బీచుపల్లి. (ఇటిక్యాల). నీటిప్రవాహం తక్కువగా ఉన్నా షవర్ స్నానానికి ఇబ్బంది లేదు. స్నానానంతరం శివాలయం, ఆంజనేయ, కోదండరామాలయం, హయగ్రీవ సరస్వతి జ్ఞానమందిరాలను దర్శించుకోవచ్చు. ఈ ఘాట్ నగరానికి 166 కి.మీ దూరాన ఉంది. హైదరాబాద్ నుంచి 44వ నంబరు జాతీయ రహదారిపై నేరుగా బీచుపల్లి చేరుకోవచ్చు. రైలు ప్రయాణీకులు గద్వాల చేరుకుని గద్వాల నుంచి 16 కి.మీ దూరాన ఉన్న ఘాట్ కు ఎర్రవల్లిచౌరస్తా మీదుగా వెళ్ళాలి. 
  • గద్వాల దగ్గరలో ఉన్న మరో ఘాట్ నది అగ్రహారం. ఇది నగరానికి 196 కి.మీ దూరాన ఉంది. ఇక్కడ ఘాట్‌కు 3 మీటర్ల దూరంలో నీటి ప్రవాహం ఉంది. ఇక్కడే స్పటిక లింగేశ్వరాలయం, కల్యాణ వెంకటేశ్వరస్వామి రామ, ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, సాక్షేశ్వరస్వామి ఆలయాలు, అహోబిల మఠం ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సుమార్గంలోని ఎర్రవల్లి చౌరస్తాలో దిగాలి. అక్కడినుంచి 16 కి.మీ దూరంలో గద్వాల ఉంది. గద్వాల రైల్వేస్టేషన్ నుంచి ఈ ఘాట్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
  • భక్తులను ఆకట్టుకొంటున్న మరో ఘాట్ సోమశిల. స్నానానంతరం ఘాట్ సమీపంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలయం (లలితాంబికా సోమేశ్వరాలయం) దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి జడ్చర్ల, నాగర్‌కర్నూల్ మీదుగా 200 కి.మీ దూరాన ఉన్న కొల్లాపూర్‌ చేరుకొని అక్కడి నుంచి సోమశిల చేరుకోవచ్చు. 



Recent Stories







bpositivetelugu

చదివింది బాగా గుర్తుండాలంటే..

 కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు.  

MORE
bpositivetelugu

అభీష్ట ప్రదాయని.. లలితా పరా భట్టారిక

త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. త్రిమూర్తుల కంటే ముందున్న కారణంగా త్రిపుర 

MORE