ఈ లోకంలో జన్మించే కోట్లాదిమందిలో బహుకొద్దిమందేతమ ఆదర్శాలతోచరిత్ర గతిని మార్చినవారుగా నిలుస్తారు. వారిలో మహమ్మద్ ప్రవక్త ఒకరు. సత్యం, ధర్మాలను ఆచరించి మానవ జన్మను సార్ధకం చేసుకోవాలని బోధించిన ప్రవక్త జన్మదినం నేడు.ఈ శుభదినాన్నిమహమ్మదీయులంతా ఆనందోత్సాహాలతోమీలాదె నబి గా జరుపుకుంటారు. అరబ్బీ భాషలోమీలాద్ అంటే జన్మదినమనీ, నబి అంటే ప్రవక్త అని అర్థం.అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న అరబ్బు సమాజాన్ని తన బోధనలతో జ్ఞాన మార్గంలో నడిపి శాంతి, సౌజన్యాలను నిలిపి గెలిపించిన ఆ మహనీయుని జీవితాన్ని ఈ రోజు అందరూ స్మరించుకొంటారు.
ప్రవక్తక్రీ.శ. 571 ఏప్రిల్ 20నమక్కాలోసామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్న ఖురైష్ తెగకు చెందిన కుటుంబంలో జన్మించారు. పుట్టేనాటికే తండ్రి గతించడం, ఆరేళ్లకు తల్లి మరణించడంతో తాతగారైనఅబ్దుల్ ముత్తలిబ్ ఆయనకు 'మహమ్మద్' అని పేరుపెట్టి పెంచారు. ఆ తర్వాత రెండేళ్ళకేతాతగారు కన్నుమూయడంతో మహమ్మద్ పినతండ్రి జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ దగ్గరికి చేరాడు. తొలినాళ్లలో పల్లెలో గొర్రెల కాపరిగా ఉన్న ఆయన తరువాతిరోజుల్లోఆ తెగ నాయకుడిగా నిలిచారు. అరబ్బులలోని మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు, అనైక్యత ఆయనను నిరంతరంకలవరపరిచాయి. సొంత ఖురైష్ తెగ సంప్రదాయాలను వ్యతిరేకించి విగ్రహారాధనకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఖురైష్, కైస్ తెగల మధ్య జరిగిన ఫిజార్ యుద్ధంలో ప్రవక్త పాల్గొన్నారు.తెగ ఆచారం ప్రకారం వర్తకాన్ని వృత్తిగా స్వీకరించి నిజాయితీ, సచ్ఛీలతతోసాదిక్ (సత్యసంధుడు), అమీన్ (విశ్వసనీయుడు) అని పేరుతెచ్చుకున్నారు.వ్యాపారంలో భాగంగా ఆయన సిరియా, బస్రా, యెమెన్ దేశాల్లో పర్యటించారు. ఆ సమయంలోనే శ్రీమంతురాలు, వ్యాపారవేత్తయిన హజ్రత్ ఖదీజా ప్రవక్త దీక్షాదక్షతలను తెలుసుకొని, తన వ్యాపార బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తర్వాతిరోజుల్లో వారిద్దరూజీవిత భాగస్వాములయ్యారు.
తరువాతి రోజుల్లోఒకే దైవం, దాన ధర్మం, పరులక్షేమం, చెడు నుంచి విమోచనం సార్వజనీన అంశాలుగా ప్రవక్త(స) రూపుదిద్దిన విధానం పవిత్రజ్ఞాన వర్షాన్ని కురిపింపజేసింది. ఆడంబరాలకు దూరంగాపూరిగుడిసెలో ఖర్జూర పండ్లు, మేకపాలు ఆహారంగా జనపనార పట్టమీద శయనిస్తూ అతుకులతో కూడిన వస్త్రాలను ధరించిన ఆచరణశీలి. తన రుజువర్తనను అర్థం చేసుకోలేక స్వజనులే శత్రువులుగా మారినా దివ్య సందేశ ప్రబోధంతోవారి గుండె లోతుల్లోని ద్వేషాన్ని, దుష్టత్వాన్ని నిర్మూలించగలిగారు. ఆయనలోని నిర్భీతి, దైవంపై గల అచంచల విశ్వాసం, నమ్మిన విలువలపై గల నిబద్ధత, నిరాడంబర జీవితం, తన బంధుమిత్రులు, అనుచరులపై గల ధృడ విశ్వాసాలే ఇస్లాం వ్యాప్తికి, ఉచ్ఛస్థితికి కారణమయ్యాయి. ప్రవక్తజన్మదినాన ఆయన బోధనల్ని అందరూ సరైన రీతిలో అర్థం చేసుకుని, ఆచరించి ప్రపంచాన్ని శాంతిమయం చేయాలని ఆశిద్దాం.