ఊరూ వాడా  క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చిలు, కార్యాలయాలు, వీధుల కూడళ్లు, క్రైస్తవుల ఇంటి ముంగిళ్ళలో   క్రిస్మస్ ట్రీలు దర్శనమిస్తున్నాయి. ఆకట్టుకునే రీతిలో  రకరకాల బొమ్మలు, పూలు, మెరుపుల అలంకరణలతో వేరు వేరు పరిమాణాల్లో  కనిపిస్తున్న వీటి అందాలను వర్ణించటానికి మాటలు చాలవు. అయితే  క్రిస్మస్ ట్రీ పెట్టే  సంప్రదాయం ఎప్పుడు ఎక్కడ  మొదలైంది? దీని వెనక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి? అని గమనిస్తే పలు  ఆసక్తికరమైన చారిత్రక, తాత్విక అంశాలు గుర్తుకువస్తాయి.

చారిత్రక అంశాలు

నిజానికి క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసే సంప్రదాయం 1000 ఏళ్ళ క్రితం జర్మనీకి క్రైస్తవాన్ని పరిచయం చేసిన సెయింట్ బోనిఫేస్ అనే ప్రచారకుడి చేత ఆరంభం అయ్యింది. ఆ తర్వాత కొంతకాలం మరుగున పడినా  16 శతాబ్దం నుంచి జర్మనీలో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో దీన్ని ప్యారడైజ్ ట్రీ అని పిలుచుకునేవారు. కానీ ఇప్పటిలా కృత్రిమ ఆకృతులు గాకుండా సరుగుడు చెట్లకొమ్మలు నరికి  తెచ్చి, దాన్ని ఇంటిముందు  క్రిస్మస్ ట్రీలా అలంకరించేవారు. తర్వాతి కాలంలో బ్రిటన్ మహారాణి  విక్టోరియా  18వ శతాబ్దంలో తన అధికారిక నివాసంలో దీన్ని మరింత భారీగా ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి క్రిస్మస్ ట్రీ  ప్రచారంలోకి వచ్చింది. అనంతర కాలంలో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ పియర్స్ (1804-1869) తొలిసారి శ్వేత సౌధంలో క్రిస్మస్ ట్రీ ఏర్పాటుకు అనుమతించడంతో మెల్లగా ఈ సంప్రదాయం ప్రపంచమంతా పాకింది.

క్రిస్మస్ ట్రీ గురించి చెప్పే మరో గాథ కూడా జనసామాన్యంలో ప్రాచుర్యంలో ఉంది. అప్పట్లో క్రిస్మస్ రోజున క్రైస్తవులంతా చర్చిలో ప్రార్ధనల అనంతరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునేవారు. అయితే ఆ ఏడాది క్రిస్మస్ సందర్భంగా అక్కడి గ్రామంలో నివసించే ప్లాబో అనే నిరుపేద బాలుడికి ఏమివ్వాలో అర్థంగాక ఇంటిముందు కనిపించిన ఓ అందమైన మొక్కను పీకి కుండీలో పెట్టుకుని చర్చికి తీసికెళ్లాడు. చర్చిలో విలువైన కానుకలు పట్టుకొని  ఉన్న ధనికులంతా ఈ పిల్లవాడి చేతిలోని మొక్కను చూసి ఎగతాళి చేయగా ఆ బాలుడు బాధపడుతూనే దాన్ని యేసు ప్రభువు పాదాల చెంత పెట్టి బాధతో తలవంచుకు నిలబడిపోయాడు. అయితే... మరుక్షణంలోనే ఆ చిన్న మొక్క బ్రహ్మాండమైన బంగారు వృక్షంగా మారిపోయింది.  నిరుపేద బాలుడు ప్రేమతో తెచ్చిన ఆ కానుకనే ప్రభువు స్వీకరించటంతో అందరూ తప్పు తెలుసుకుని అతనిని క్షమాపణ కోరారు. నాటి నుంచి ఏటా క్రిస్మస్‌ సందర్భంగా ఇంటిముందు చెట్టుని అలకరించడం మొదలుపెట్టారట. 

 ప్రపంచంలోని అన్ని నాగరికతలూ చెట్టును ఆనందానికి, సంపదకు చిహ్నంగా గుర్తించాయి. ఆ క్రమంలోనే అది క్రిస్మస్ అలంకరణలో భాగమైంది. ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని చెట్టు నుంచి మనుషులంతా ఇతరులకు సాయపడటం, క్షమించడం వంటి అంశాలను అలవరచుకోవాలనేదే క్రిస్మస్ చెట్టు ఏర్పాటులో అసలు ఆంతర్యం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE