• HOME
  • భక్తి
  • మకర సంక్రాంతి.. జ్యోతి దర్శనం

మకర సంక్రాంతి నాడు శబర గిరిపై అయ్యప్ప స్వామిని జ్యోతి స్వరూపంగా భక్తులు దర్శించి తరిస్తారు. ఇందుకోసం అయ్యప్ప మాల ధరించిన స్వాములు మకర సంక్రాంతి నాటికి శబరిగిరిని చేరి ఆలయంలో స్వామిని దర్శించి మాలను విసర్జిస్తారు. అనంతరం సంక్రాంతి సాయంత్రం వేళ శబరి గిరీశుడు జ్యోతి స్వరూపుడై కనిపించే దివ్యఘట్టానికి ఒళ్ళంతా కళ్ళుచేసుకొని ఎదురుచూస్తారు. స్వామికి, సంక్రాంతికీ ఉన్న బంధం వెనకున్న కొన్ని విశేషాలు గురించి తెలుసుకొని ఈ సంక్రాంతి వేళ ఆయన కృపను పొందుదాం. 

పురాణ గాథ

పూర్వం 'మహిషి' అనే రాక్షసి దేవతలపై పగ బట్టి బ్రహ్మ దేవుని గురించి ఘోర తపస్సు చేసింది. తస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మను శివకేశవుల కుమారుడు తప్ప తనను మరెవరూ జయించకుండా చూడాలనీ, ఆ కుమారుడు సాధారణ మానవుడిగా భూలోకంలో 12 ఏళ్ళు రాజుకు సేవ చేయాలనే షరతుతో వరం కోరగా బ్రహ్మ అనుగ్రహిస్తాడు. శివ, కేశవులిద్దరూ పురుషులే గనుక వారికి సంతానం కలగదనీ, ఇక తనకు ఎదురే లేదని మహిషి భావించి దేవతలను వేధించటం మొదలు పెడుతుంది. 

ఆ తరవాత కొన్నాళ్ళకు దేవదానవులు క్షీరసాగరాన్ని మధనం చేపట్టి, అమృతాన్ని సాధిస్తారు. అయితే పంపకాల గొడవ రావటంతో విష్ణువు మోహిని రూపంలో వస్తాడు. ఆయన అందానికి శివుడు మోహితుడైన కారణంగా వారిద్దరి తేజస్సు నుంచి ఒక బాలకుడు అవతరిస్తాడు.వారు ఆ బాలుడిని అక్కడే వదిలి పోగా, ఆ సమయంలో పంపా సరోవర తీరాన వేటకు వచ్చిన పందళ దేశపు రాజైన రాజశేఖరుడికి చెట్టుపొదల మధ్య మెడలో గొప్ప మణిమాలతో ఉన్న ఈ బాలకుడు దర్శనమిస్తాడు. సంతానం లేక శివుడిని ఆరాధిస్తున్న ఆ రాజు భగవంతుడే ఆ బాలుడిని ప్రసాదించాడని భావించి ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్లి రాణికి ఇస్తాడు. ఆ బాలుడికి 'మణికంఠుడు' అని పేరుపెట్టిన ఆ దంపతులు అతనిని అలారుముద్దుగా పెంచుతారు. 

 అయితే.. ఆ తర్వాత మహారాణి గర్భం ధరించి ఏడాది తిరిగే సరికి మగబిడ్డను కంటుంది. ఎంతో వినయం, విధేయత కలిగిన మణికంఠుని కొందరు ``అయ్యా'' అనీ, మరికొందరు ``అప్పా'' అని, ఇంకొందరు ఈ రెండు కలిపి ``అయ్యప్ప'' అని పిలిచేవారు. ఈ సమయంలో మంత్రి, రాణి బంధువులు రాణికి లేనిపోని విషయాలు నూరి పోస్తారు. రాబోయే రోజుల్లో వయసులో పెద్దవాడైన మణికంఠుడికే రాజు పట్టం కడతాడనీ, నీ కుమారుడికి ఏమీ దక్కదని వారు రాణికి చెప్పి మణికంఠుడిని అడ్డు తొలగించుకోమని చెబుతారు. దీంతో రాణి తలనొప్పి నటించి తన వైద్యానికి పులిపాలు కావాలని వైద్యులతో చెప్పించగా మణికంఠుడు పులిపాలకై అడవికి బయలుదేరతాడు. అదేసమయంలో ఆ సమయంలోనే నారదుడు మహిషికి కనిపించి అడవికి బయలుదేరిన అయ్యప్ప చేతిలో నీ జీవితం ముగియబోతోందని చెబుతాడు. దీంతో మహిషి పెద్ద గేదె రూపంలో అయ్యప్ప మీద దాడికి దిగగా స్వామి దాన్ని అనాయాసంగా వధిస్తాడు. ఆ యుద్ధం చూసేందుకు ఇంద్రుడి మొదలు యావత్తు దేవగణం తరలివస్తారు. 

మహిషి మరణానంతరం అయ్యప్ప స్వామి తాను అడవికి వచ్చిన కారణం గురించి దేవేంద్రుడితో చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు ఇతర దేవతలు పులుల సమూహంగా మారగా స్వామి పులి రూపాన ఉన్న ఇంద్రుని మీదెక్కి తన రాజ్యం చేరాడు. అయ్యప్ప రాకను చూసిన మంత్రి, రాణి బంధువులు స్వామి పాదాలపై పడి శరణు కోరగా స్వామి వారిని క్షమిస్తాడు. అనంతరం స్వామి తండ్రికి తన అవతారం త్వరలో ముగియనుందనీ, తమ్ముడికి పట్టం కట్టమని చెబుతాడు. తన ఆభరణాలు తండ్రికి ఇచ్చి ఏటా మకర సంక్రాంతి రోజు వీటిని తనకు సమర్పించమనీ, ఆ రోజు సాయంత్రం తాను జ్యోతి రూపాన ఆ కొండమీద అందరికీ దర్శనమిస్తానని చెబుతాడు. అనంతరం అందరూ చూస్తుండగా స్వామి తన ఖడ్గాన్ని విసురుతాడు. ఆ ఖడ్గం పడిన శబరి కొండపై అయ్యప్ప స్వామి కూర్చొని యోగమార్గంలో పరమాత్మలో లీనమై పోతాడు. నాటి నుంచి రాజ కుటుంబీకులు, లెక్కకు మించిన సంఖ్యలో భక్తులు సంక్రాంతినాడు స్వామి అవతారం చాలించిన చోట నిర్మితమైన ఆలయాన స్వామిని దర్శించి, ఆ రోజు సాయం వేళ జ్యోతి స్వరూపుడైన అయ్యప్పను దర్శించటం ఆనవాయితీగా మారింది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE