సంక్రాంతి మూడు రోజుల పండుగ. ఇందులో తొలి రోజును భోగి పండుగగా జరుపుకుంటాం. 'భగ' అనే పదం నుంచి భోగి అనే మాట వచ్చింది. 'భగ'  అంటే వేడి లేదా మంట  పుట్టించటం అన్నమాట. దక్షిణాయనానికి  ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, బాధలను భోగిమంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి పండుగ మనలోని ఆశావహ దృక్పథానికి సంకేతం. 

భోగి మంటతో మొదలు

భోగి రోజున తెల్లవారక ముందే లేచి భోగి మంటలు వేస్తారు. ఆవు పేడ పిడకలు, మామిడి, రావి, మేడి వంటి చెట్ల అవశేషాలు, తాటాకులు, అప్పటికే కోసిన పంటల ఎండు అవశేషాలు వేసి రాజేసే ఈ మంటల్లో ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్పగా పరిగణిస్తారు. తెల్లవారు జామున వణికించే ఆ చలిలో చిన్నా పెద్దా అంతా చేరి చలిమంటలు కాచుకుంటారు. పనికి రాని చెడు పాత ఆలోచనలను  వదిలించుకొని కాలంతో బాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును సిద్ధం చేయటమే భోగి మంట వెనకున్న పరమార్థం. అయితే ప్రస్తుత కాలంలో పాత సామానుకు బదులు పాత టైర్లు, కిరోసిన్, ప్లాస్టిక్ వస్తువులు సైతం వేస్తున్నారు. ఈ చర్య పర్యావరణానికి చేటు చేయటమే గాక ఈ మంటలో వచ్చే ప్రమాదకర వాయువులు ఆరోగ్యానికి కీడు చేస్తాయని గుర్తించాలి. 

నలుగు స్నానం తప్పనిసరి

భోగిమంటలు పూర్తి కాగానే తలకి, ఒంటికి  నువ్వుల నునె పట్టించి మర్దన చేసుకొని కుంకుడు కాయ రసంతో తలస్నానం చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చేయాలి. దీనివల్ల చలి వాతావరణం కారణంగా ఒంట్లో చేరిన కఫ దోషాలు తొలగి పోయి శరీరం నూతన ఉత్తేజాన్ని పొందుతుంది. ఇలా చేసే స్నానం పీడను, దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం.

పులగం

భోగినాడు కొత్త బియ్యతో చేసిన పులగం తినటం సంప్రదాయం. కొత్త బియ్యం, పెసర పప్పు, నెయ్యి, మిరియాలు జోడించి చేసే ఈ వంటకం రుచికే గాక పోషకాల పరంగానూ ఎంతో మేలైనది. చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపించే ఈ పులగాన్ని భోగినాడు తప్పక తినాలని పెద్దలు చెబుతారు.  

బొమ్మల కొలువు

భోగినాటి సాయంత్రం  చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను క్రమపద్ధతిలో  ప్రదర్శనగా ఉంచి పూజిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేవీ దేవతల పాటలు పాడి వారి ఆశీస్సులు కోరుకుంటారు.

భోగి పులక

కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర నీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE