• HOME
  • భక్తి
  • వాయు లింగ క్షేత్రం.. శ్రీకాళహస్తి

తెలుగునాట ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో శ్రీకాళహస్తి ఎంతో ప్రముఖమైనది. పరమేశ్వరుడు స్వయంగా బ్రహ్మకు జ్ఞానబోధ చేసిన క్షేత్రమిది. 'దక్షిణకాశి'గా పేరున్నఈ క్షేత్రంలో స్వామి స్వయంభు వాయు లింగంగా దర్శనమిస్తాడు. దీనికి రుజువుగా గర్భాలయంలో స్వామి చెంత వెలిగే 2 దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది. సువర్ణముఖి తీరాన ఉన్న ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా భక్తులకు దర్శనం ఇస్తోంది. ఈ శ్రీకాళహస్తి ప్రస్తావన స్కంద, శివ, లింగ పురాణాల్లో వుంది.

స్థలపురాణం

పూర్వం వశిష్ట, విశ్వామిత్ర వైరం కారణంగా వసిష్టుడు తన 100 మంది కొడుకులనూ కోల్పోతాడు. పుత్రవియోగం వల్ల ఆ మహర్షి ఈ గజకాననానికి( ఈ క్షేత్ర పూర్వనామం) వచ్చి పర్వతం మీదినుంచి దూకి ప్రాణత్యాగం చేయబోగా  భూమత వారించి శివుని గురించి తపస్సు చేయమని చెబుతుంది. తపస్సు గావించిన వశిష్టునికి మహాదేవుడు 'దక్షిణామూర్తి' రూపంలో మర్రిచెట్టు కింద దర్శనమిచ్చి వరం కోరుకోమనగా స్వామిని అక్కడే కొలువై ఉండమని కోరుకున్నాడట. నాటినుంచి శ్రీకాళహస్తి జ్ఞానక్షేత్రమైంది.

ఈ క్షేత్రానికి సంబంధించిన మరో ప్రముఖ గాథ జనసామాన్యంలో ప్రచారంలో ఉంది. దీనిప్రకారం.. పూర్వం శ్రీ-సాలె పురుగు, కాళ - సర్పము, హస్తి - ఏనుగు అనే ఈ మూడు జీవులు స్వామిని రోజూ అర్చించేవి. స్వామి పూజ విషయంలో వాటిమధ్య వచ్చిన పోటీ కారణంగా వైరం ఏర్పడి ప్రాణాలు కోల్పోయిన ఆ జీవులు స్వామి కృపచే ముక్తిని పొందాయి.ఆ మూడు జీవుల పేరిటే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. ఇందుకు రుజువుగా ఇక్కడి ఆలయం ముందు ఈ మూడు జంతువుల విగ్రహం కూడా వుంది.

కన్నప్ప ముక్తిక్షేత్రం

 పూర్వం కన్నప్ప(తిన్నడు) అనే వేటగాడు అడవిలో దుమ్ముతో కప్పబడి ఉన్న శివలింగాన్ని చూసి, ఆ స్ధలాన్ని శుద్ధి చేసి పుక్కిటబట్టిన నీటితో శివలింగాన్ని శుభ్రం చేసేవాడు. మాంసం మొదలు ఆ రోజు ఏది దొరికితే అదే స్వామికి నివేదించేవాడు. అమాయకుడైన అతని భక్తికి మురిసిపోయిన శివయ్య అతడిని పరీక్షించాలని అనుకొంటాడు. ఇందులో భాగంగా అతడు పూజించే శివ లింగానికి ఉన్న రెండు కళ్ళలో ఒకదాని నుంచి రక్తం స్రవింపజేస్తాడు. స్వామి కంటికి గాయమైందని భావించిన కన్నప్ప బాణంతో తన కన్ను తీసి రక్తం కారుతున్నచోట పెట్టగానే రక్తం కారం ఆగిపోతుంది. అయితే కన్నప్ప భక్తిని మరింత పరీక్షించాలని భావించిన ఈశ్వరుడు శివలింగపు రెండో కంటి నుంచి రక్తం కారేలా చేయగా క్షణం ఆలోచించకుండా రెండో కంటినీ తీసి శివలింగానికి అమర్చి సంతోషపడిపోతాడు. అమాయకుడైన ఆ బోయవాడి పరమ భక్తికి చలించి పోయిన పరమేశ్వరుడు కన్నప్పకు దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ పరమశివుని కంటే ముందుగా భక్తుడైన కన్నప్పకు ఇక్కడ తొలిపూజ చేస్తారు. ఈ కన్నప్ప భక్తికి పరవశించి ఆదిశంకరులు తన శివానందలహరిలో కన్నప్పను ప్రస్తావించారు.

క్షేత్ర ప్రత్యేకతలు

ఈ ఆలయంలో శివలింగం సాధారణ రూపానికి భిన్నంగా చతురస్రాకారంగా ఉంటుంది. దేశంలోనే ఇతర ఆలయాల్లో భక్తులు సవ్యదిశలో ప్రదక్షిణం చేసి మూలవరులను దర్శించుకుంటుండగా, ఈ ఒక్క క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకుంటారు. ఇక్కడి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తల ఓ వైపు వాల్చి భక్తులకు దర్శనమిస్తుంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. నవగ్రహ కవచ సహిత శివలింగం ఉన్నకారణంగా సకల గ్రహాలూ స్వామి ఆధీనంలో ఉంటాయి. రాహుకేతు, కుజ మరియు నాగదోషాలున్నవారు స్వామి చెంత దోష నివారణ పూజలు చేయిస్తే సమస్యలు తీరతాయని భక్తుల విశ్వాసం. అలాగే గ్రహణాలతో నిమిత్తం లేకుండా ఏడాదిపొడవునా స్వామిని సేవించుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలోని 'మణికుండేశ్వరాఖ్య ” లో ప్రాణాలు విడిచిన వారికి కాశీ క్షేత్రములో వలే ఈశ్వరుడే స్వయంగా తారక మంత్రోపదేశం చేసి కైలాసప్రాప్తిని కలిగిస్తాడని భక్తుల నమ్మకం. ఆదిశంకరులు దర్శించి, శ్రీ చక్ర స్థాపన చేసిన ఆలయమిది.

ఆలయ నిర్మాణ శైలి, చరిత్ర

ఈ ఆలయం ప్రాచీన ద్రవిడ వాస్తు వైభవానికి నిదర్శనం. ఆలయంలో ఉన్న వేయి కాళ్ళ మంటపపు అందం, ఆలయ పైకప్పు మీద క్షేత్ర విశేషాలను వివరించే వర్ణ చిత్రాల సొగసు గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మవారి సన్నిధికి దగ్గరలోని ఒక ప్రదేశంలో నిలబడితే ఆలయ ప్రధాన గోపురాలన్నీ కనిపిస్తాయి. ఈ తరహా నిర్మాణాలు దేశంలో బహుకొద్ది మాత్రమే ఉన్నాయి.  

ఈ ఆలయపు దక్షిణ గాలిగోపురాన్ని ఒకటవ కులోత్తుంగ చోళుడు నిర్మించగా, మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర అనుబంధ ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 1516లో శ్రీకృష్ణదేవరాయల వారు వంద స్థంభాల మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురాలు నిర్మించాడు. 1529లో అచ్యుతరాయల పట్టాభిషేకం సైతం ఈ ఆలయంలోనే జరిగింది. అష్టదిగ్గజాలలో ఒకడు, శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించి, ఆ స్వామి సేవలో తరించిన ధూర్జటి ఇక్కడివాడే.

ఇతర ఆలయాలు

భక్తులు ఆలయ తూర్పు ద్వారం గుండా ప్రవేశించి, ముందుగా పాతాళ గణపతిని దర్శించి, ఆ తర్వాత స్వామిని దర్శించుకుంటారు. ఆలయంలో దక్షినాభి ముఖంగా కొలువై ఉండే దక్షిణామూర్తి సన్నిధిలో ఆయనను స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది. ప్రధాన ఆలయం తర్వాత శ్రీకాళహస్తిలో తప్పక చూడాల్సిన ఆలయాల్లో చతుర్ముఖేశ్వర ఆలయం ఒకటి. బ్రహ్మ, మహేశ్వరుల కోసం నిర్మించిన ఈ చిన్న గుడిలోని శివలింగం అన్నివైపుల నుంచి దర్శించేలా 4 ముఖాలతో ఉంటుంది. ఇక్కడ ఆలయాలలో సహస్ర లింగ దేవాలయం మరొకటి. ఏకశిల పై వేయి లింగాలు చెక్కిన ఈ శివలింగాన్ని దర్శించిన వారి పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు.అలాగే.. శ్రీకాళహస్తిలోని 1200 - 1500 ఏళ్ళ నాటి శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయాన్ని భక్తులు దర్శిస్తారు. ఈ చిన్న ఆలయంలోని శివలింగం దక్షిణాదిలోని అతి పెద్ద శివలింగంగా పేరుపొందింది. శ్రీకాళహస్తి లోని ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం సైతం ఎంతో పేరుపొందింది.

రవాణా, వసతి

విజయవాడ-రేణిగుంట శ్రీకాళహస్తి ఉంది. కనుక రైలు ప్రయాణీకులు నేరుగా ఇక్కడ దిగవచ్చు.  తిరుపతి మొదలు వివిధ ప్రాంతాల నుంచి కూడా శ్రీకాళహస్తికి ప్రతి 20 నిమిషాలకో బస్సు ఉంటుంది. ఇక్కడికి సమీపంలోని రేణిగుంటలో తిరుపతి విమానాశ్రయముంది. ఇక్కడ భక్తుల వసతి కోసం ఆలయం తరఫున పలు సత్రాలు, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు అద్దెలతో భక్తులు ఇక్కడ వసతి పొందవచ్చు. ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవల వివరాల కోసం 08578- 222240 నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE