మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకోవటం సంప్రదాయం. ఈ రోజు సూర్య భగవానుని జన్మతిథి. రథసప్తమి నుంచే స్వామి రథం ఉత్తర దిశగా సాగుతుందనీ, దీనివల్ల  భూమి, సూర్యునికి మధ్య దూరం తగ్గి క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయనీ చెబుతారు. త్రిమూర్తుల ఏకరూపమైన సూర్యభగవానుని వల్లనే సర్వభూతాలు ఏర్పడ్డాయని  సూర్యోపనిషత్తు వివరిస్తోంది. స్వామి ఉదయ కాలంలో బ్రహ్మగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మధ్యాహ్నం మహేశ్వరునిగా వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణువుగా ఆనందాన్ని కలిగిస్తాడనీ, స్వామి నామ స్మరణ వల్ల దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణం వివరిస్తోంది.

స్వామి చరిత్ర

కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు విష్ణు అనుగ్రహంతో జన్మించిన వాడే సూర్యుడు. రవి, భాను, దినకర, భాస్కర, సవిత, వివస్వత, సర్వాత్మక, సహస్రకిరణ, పూష, ఆదిత్య తదితర నామాలతో భాసించే ఈ స్వామికి ఛాయాదేవి, సంజ్ఙాదేవి దేవేరులు కాగా  యముడు, యమున, శని, వైవస్వతులు వీరి సంతానం. ప్రత్యక్ష దైవమైన స్వామి ఒకే చక్రమున్న రథం మీద ప్రయాణిస్తాడు. ఇదే కాలచక్రం. ఈ చక్రం ఏడాదికి చిహ్నం కాగా చక్రంలోని 6 ఆకులు ఆరు ఋతువులకు సంకేతాలు. కాగా ఆయన రథాన్ని లాగే 7 గుర్రాలు వారంలో 7 రోజులకు ప్రతీకలు.

పుణ్య విధులు

చవితినాటి రాత్రి ఉపవాసం చేసి, రథ సప్తమి సూర్యోదయ సమయానికి స్నానం చేయాలి.  స్నానానికి ముందు ప్రమిదలో ఆవునేతితో దీపం వెలిగించి తలపై పెట్టుకొని స్వామిని జపించి దీపాన్ని నీటిలో వదిలి, స్నానం చేయాలి. స్నాన సమయంలో జిల్లేడు, చిక్కుడు, రేగుపళ్ళు నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయాలి. స్నానం పూర్తైన తర్వాత స్వామికి అర్ఘ్యమిచ్చి, ఎర్రనిపూవులను సమర్పించి భక్తితో సూర్య నమస్కారం, ధ్యానం చేయాలి. అనంతరం తల్లిదండ్రులు లేని వారు పితృతర్పణం వదిలి చిమ్మిలి దానం చేయాలి. ఈ రోజు ఉదయాన్నే ఇంటి ముందు రథం ముగ్గు వేసి, సూర్యునికి అభిముఖంగా పొయ్యి పెట్టి ఆవు పిడకల మీద పరమాన్నం వండి చిక్కుడు ఆకులలో స్వామికి నైవేద్యం పెట్టి పూజ ముగించాలి. సూర్యోదయానికి గంటలోపు పూజ చేయాలి. ఈ రోజున గురువును అతిథిగా ఆహ్వానించి సన్మానించి ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయటం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది.

రథ సప్తమినాడు ఆదిత్య హృదయాన్ని కానీ, సూర్యాష్టకాన్ని గాని 9 సార్లు పఠిస్తే విశేష ఫలితం కల్గుతుంది.  రామ,రావణ సంగ్రామ సమయంలో శక్తి క్షీణించి, నిరాశకు గురైన శ్రీరాముడికి అగస్త్య మహార్షి రఘువంశ మూలపూరుషుడైన సూర్యశక్తిని తెలిపి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడనీ, ఈ ఆదిత్య హృదయ ప్రభావంతో శ్రీరాముడు రావణ వధ చేసినట్టు రామాయణం వివరిస్తోంది.

తిరుమల రథసప్తమి వేడుకలు

ఈ రోజున తిరుమల లో అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతాయి. స్వామి ఉభయ దేవేరులతో ప్రతి 2 గంటలకో వాహనం చొప్పున 7 వాహనాలపై తిరుమాడ వీధుల్లో దర్శనమిస్తారు. ఉదయం సూర్యప్రభ వాహనం తో మొదలయ్యే ఈ వేడుకలు శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలతో పూర్తవుతాయి. అనంతరం చక్ర స్నానంతో మొత్తం వేడుక ముగుస్తుంది. ఈ రోజున నల్లగొండ జిల్లాలోని అకరం, శ్రీకాకుళంలోని అరసవిల్లిలో గల ప్రసిద్ధ సూర్య దేవాలయాలను భక్తులు సందర్శిస్తారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE