పూర్వం అయిదుగురు గురువులు ఎవరికి వాళ్లు తమ మతమే గొప్పదని వాదించుకున్నారు. రోజులు గడిచినా వాళ్ల తగాదా తీరలేదు. అప్పుడు వాంతా కలిసి ఒక మహాత్ముడిని కలిసి పంచాయతీ తేల్చుకుందామని అనుకొని బయలుదేరి ఆయన్ను కలుసుకొంటారు. వచ్చిన పని చెప్పి ఒక్కొక్కరే తమ తమ మతాల గొప్పదనాన్ని, పాటించే ఉపాసనా విధానాలను ఆయనకు వివరిస్తూనే ఇతర మతాల మీద తమ ద్వేషాన్ని కూడా వెళ్లగక్కారు. వారిలో ప్రతి ఒక్కరూ మిగిలిన మతాలు పనికిరానివనీ, తమ మతంలో చేరితే తప్ప దేవుడిని చేరుకోలేరని చెప్పి తమ వాదనలను ముగించారు. 

అప్పటివరకు వారి వాదనలు విన్న ఆ మహాత్ముడు, దేవుడి దృష్టిలో అందరూ సమానులేననీ, ఆయనకు రాగద్వేషాలుండవనీ చెబుతాడు. ఒకవైపు దేవుడిని శాంతిస్వరూపుడు, కరుణామయుడు, పవిత్రుడు, శుభంకరుడని స్తుతిస్తూనే... మరోవైపు మనసు నిండా పక్షపాతం,  రాగద్వేషాలను నింపుకొన్నారని వారికి గుర్తుచేశాడు. సర్వ సద్గుణ సముపేతుడైన ఆ భగవంతుని చేరుకోవాలనుకొంటే ఎవరైనా ముందుగా తమలోని  దుర్గుణాలను విడిచిపెట్టాల్సిందేనని స్పష్టం చేసాడు. ప్రేమ, శాంతి లేకుండా ఇవన్నీ అసాధ్యమని వివరించాడు. 

ఆ మహాత్ముడి మాటలు విన్న ఆ గురువులు సిగ్గుతో తలదించుకున్నారు. ఈ హితబోధ చేసిన మహాపురుషుడు బుద్ధుడు. దుఃఖానికి కోరికలే కారణమనీ, వాటికి అజ్ఞానమే మూలమని లోకానికి చాటిచెప్పిన జ్ఞాని బుద్ధుడు. సరైన వాక్కు, దృష్టి, క్రియ, జీవనం, ప్రయత్నం, మనసు, ధ్యానం అనే వాటివల్ల జ్ఞానం కలుగుతుందనీ, ప్రతిమనిషి అహింస, దయ, భోగరాహిత్యం, ప్రేమ, సత్యమనే నియమాల పాలనతో మనిషి తనను తాను ఉద్ధరించుకోవచ్చని లోకానికి చాటిన జ్ఞానజ్యోతి.  

గొర్రెను బలి ఇస్తేనే మోక్షం లభిస్తే, ఏకంగా మనిషినిస్తే సరాసరి స్వర్గానికే పోవచ్చు గదాని ప్రశ్నించి సమాజాన్ని ఆలోచింపజేసిన మహితాత్ముడు. సాధన ద్వారా తానూ తనలాగే ప్రతి మనిషీ బుద్ధుడు కావాలని ఆకాంక్షించాడు. ఆయన మార్గంలో మనలో కొందరైనా నడవగలిగితే ఈ ప్రపంచం ఇప్పుడున్న దానికంటే మరింత అందంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.  Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE