• HOME
  • భక్తి
  • ముక్తికారకం..ద్వాదశ జ్యోతిర్లింగ స్మరణం

 ఆసేతు హిమాచలం శివనామ స్మరణతో మారుమోగే పర్వదినం.. మహాశివరాత్రి. ఈ రోజున కనీసం మనసులో పరమేశ్వరుడిని తలచుకున్నా సిద్దించే ఫలితం అమోఘం. ఈశ్వరుడు తన ఉనికిని ప్రకటించిన ద్వాదశ జ్యోతి ర్లింగాలను భౌతికంగా దర్శించలేకపోయినా ఈ మహాశివరాత్రినాడు అంతటి మహత్తరమైన జ్యోతిర్లింగాల చరిత్రను తెలుసుకొని, మననం చేసుకొన్నా సమస్త పాపాలు నశిస్తాయని ప్రతీతి. స్వామి స్వయంవ్యక్త రూపాలుగా నిలిచిన ఆ క్షేత్ర వివరాలను తెలుసుకుందాం. 

పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది ప్రభాసక్షేత్రంలో ఉన్న సోమనాధ లింగం. దక్ష ప్రజాపతి తన 27 మంది కూతుళ్లను (అశ్వని, భరణి మొదలు 27 నక్షత్రాలు వీరే) చంద్రునకిచ్చి పెళ్లి చేయగా అల్లుడైన చంద్రుడు చిన్నదైన రోహిణి పట్ల ప్రేమ చూపుతూ మిగతా వారిని నిర్లక్ష్యం చేస్తాడు. అప్పుడు వారంతా భర్త వైఖరిని తండ్రికి వివరించి కనీరు పెట్టుకోగా ఉగ్రుడైన దక్షుడు చంద్రుని క్షయ వ్యాధిగ్రస్తుడై పోవాలని శాపమిస్తాడు. అయితే.. అనంతరం బ్రహ్మ సూచనమేరకు చంద్రుడు ఈ ప్రభాస తీర్థానగల శివలింగాన్ని అర్చించి రోగ విముక్తుడైనాడు. సోముడు అనగా చంద్రుడు. లింగరూపుడై ఇక్కడ వెలసిన శివుని ఆరాధించాడు కనుక దీనికి సోమనాధ క్షేత్రం అని పేరు.  ఇక్కడ వున్న సోమనాధ మందిరంలోని గర్భగుడి క్రింది గుహలో అప్పటి చంద్రార్చిత శివలింగాన్ని నేటికీ చూడవచ్చు. 

జ్యోతిర్లింగాలలో రెండవది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల మల్లికార్జున లింగం. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ఒకటి. ఇక్కడ స్వామి భ్రమరాంబ, సాక్షిగణపతి సహితంగా దర్శనమిస్తాడు. క్రౌంచ పర్వతం వీడి అలిగి వెళ్లిపోయిన కార్తికేయుడిని వెతుకుతూ వచ్చిన స్వామి ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడై ఉండిపోయాడు. శ్రీశైల శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్మిక. 

ద్వాదశ జోతిర్లింగాలలో మూడవది మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ పట్టణాన గల మహాకాళ లింగం. క్షిప్రా నదీ తీరాన గల ఈ నగరములో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84 సిద్ధ లింగములు, 30 శివలింగములు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరములు, జలకుండము ఉన్నాయి. నాటి ఉజ్జయిని పాలకుడైన చంద్రసేనుడు చేసే శివార్చన చూసిన శ్రీకరుడనే బాలుడు ఒకరాతిని శివలింగంగా భావించి తానూ అలాగే పూజించేవాడు. కుటుంబీకులు ఈతని చేష్టకు విసిగి ఆటంకం కల్పిస్తున్న క్రమంలో చివరకు ఆ బాలుడు తానుపూజించే శివలింగంలో లీనమైపోతాడు. సూర్యాస్తమయ సమయంలో మహాకాళేశ్వర లింగ దర్శనం విశేష ఫలప్రదం. 

ద్వాదశ జోతిర్లింగాలలో నాల్గవది నర్మదాతీరంలోని ఓంకారేశ్వర లింగం. దీన్ని అమలేశ్వలింగమనీ అంటారు. ఇక్కడ శివలింగం రెండుగా ఉండి అపి రెండు పేర్లతో పూజలందుకొంటుంది. పర్వతాలలో నేనే గొప్పవాడినని అహంకరించిన వింధ్యపర్వతానికి బుద్ధి చెప్పేందుకు నారదుడు పూనుకొంటాడు. పర్వతాల్లో మేరు పర్వతమే గొప్పదనీ, అంతటి పేరు సాధించాలంటే శివుని అనుగ్రహం అవసరమనీ నారదుడు చెప్పటంతో వింధ్యుడు ఈ క్షేత్రంలో తపస్సుకు పూనుకొని చివరకు శివదర్శనాన్ని పొందుతాడు.  

ద్వాదశ జోతిర్లింగాలలో అయిదవది కేదారేశ్వర లింగం. హిమాలయ శ్రేణులలో గల కేదారనాథ్ క్షేత్రపు కొండ కొనకొమ్మున సదాశివుడు కేదారనాథుడిగా ఇక్కడ దర్శనమిస్తాడు. నరనారాయణులనే మునుల ఉగ్రతపోదీక్షకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడైనాడు. మంచు కారణంగా ఈ ఆలయం ఏడాదిలో 6 నెలలు మాత్రమే తెరచి ఉంటుంది.

 ద్వాదశ జోతిర్లింగాలలో ఆరవలింగం భీమశంకర లింగం. శివభక్తులైన సుదక్షిణ, కామరూపులను రక్షించేందుకు స్వామి ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడై నిలిచాడు. సహ్యాద్రి కనుమలలో భీమా నదీ ఉత్తర తీరాన గల ఈ భీమశంకరుడు సర్వసంకటహరుడు. ఇక్కడ అమ్మవారు కమలజాదేవిగా దర్శనమిస్తుంది. 

ద్వాదశ జోతిర్లింగాలలో ఏడవది.. వారణాశిలో పూజలందుకొనే విశ్వవిఖ్యాత విశ్వేశ్వర లింగం. మహా క్షేత్ర తీర్థరాజమై, సర్వ విద్యాధామమై విరాజిల్లే (అవిముక్తం) ముక్తి క్షేత్రమైన వారణాశి ఈశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రదేశం. ప్రళయకాలంలో కూడా లయం కాదని ఈశ్వరునిచే వరం పొందిన మహాశ్మశానమే వారణాశి. సదా సుప్రసన్నంగా సర్వ సేవ్యంగా ఉండే విశ్వేశ్వరుడు అన్నఫూర్ణ, ఢుంఢి గణపతి సమేతంగా దర్శనమిస్తాడు. వారణాశిలో మరణించేవారికి సాక్షాత్తూ శివుడే తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. ఇది విష్ణువు తపస్సు చేసిన పుణ్యస్థలంగా కూడా పేరుపొందింది. 

ద్వాదశ జోతిర్లింగాలలో ఎనిమిదవది.. మహారాష్ట్ర, నాశిక్ సమీపాన గల త్రయంబకేశ్వర లింగం. బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి ఇక్కడ తన జటాజూటం నుండి గోదావరిని ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఇక్కడి లింగము చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగములున్నవి. ఇక్కడి అమ్మవారు కొల్హాంబిక. 12 ఏళ్లకోమారు ఇక్కడ జరిగే సింహస్థపర్వము ఎంతో ప్రసిద్ధి చెందింది. 

ద్వాదశ జోతిర్లింగాలలో తొమ్మిదవది.. వైద్యనాథ లింగం లేక అమృతేశ్వర లింగం. దీన్నే భూకైలాసమనీ అంటారు. శివానుగ్రహంతో తాను పొందిన ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు బయలుదేరైనా రావణుడు వింధ్యపర్వతం చేరేసరికి సంధ్యా సమయం కావటంతో సంధ్యా వందనానికి పూనుకొంటాడు. అయితే లింగాన్ని ఎట్టి పరిస్థితిలోనూ క్రిందపెట్టరాదన్న శివుని షరతు మేరకు అక్కడ ఆవులు కాస్తున్న ఒక బాలుడి చేతిలో లింగాన్ని పెట్టి సంధ్య వార్చేందుకు వెళ్లగా, ఈలోగా నారదుని ప్రేరణచే ఆ గొల్ల పిల్లవాడి రూపాన ఉన్న గణపతి ఆ లింగాన్ని రావణుడు రాకముందే నేల మీద పెట్టటంతో స్వామి అక్కడే ఉండిపోయాడు. ఇక్కడి లింగం అమృతప్రాయమనీ, ఈ లింగాన్ని పూజించిన వారికి ధన్వంతరి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. 

ద్వాదశ జోతిర్లింగాలలో పదవది గుజరాత్ లోని నాగేశ్వర లింగం. ఈ జ్యోతిర్లింగము ద్వారక, అవధ్, ఆల్మోరా (ఉత్తరప్రదేశ్) అను మూడు స్థానములలో ఉన్నట్లు చెబుతారు. దారుకుడనే రాక్షసుడి బారినుండి సుప్రియుడు అనే మహాశివార్చనాపరుని రక్షించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఇక్కడ. ఈ లింగార్చన వల్ల చక్రవర్తిత్వం సిద్ధిస్తుందని నలచక్రవర్తి నిరూపించాడు. 

ద్వాదశ జోతిర్లింగాలలో పదకొండవది.. తమిళనాడులోని రామనాథ లింగం. త్రేతాయుగంలో రాముడు, రావణవధ అనంతరం, సేతుబంధనం చేసిన ప్రాంతంలో శివార్చన చేసి, జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరుడిగా ఉండమని కోరగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు. కాశీ గంగా జలమును ఇక్కడి రామేశ్వర లింగాన్ని అర్చించిన తరువాత రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయము. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి. 

ద్వాదశ జోతిర్లింగాలలో చివరిది.. .ఘృష్ణేశ్వర లింగం. మహారాష్ట్ర లోని దేవగిరి పర్వత సమీపంలో ఘశ్మ అనే మహా భక్తురాలి కోరికపై స్వామి జ్యోతిర్లింగంగా నిలిచాడు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE