• HOME
  • భక్తి
  • మనిషి శివుడయ్యే రోజు.. మహా శివరాత్రి

ఏటా మాఘ బహుళ చతుర్దశిని 'మహాశివరాత్రి' గా జరుపుకుంటాం. ఈ రోజే పరమేశ్వరుడు లింగాకారుడిగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. మనుషుల అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి. అందుకే ఈ రోజు రాత్రి పరమేశ్వరుని లింగోద్భవ మూర్తిగా అభిషేకించి పూజిస్తారు. ఆద్యంతరహితుడు, నిరాకారుడు, భక్తజన వల్లభుడైన పరమేశ్వరుడిని ఈ రోజు పొరబాటున తలచినా మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆసేతు హిమాచలం శివనామ స్మరణతో తరించే ఈ శుభసమయాన శివావతార విశేషాలను తెలుసుకుందాం.

లింగావిర్భావ గాథ

ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే చర్చ వస్తుంది. ఇది పట్టుదలగా మారి ఒక పోటీకి దారితీస్తుంది. అప్పుడు వారిరువురూ పరమేశ్వరుని అభిప్రాయం కోరగా ఆయన అతిపెద్ద లింగరూపంలో ఆవిర్భవించి తన మొదలు, చివరలను ముందుగా తెలుసుకున్నవారే ఈ పందెంలో గెలిచినట్లని ప్రకటిస్తాడు. దానికి అంగీకరించిన విష్ణువు పంది రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ సాగిపోగా, హంస రూపాన బ్రహ్మ శిరోభాగం వైపు సాగిపోతారు. ఎంత దూరం ప్రయాణించినా వారివురూ లింగాకారుడైన శివుని ఆద్యంతాలు కనుగొనలేక పోతారు. అహంకారం నశించిన వారిద్దరూ పరమేశ్వరుని శరణువేడగా, ప్రసన్నుడైన ఈశ్వరుడు నిజరూపాన దర్శనమిస్తాడు. బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి విశేష పూజలతో సేవించైనా ఆ పర్వదినమే 'మహాశివరాత్రి'.

రూప విశేషాలు

శివుని రూపవిశేషాలు అనంతం. ఆయన ఆభరణమైన సర్పం, శిరస్సున నిలిచిన గంగ మనలోని కుండలిని, జాగృతికి ప్రతీకలు . శివనామాపు 3 విభూతి రేఖలు జాగృతి, స్వప్న, సుషుప్తి అనే 3 స్థితులకు సంకేతాలు కాగా వాటి మధ్య బింధువు తురీయావస్థకు ప్రతీక. ఆయన ఫాలనేత్రం ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండే ప్రజ్ఞాచక్షువు. ఆయన అర్ధనారీశ్వర తత్త్వం ఇడ, పింగళ నాడులకు సంకేతం. సగం మూసిన అయన నేత్రాలు ధ్యానస్థితిలో అంతర్ముఖస్థితికి దర్పణం. ఆదిగురువైన ఆయన నుంచే యోగం, సంగీతం వంటివన్నీ ఆవిర్భవించాయి . కపాల పాత్రతో భిక్షగా ఆయన స్వీకరించేది మన పాపాలనే. ఆయన కూర్చున్న పులి చర్మం, కట్టుకొన్న గజచర్మం, నివసించే స్మశానం భౌతిక సంపదల నుంచి మనసును వైరాగ్యం వైపు మరల్చే సంకేతాలే. మన్మథుడి పేరిట ఆయన దహించింది అహంకారాన్ని. ఇలా ఆయన రూప విశేషాలు ఎంత చెప్పిన తక్కువే.

గుణనిధి కథ

పరమేశ్వరుడు ఎంత భక్త సులభుడో, శివరాత్రి ఎంత పుణ్యకారకమో ఈ గుణానిథి కథ వివరిస్తుంది. పూర్వం గుణానిథి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను భౌతిక సుఖాలపై మోజు పెంచుకొని సంధ్యావందనం మొదలు ఏ వైదిక కర్మలను పట్టించుకొనేవాడు కాదు. పైగా అతనికి లేని వ్యసనం లేదు . అన్ని విధాలా పతనమైన గుణానిథి ఒక మహాశివరాత్రి రోజు అనివార్య పరిస్థితిలో గుప్పెడు మెతుకులు దొరక్క ఖాళీ కడుపుతో ఉండాల్సి వస్తుంది. బాగా పొద్దుపోయాక గుడిలో పండో ఫలమో దొరుకుతుందేమోననే ఆశతో ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి వెతుకుతాడు . ఆ సమయంలో గుళ్లో శివరాత్రి జాగారం చేస్తున్న భక్తులను చూసి భయపడి పారిపోయే క్రమంలో శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. శివరాత్రి అని తెలియకపోయినా ఉపవాసముండి, దీపం వెలిగించిన కారణంగా శివుడు గుణానిథికి ముక్తిని ప్రసాదిస్తాడు. శివరాత్రి మహత్యం అంతటిది.

శివరాత్రి విధులు

ఈ రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరము, ఇల్లు శుభ్రం చేసుకొని గుమ్మాన్ని తోరణాలతో, పూజామందిరాన్ని ముగ్గులు, పుష్పాలతో అలంకరించుకోవాలి. తెల్లని బట్టలను ధరించి, మారేడు దళములతో యథాశక్తి శివపూజ చేసి పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యం సమర్పించాలి. ఆ రోజంతా శివనామ స్మరణతో ఉపవాసముండాలి. విశేషమైన లింగోద్భవకాలం రాత్రి 11-30 నుండి ఒంటిగంట వరకు ఉంటుంది. ఈ సమయంలో నిర్గుణ, నిరాకార పరబ్రహ్మ, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామియైన పరమేశ్వరుడిని పంచాక్షరీ మంత్రంతో కొలుస్తూ, మొదటి జాములో పాలతో, రెండవజాములో పెరుగుతో, మూడవ జాములో నెయ్యితో, నాల్గవ జామున తేనెతోను అభిషేకము చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. ఈ రోజున ఎర్రని ప్రమిదల్లో దీపారాధన చేయాలి. దీపారాధనకు నువ్వులనూనె వాడటంతో బాటు ప్రమిదలో ఐదు వత్తులు వేసి పంచహారతి ఇవ్వడం మంచిది. మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివనామ స్మరణ చేసి ఉదయాన స్నానం చేసి శివపూజ చేసి ఉపవాసాన్ని విరమించాలి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE