• HOME
  • భక్తి
  • నూతనత్వాన్నిప్రతీక.. ఉగాది

 చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకోవటం తెలుగునేల సంప్రదాయం. ఏడాదిలో వచ్చే మన తొలి పండుగ కూడా ఉగాదే. తొలిరుతువైన వసంతపు మొదటి నెలైన చైత్రంలో.. లేత చిగుళ్లతో ముస్తాబైన వృక్షాలు, ప్రకృతి మాయకు పరవశించి పాడే కోకిల స్వరాలు, విరగ్గాసిన మామిడి చెట్ల అందాలతో ప్రకృతి నూతన శోభను సంతరించుకొంటుంది. ఒకరకంగా చూస్తే మనిషి జీవితం కూడా వసంత ఋతువు వంటిదే. చెట్ల చిగుళ్లు పుట్టుకకు, వాటికి కాసిన కాయలు అభివృద్ధికి, తీయని పండ్లు మధురానుభూతులు,  కోకిల స్వరాలు సానుకూల ఆలోచనలకు సంకేతాలు. మొత్తంగా చైతన్యంతో కూడిన నూతనత్వాన్ని ఈ పండుగ ప్రతీక. 

బ్రహ్మ ఉగాది సూర్యోదయ వేళనే సృష్టిని  మొదలుపెట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. వేదాలను కాజేసిన సోమకుడినే రాక్షసుడిని మత్స్యావతారంలో సంహరించిన శ్రీహరి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భాన్ని ఉగాదిగా జరుపుకొన్నట్లు మత్స్యపురాణం చెబుతోంది. తెలుగువారి మూలపురుషుడైన శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజూ ఇదేనని చరిత్రకారుల భావన. ఈ పండుగను మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు  అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.

పండుగ విధులు

 ఉగాదిరోజు వేకువనే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి సూర్యునికి నమస్కరించి, అర్ఘ్యం, ధూప దీపాలతో పూజించాలి. తర్వాత కొత్త సంవత్సరం పేరిట సంకల్పం చెప్పుకొని యధా శక్తి ఇంటిలో ఆరాధన చేసి పానకం, పెసరపప్పు వడపప్పు, వేపపూవు పచ్చడిని ను నివేదించాలి. తర్వాత వేపపూవు పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ఉదయం లేచింది మొదలు ఈ ప్రసాదం తీసుకొనే వరకు ఏ రకమైన ఆహారంమూ తీసుకోరాదు. తర్వాత రాగి, వెండి పంచలోహ లేదా మట్టి కుండను కలశంలా అలంకరించి నూతన వస్త్రాలతో బాటు పురోహితుడు లేదా గురువుకు దానం చేయాలి. దీనివల్ల కొత్త సంవత్సరంలో కోరికలన్నీ నేరువేరుతాయని నమ్మకం. ఈ రోజు విసనకర్రలను పేదలకు దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. సూర్యాస్తమయం తర్వాత ఆలయం వద్ద ఏర్పాటు చేసే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని కొత్త ఏడాదిలో తమ రాశి ఫలాలను తెలుసుకొంటారు.

ఉగాది విశేషాలు

ఈ రోజు ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకోవటాన్నిసంస్కృతంలో 'నిమ్బకుసుమభక్షణం' అంటారు. వసంతకాలంలో వచ్చే పలు రుగ్మతలకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. ఈ పచ్చడిని ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు తింటే రోగనిరోధక శక్తి పెరిగి, రానున్న వేసవిలో ఎలాంటి అనారోగ్యాలు రావని పెద్దలు చెబుతారు. పేరుకు ప్రసాదమే అయినా.. నిజానికి ఇది మనిషి జీవితంలో ఎదురయ్యే పలు అనుభూతులకు ప్రతీక. జీవితంలో పొందే సంతోషానికి తీపి, కష్టానికి చేదు, అవమానానికి కారం, బాధలకు ఉప్పు, ఇలా వచ్చి ఇలా వెళ్లే సమస్యలకు పులుపు, అపజయాలకు వగరు గుర్తులుగా నిలుస్తాయి. పచ్చడిలోని రుచుల్లాగే నిజ జీవితంలో ఈ అనుభవాలను సమన్వయం చేసుకొని ఆశావాదంతో జీవితాన్ని కొనసాగించాలని గుర్తించాలి. ఉగాది సాయంత్రం జరిగే పంచాంగ శ్రవణం ఒక ప్రత్యేక కార్యక్రమం.  తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంశాల సమాహారమైన పంచాంగ శ్రవణం వల్ల సంపద,దీర్ఘాయువు, పాప,రోగ విముక్తి, విజయం సిద్ధిస్తాయనీ, ఈ ఫలితాలను బట్టి ముందునుంచే మరింత జాగరూకతతో వ్యవహరించే వీలుంటుందని పెద్దలు చెబుతారు. 

చివరగా.. భిన్నమైన అనుభవాలను అందించిన దుర్ముఖికి వీడ్కోలు చెప్పి ఆశావహదృక్పథంతో హేవళంబి నామసంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. ఈ శుభతరుణంలో అందరికీ శుభాలు చేకూరాలని మనసారా కోరుకుంటూ..  మీ అందరికీ శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE