• HOME
  • భక్తి
  • అరుదైన పుణ్యక్షేత్రం.. శ్రీకూర్మం

దశావతారాల్లో రెండవది కూర్మావతారం. క్షీర సాగర మథన సమయంలో కూర్మావతారాన్ని ధరించిన విష్ణుమూర్తి అదే రూపంలో దర్శనమిచ్చే దివ్య క్షేత్రం.. శ్రీ కూర్మం. దేశంలో ఇలాంటి క్షేత్రం మరొకటి లేదు. కృతయుగం నాటి ఆది కూర్మనాధుడే కలియుగాన ఈ క్షేత్రంలో కూర్మనాథునిగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి తన మెడలోని సాలగ్రామ మాలతో సహా ఇక్కడ స్వయంవ్యక్తమూర్తిగా వెలిశారనీ, ఈ స్వామిని ఈ ఆరాధిస్తే పునర్జన్మ ఉండదనీ, ఈ క్షేత్రదర్శనంతో అమరావతి, కాశీ పుణ్య క్షేత్రాలకు యాత్రా ఫలితం లభిస్తుందని చెబుతారు. మార్కండేయ, పద్మ, బ్రహాండపురాణాల్లో ఈ క్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది. 

స్థల పురాణం

పూర్వం శ్వేత చక్రవర్తి ఈప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన భార్య విష్ణు ప్రియ. ఆమె విష్ణు భక్తురాలు. ఒకనాడు ఆమె ఏకాదశి వ్రతంలో ఉండగా రాజు కామంతో రతికోసం బలవంతపెట్టగా ఇది సమయం కాదని ఆమె వారిస్తుంది. ఆయినా రాజు వినకపోవడంతో ఆమె విష్ణువును ప్రార్థించగా ఆయన వారిద్దరి మధ్య తన గంగను ప్రవహింపజేశాడు. ఆ ప్రవాహం ధాటికి చక్రవర్తి కొట్టుకుని పోగా రాణి సైతం ఆయన వెంట పోగా వారిద్దరూ శ్వేతగిరిపైకి చేరతారు. అప్పుడే వారికి నారద మహర్షి కనిపించి శ్రీకూర్మ మంత్రోపదేశం చేస్తాడు. రాజు తపస్సుగా ఆ మంత్రాన్ని జపించగా విష్ణుమూర్తి కూర్మ రూపంలో దర్శనమిస్తాడు. తప్పస్సు కారణంగా రాజు శరీరం బాగా కృశించిపోవటం చూసిన కూర్మనాథుడు దిక్కులు పిక్కటిల్లేలా చేసిన హూంకరింపుకు రాజ దంపతులున్న శ్వేతాచలం భూమిలోకి కుంగి నివాసయోగ్యంగా మారగా, ఆయన సుదర్శన ప్రయోగంతో అక్కడ పెద్ద సరస్సు ఏర్పడింది. ఇందులో రాజు స్నానం చేసి సంపూర్ణారోగ్యాన్ని పొందాడు. నాటినుంచి ఈ సరస్సుకు శ్వేత పుష్కరిణి అనే పేరు వచ్చింది. అప్పటి నుంచీ కూర్మనాధుడు ఇక్కడే స్థిరపడిపోయాడు. 

ఆలయ విశేషాలు

సాధారణంగా ఏ ఆలయంలోనైనా మూలవిరాట్టు గర్భాలయ మధ్య భాగాన ఉంటారు. అయితే ఈ ఆలయంలో స్వామి గర్భాలయపు ఎడమ గోడను ఆనుకొని, పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తాడు. అడుగు ఎత్తు, 5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గల రాతిపీఠంపై రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో కూర్మనాథుడు దర్శనమిస్తాడు. తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. ఈ మూర్తిని ఎప్పుడూ చందనపు పూతతో అలంకరిస్తారు. ఇతర వైష్ణవ ఆలయాలకు భిన్నంగా ఇక్కడ భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకోవటం ఇక్కడి మరో ప్రత్యేకత. ఇక్కడి ఆలయపు 108 నల్లరాతి స్తంభాలలో ఏ ఒక్కటీ మరోలా ఉండక పోవడం ఒక విశేషమైతే.. సంప్రదాయానికి భిన్నంగా ఈ ఆలయంలో 2 ధ్వజస్తంబాలు ఉండటం మరో విశేషం. సింహాచలంలోని కప్పు స్తంభం మాదిరిగా ఈ ఆలయంలోని ఇచ్ఛాప్రాప్తిస్తంభాన్ని కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయని శాసనాలు తెలియజేస్తున్నాయి. విశాలమైన నిర్మించిన లోతైన తటాకం, మధ్య భాగంలో నిర్మించిన మంటపం నాటి పాలకుల కళా దృష్టికి తార్కాణాలుగా నిలుస్తాయి. ఇక్కడి పుష్కరిణిలో లెక్కకు మించిన పెద్ద పెద్ద తాబేళ్లు కనిపిస్తాయి. 

చారిత్రక విశేషాలు, ప్రత్యేకతలు

క్రీ. శ రెండవ శతాబ్దం లో నిర్మితమైన ఆ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల శిష్యులైన శ్రీనరహరితీర్ధులు, అష్టపదులను రచించిన జయదేవుడు, చైతన్య ప్రభువు, శ్రీనరహరితీర్థులు, శ్రీనాధమహాకవి, శ్రీకృష్ణదేవరాయలువంటి ప్రముఖులు ఈ స్వామిని సేవించినట్లు చరిత్ర చెబుతోంది. ఏడవ శతాబ్దంలో ఈ ఆలయం గొప్ప వైభవాన్ని పొందినట్లు శాశనాలను బట్టి తెలుస్తోంది. చోళ, తూర్పు కళింగ, విజయనగర, గజపతి, తూర్పు గంగ పరిపాలకుల పాలనకు గుర్తుగా ఇక్కడి స్తంభాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి, ప్రాకృత భాషల శాసనాలు కనిపిస్తాయి. ఈ క్షేత్రం పంచలింగారాధ్య క్షేత్రం. అంటే ఐదుగురు శివులు క్షేత్రపాలకులై స్వామిని ఆరాధిస్తున్నారు. వంశధార సాగర సంగమ ప్రాంతమైన కళింగపట్నంలో కర్పూరేశ్వరుడు, పడమర సింధూర పర్వతంపై (సింగుపురం కొండ) హటకేశ్వరుడు, దక్షిణాన నాగావళి తీరాన (శ్రీకాకుళ పట్టణం) రుద్ర కోటేశ్వరుడు, ఉత్తరాన పిప్పల (ఇప్పిలి) గ్రామంలో సుందరేశ్వరుడు, శ్రీకూర్మ సుధాకుండ తీర్థంలో పాతాళ సిద్ధేశ్వరుడు కొలువై ఉన్నారు. ఏటా ఫాల్గుణ మాసంలో కూర్మనాథునికి జరిగే డోలోత్సవం, వైశాఖ మాసంలో సప్త మి నుంచి పూర్ణిమ వరకు జరిగే కళ్యాణోత్సవాలు చూసి తీరవలసిందే. 

సమీప యాత్రా స్థలాలు

శ్రీకూర్మానికి 15 కిలోమీటర్ల దూరంలో గల అరసవిల్లిసూర్య దేవాలయం ఉంది. ఇక్కడికి దగ్గర్లోని శాలిహుండం, దంతపురి వంటి బౌద్ధారామ క్షేత్రాలు, శ్రీముఖలింగం తప్పక దర్శించదగ్గవి.

రవాణా, వసతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా గార మండలంలో గల శ్రీ కూర్మం శ్రీకాకుళం పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళం నుంచి ఇక్కడికి బస్సు, ప్రయివేటు వాహనాలు ఉంటాయి గనుక రవాణాకు ఇబ్బంది లేదు. రైలు ప్రయాణీకులు శ్రీకాకుళం రోడ్‌ (ఆముదాల వలస) దిగి అక్కడి నుంచి శ్రీకూర్మ క్షేత్రం చేరుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ వసతి సౌకర్యం ఉండదు గనుక భక్తులు శ్రీకాకుళంలో తగిన వసతి చూసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE