రామభక్తుడైన తులసీదాసు నాటి వాడుక భాషైన అవధి యాసలో హనుమంతునిపై ఆశువుగా చెప్పిన 40 దోహాల సమాహారమే హనుమాన్ చాలీసా. హనుమ జీవన విశేషాలు, సాధించిన విజయాలు, ఆయన వ్యక్తిత్వపు  గొప్పదనాలను క్లుప్తంగా, ఆకట్టుకొనేలా తులసీదాసు వర్ణించిన తీరు నిజంగా అద్భుతం. వందలాది ఏళ్లుగా భక్తుల పాటిటి కల్పవృక్షంగా కొనియాడబడుతున్న హనుమాన్ చాలీసా ఆవిర్భావం ఎక్కడ, ఎలా జరిగిందో తెలుసుకొందాం.  

ఇదీ కథ

పవిత్ర క్షేత్రమైన వారణాసి పట్టణంలో క్రీ. శ 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాసు అనే సాధువు ఉండేవారు. నిరంతరం రామనామ స్మరణలో ఉండేవాడు. పామరులకు అర్ధమయ్యే హిందీలో ‘రామచరితమానస్’ పేరిట రామ చరితను రచించిన  ఆయనను ప్రజలు అపర వాల్మీకిగా భావించేవారు. తులసీదాసు రచనల, బోధనల ప్రభావం వల్ల ఎందరో అన్యమతస్తులు రామభక్తులయ్యారు. ఈ మార్పు ముస్లిం మతపెద్దలకు కంటగింపుగా మారటంతో  వారు తులసీదాస్ మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నాడని చక్రవర్తి అక్బర్ కు ఫిర్యాదులు చేసినా అయన అక్బర్ అంతగా పట్టించుకోలేదు. 

కొంతకాలానికి.. వారణాశిలో దయళువుగా పేరున్నధనికుడు తన ఏకైక కుమారునికి చక్కని కన్యతో వివాహం చేసాడు. అయితే దురదృష్టవశాత్తూ వివాహమైన కొద్దిరోజులకే ఆ ధనికుడి కుమారుడు  కన్నుమూస్తాడు. అంత్యక్రియలకు అతని మృతదేహాన్ని బంధుమిత్రులు స్మశానానికి తీసుకుపోతుండగా, భర్త మరణాన్ని తట్టుకోలేని అతని భార్య గుండెలు  బాదుకొంటూ  శవయాత్రను అనుసరిస్తూ మార్గమధ్యంలో తన కుటీరం ముందు కూర్చొన్న తులసీదాసు కనిపించగా ఆయన పాదాలపై పడి విలపిస్తుంది. ఆయన ఆ యువతిని లేవనెత్తి సుమంగళిగా జీవించమని ఆశీర్వదించగా ఆమె శవయాత్రను చూపి జరిగినది వివరిస్తుంది. అప్పుడు తులసీదాసు ఆమెకు అభయమిస్తూ, వెళ్లి శవయాత్రను ఆపించి  శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని నీటిని చల్లగానే మరుక్షణం ఆ చనిపోయిన యువకుడు లేచి కూర్చుంటాడు. ఈ సంఘటన గురించి విన్న జనమంతా మతాలకతీతంగా తులసీదాసు శిష్యులుగా మారటం మొదలవుతుంది. 

తులసీదాసు ప్రాభవం కొనసాగితే ఇస్లాం మిగలదంటూ మత పెద్దలు ఢిల్లీలో అక్బర్ మీద ఒత్తిడి తేవటంతో విచారణ  కోసం తులసీదాసును తన మందిరానికి పిలిపిస్తాడు. ఈ సందర్భంగా రామ నామ విశేషాన్ని, రాముని ధర్మ నిరతిని తులసీదాసు పాదుషాకు వివరిస్తాడు.దీనికి బదులుగా అక్బర్ ఒక శవాన్ని తెప్పించి ' మీరు చెప్పినవన్నీ నిజమని నమ్మాలంటే మీరు ఈ శవాన్ని బతికించాల'నీ, లేకుంటే మరణశిక్ష తప్పదని ఆదేశిస్తాడు. రామాజ్ఞ మేరకే అంతా జరుగుతుందనీ, ఆ యువకుడిని బతికించటమూ రాముని లీలేనని, రామాజ్ఞకు భిన్నంగా రాజాజ్ఞను పాటించలేనని తులసీదాసు తేల్చిచెప్పగా, ఆగ్రహించిన పాదుషా తులసీదాసును బంధించమని ఆదేశిస్తాడు. 

 అప్పుడు తులసీదాస్ ధ్యానమగ్నుడై రాముని స్మరించి, సమస్యను పరిషరించమని ప్రార్థించగా,  మరుక్షణం ఆ సభలోకి వేలాది కోతులు దూసుకొచ్చి తులసీదాసును బంధింప వచ్చిన సైనికుల ఆయుధాలను లాక్కొని  వారిపై గురిపెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జరిగినదానికి అందరూ తెల్లబోయి చూస్తుండగా, కన్నులు తెరచిన తులసీదాసుకు హనుమ దర్శనం ఇస్తాడు. సాధారణ భక్తుడైన తనను కాపాడేందుకు సాక్షాత్తూ హనుమే తరలిరావటంతో ఒళ్ళు పులకించిన తులసీదాస్ కళ్ళవెంట ఆనందభాష్పాలు కార్చుతూ  40 దోహాల హనుమాన్ చాలీసాను ఆశువుగా గానం చేస్తాడు. 

ఆ స్త్రోతంతో మరింత ప్రసన్నుడైన హనుమ ఏదైనా వరం కోరుకోమని అడగగా, కష్టాల్లో ఉండి, ఈ చాలీసా చదివే భక్తులను నా మాదిరిగానే  కాపాడమని కోరుతాడు. ఈ విధంగా.. మునాటి నుంచి నేటి వరకు ‘హనుమాన్ చాలీసా’ రామ భక్తులపాలిట కామధేనువై నిలుస్తోంది. భక్తి, విశ్వాసం, వినయం, సాహసం, సత్యనిష్ఠ వంటి ఎన్నో సుగుణాలకు ప్రతీక అయిన ఆంజనేయుని స్తుతించి మనమూ ఆయన ఆశీస్సులు పొందుదాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE