• HOME
  • భక్తి
  • కమనీయం.. అప్పన్న చందనోత్సవం

      కృతయుగాన  శ్రీమన్నారాయణుడు భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు వరాహ, నారసింహ అవతారాల కలయికగా  వెలసిన దివ్యక్షేత్రం సింహాచలం. శ్రీ చందన పరిమళాలు, సంపెంగల సౌరభాలు, ప్రకృతి రమణీయతతో శోభిల్లే సింహాచల క్షేత్రం ఇతర నృసింహ క్షేత్రాలకు భిన్నమైనది. విశాఖ నగరంలో భాగంగా ఉన్న ఈ క్షేత్రం ఎన్నో మహిమాన్విత విశేషాలను, చారిత్రక ఘట్టాలను తనలో ఇముడ్చుకొని ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతోంది. మనదేశంలో ఇలాంటి క్షేత్రంగానీ, ఇక్కడి మూర్తిని పోలిన రూపంగానీ మరొకటిలేదు. భక్తవరదుడైన స్వామికి అక్షయ తృతీయనాడు జరిగే చందనోత్సవం విశేషాల గురించి తెలుసుకుకొని తరిద్దాం.

చందనోత్సవ విశేషాలు

 ఏడాదిలో 364 రోజులూ చందనపు  పూతలో దర్శనమిచ్చే సింహాచల వరాహ నృసింహ స్వామి ఒక్క..  వైశాఖ శుద్ధ తదియ(అక్షయ తృతీయ) రోజున మాత్రం నిజరూపదర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తాడు. దీన్నే చందన యాత్ర అంటారు. ఈ రోజు ఉదయాన్నే సుప్రభాత సేవ, నిత్యార్చనల అనంతరం బంగారు, వెండి బొరిగెలతో స్వామిపై ఉన్న చందనాన్నితొలగిస్తారు. నిజరూపంలోకి వచ్చిన స్వామి శిరస్సున, ఛాతిపైన చందనపు ముద్దలు ఉంచుతారు. అధికారులు ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకి తొలి దర్శన భాగ్యం కల్పిస్తారు. అక్షయ తృతీయనాటి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. అనంతరం ఆలయ సమీపంలోని గంగధార నుండి తెచ్చిన 1000 కడవల పవిత్ర జలాలతో స్వామికి అభిషేకం చేస్తారు.  అభిషేకాదులు ముగిశాక స్వామికి తొలి విడతగా మూడు మణుగుల శ్రీగంధాన్ని సమర్పించడంతో చందన యాత్ర ముగుస్తుంది.

చందన సేకరణ, అరగదీత 

ఏటా ఆలయ అవసరాల కోసం తమిళనాడు నుంచి మేలురకం గంధపు చెక్కలు కొనుగోలు చేస్తారు. అటవీ శాఖ అనుమతులతో  ఆలయానికి తెచ్చిఅధికారుల సమక్షంలో తూకం వేసి భాండాగారంలో భద్రపరుస్తారు. ఏటా చైత్ర బహుళ ఏకాదశినాడు గంధపు చెక్కల అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా మొదలవుతుంది. ముందుగా మూల విరాట్టు సన్నిధిలో పెట్టిన గంధపు చెక్కలకు పూజలు చేసిన అనంతరం ఆలయ వైదిక పెద్దలు తొలి చందనాన్ని అరగదీసి స్వామికి నివేదిస్తారు. అనంతరం ఆలయ ఉద్యోగులు గంధపు చెక్కల అరగదీత ప్రక్రియ మొదలవుతుంది. స్వామి వారి సంఖ్య 32. ఈ సంఖ్యకు, నరసింహస్వామికి అవినాభావ సంబంధం ఉంది. స్వామి అవతారాలు, నృసింహ మూల మంత్రంలోని అక్షరాల సంఖ్యా కూడా ముప్ఫయి రెండే. ఈ లెక్కనే తొలి విడతగా 32 కేజీల చెక్కలను అరగదీస్తారు. బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సానలపై 4 రోజుల పాటు ఉద్యోగులు గంధాన్ని అరగదీస్తారు. ఏ రోజుకారోజు అరగదీసిన గంధాన్ని తూకం వేసి అర్చకులు భాండాగారంలో భద్రపరుస్తారు. చందన యాత్రకు ముందు రోజు పూర్వం దుగ్గన బోయెడు స్వామి గాయానికి పూసిన గంధంలో వాడిన సుగంధ ద్రవ్యాలను, వన మూలికలను కలుపుతారు. ఏటా పలు పర్వదినాల్లో మొత్తం  సుమారు 500 కేజీల చందనాన్ని స్వామికి పై పూతగా వేస్తారు. అక్షయ తృతీయ రోజున తొలగించిన చందనాన్ని  ప్రసాదం రూపంలో  దేవస్థానం భక్తులకు విక్రయిస్తుంది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE