• HOME
  • భక్తి
  • భక్తవరదుడు.. వరాహ నృసింహుడు

తెలుగునాట గల నృసింహ క్షేత్రాల్లో సింహాచలానిది ప్రత్యేకస్థానం. అన్ని నారసింహ క్షేత్రాల్లో ప్రాచీనమైన ఈ క్షేత్రాన స్వామివారు వరాహ, నర, సింహ రూపాల కలయికగా దర్శనమిస్తాడు. తూర్పుకనుమల అంచున, సముద్రమట్టానికి 800 అడుగుల(244మీ)ఎత్తున నెలకొని ఉన్న సింహాచలం ప్రస్తుతం విశాఖపట్నంలో భాగమై ఉంది. ఇక్కడి శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి స్వయంభువు. స్వామిని భక్తులు సింహాద్రి అప్పన్నగా పిలుచుకుంటారు. కోరినవారికి కొంగుబంగారమని పేరున్న ఆ స్వామి విశేషాలను, ఈ క్షేత్ర మహత్తు గురించి తెలుసుకొందాం.

స్థలపురాణం

కృతయుగాన హరిద్వేషి అయిన హిరణ్య కశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని హరిభక్తితో విసిగిపోతాడు. ఎన్ని చిత్ర హింసలు పెట్టినా కుమారుడు హరినామ జపాన్ని మానకపోవటంతో  ప్రహ్లాదుని సముద్రంలోకి తోసి పెద్ద కొండను పైన మూతగా వేస్తాడు. తండ్రి ఘాతుకానికి భయపడ్డ ప్రహ్లాదుడు రక్షించమని హరిని  వేడుకోగా స్వామి గరుత్మంతునిపై వైకుంఠం నుంచి వాయువేగాన బయలుదేరతాడు. మార్గమధ్యంలో గరుడుడు అలసిపోవటంతో.. ప్రహ్లాదుని చేరటం ఆలస్యమవుతుందని భావించిన శ్రీహరి ఒక్కఉదుటున సముద్రం ఒడ్డున గల సింహగిరిపై అమాంతం దూకాడని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది.

 

మరోగాథ ప్రకారం..త్రేతాయుగంలో నాటి చక్రవర్తి పురూరవుడు తన ప్రేయసి ఊర్వశితో కలిసి ఆకాశయానం చేస్తూ సింహగిరిపైకి రాగానే వారి పుష్పక విమానం నిలిచిపోతుంది. ఊర్వశి తన దివ్యదృష్టితో ఆ క్షేత్రాన్ని సింహాచలంగా గుర్తించి పురూరవుడు స్వామివారిని వెతుకుతూ బయలుదేరతాడు. 3 రోజులైనా స్వామి  జాడ తెలియకపోవడంతో దిగులుచెందిన పురూరవుడు మరునాటి ఉదయం ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. ఆ రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి పక్కనే ఉన్న పుట్టలో ఉన్నానని చెప్పి గంగధారని గుర్తుగా సూచిస్తాడు. మరునాడు పక్కనే ఉన్న పుట్టలో గల మూర్తిని చూసిన రాజు 1000 కుండల నీటితో, పంచమృతాలతో అభిషేకం చేస్తాడు. అయినా స్వామి పాదాలు కనిపించకపోవటంతో కలత చెందగా ' స్వామి పాదాలు ప్రయత్నగోపితాలనీ, ఆయనను సేవించి శ్రీచందనాన్ని ఆచ్ఛాదింపజేసి, ఏడాదికి ఒక్కరోజు నిజరూప దర్శనం చేయమ'ని అశరీరవాణి పలుకుతుంది. నాటి నుండి స్వామి తనకు దర్శనమిచ్చిన అక్షయ తృతీయ నాడు స్వామి నిజరూప దర్శనం చేయాలని పురూరవుడు శాసనం చేసినట్లుగా తెలుస్తోంది.

 

దుగ్గన బోయ కథ

పురూరవుని కంటే ముందు 'దుగ్గన' అనే బోయ సింహాచల సమీపంలోని పోడు వ్యవసాయం చేసి కొర్రలు పండించేవాడట. అప్పన్న పదేపదే వరాహ రూపాన వచ్చి పొలంలోని కొర్రలు తినటంతో దుగ్గన ఒకనాడు  చెట్లమాటున నక్కి గింజలు తినేందుకు వచ్చిన వరాహాన్ని బల్లెంతో కొడతాడు. బల్లెం గాయంతో రక్తం ఓడుతున్న ఆ వరాహం పుట్టలోకి జొరబడగా... పాముపుట్టలోకి వరాహం వెళ్లటంమేమిటని దుగ్గన ఆ పుట్టపై మన్ను తొలగించి చూడగా రక్తం కారుతున్న వరాహ నృసింహుడు కనిపించాడట. అప్పుడు దుగ్గన పరుగున పోయి సింహగిరిపై లభించే వనమూలికలను చందనపు ముద్దతో రంగరించి స్వామికి పట్టువేసి స్వామి ఆదేశం మేరకు ఈ విషయాన్ని నాటి రాజు పురూరవుడికి తెలియజేసాడట. ఆ తర్వాతే పురూరవుడు ఇక్కడికి వచ్చి స్వామిని సేవించాడనే  మరో కథనం జనసామాన్యంలో ఉంది.

విశేషాలు

  • సింహాచల ఆలయ విశేషాల్లో ముఖ్యమైనది.. మహిమాన్విత కప్పస్తంభం. దీన్ని సంతాన గోపాలస్వామి యంత్రంపై ప్రతిష్ఠించడం వలన సంతానం లేని దంపతులు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకొంటే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.
  • శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయంలో అణువణువునా శిల్పకళా వైభవం ప్రతిఫలిస్తుంటుంది. ఆలయ గోడలపై చెక్కిన ఏనుగులు, గుర్రాలు, సింహాలు, అందమైన లతలు, నాట్యకత్తెల మూర్తులు నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆలయ స్తంభాలపై కనిపించే హిరణ్యకశిప సంహారం, త్రివిక్రమ గాధలను శిల్పాలుగా మలచిన తీరు నిజంగా అమోఘం. బేడా మండపంలోని స్తంభాలపైని 32 నారసింహ మూర్తులు చూపరులను కట్టిపడేస్తాయి.
  • నాటి విజయనగర పాలకుడైన శ్రీకృష్ణ దేవరాయలు స్వామికి సమర్పించిన గరుడపచ్చతో బాటు చోళ, చాళుక్య, గాంగ, ఒడ్డాదిమాత్యులు, నంద, పల్లవ, కొప్పుల నాయక, కోరుకొండ పాలకులు స్వామిని సేవించి సమర్పించిన కానుకలు, ఆలయ నిర్వహణకు చేసిన దానాలు, ఇతర ఏర్పాట్ల వివరాలు నేటికీ ఆలయ ప్రాంగణంలోని శాసనాలలో కనిపిస్తాయి.
  • సింహగిరిపైన పశ్చిమాభిముఖంగా ప్రవహించే గంగధారను సింహాచలేశుని ప్రతిరూపంగా భావిస్తారు. పశ్చిమాభిముఖుడై వెలసిన స్వామికి నిర్వహించే ప్రతీసేవలో, నివేదించే ప్రసాదాల తయారీకి ఈ జలాన్నే వినియోగిస్తారు. ఆలయ వంటశాలలో ఈ గంగధార ఒక పాయ నేటికీ ప్రవహిస్తోంది. రోజుకి 20 వేల లీటర్ల మేర వచ్చే ఈ నీటికి పలు ఔషధ గుణాలున్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఈ ధారకి అనుబంధంగా సింహగిరిలో మరో 12 ఉప జలధారలున్నాయి.
  • సింహాచలంపై అడుగడుగునా సంపెంగ చెట్లు కనిపిస్తాయి. భక్తులు సైతం సింహాచలేశునికి అత్యంత ప్రీతిపాత్రమైన సంపెంగ పూలను స్వామికి భక్తితో సమర్పిస్తారు.
  • ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమ ప్రకారం సేవలు జరుగుతాయి. ఆలయ వంటశాలలో శతాబ్దాల కాలంగా అగ్నిహోత్రం మండుతూనే ఉంటుం ది. ఇక్కడ తయారుచేసే ప్రసాదమంతా ముందుగా ఆలయంలోని స్వామికి నివేదించిన తర్వాతే భక్తులకు అందజేస్తారు.
  • కొండ దిగువ అడివివరం నడిబొడ్డున వరాహ పుష్కరిణి ఉంది. సకలపాపహారిణిగా చెప్పే ఈ పుష్కరిణిలో భక్తులు ముందుగా స్నానమాచరించి స్వామివారి సోదరిగా చెప్పే పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకుని కొండ ఎక్కటం ఆరంభిస్తారు. గంధం అమావాస్య, వైశాఖ పౌర్ణమి రోజులలో సముద్రతీర ప్రాంత వాసులు ఈ పుష్కరిణికి పూజలు చేస్తారు.
  • ఇక్కడి గంగపుత్రులు (జాలర్లు) సముద్రపు రాజు కూతురైన లక్ష్మిని తమ ఆడపడుచుగా, ఆమెను చేపట్టిన స్వామిని తమ అల్లునిగా భావిస్తారు. అందుకే స్వామి కళ్యాణానికి ముందు వధూవరులను తోడ్కొని వెళ్లే రథయాత్రకు వీరే సారథ్యం వహిస్తారు. ఇంతటి మహాభాగ్యం దక్కినందుకు జాలరులంతా తమ జన్మ ధన్యమైందని భావిస్తారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE