సమాజం అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నవేళ, అర్థంపర్థం లేని మతాలపేరిట సమాజం విడిపోయిన వేళ.. మసకబారిన  సనాతనధర్మాన్ని నిలిపి గెలిపించిన జ్ఞానజ్యోతి..అది శంకరులు. గురువు అనే మాటకు నిజమైన అర్థాన్నిచెప్పి ఈనాటికీ ఆ మాటకు ఒక గౌరవాన్ని కల్పించిన ద్రష్ట.  తన అద్వైత సిద్ధాంతంతో మనిషే  దేవుడని చాటిన గొప్ప సంస్కర్త. స్వార్ధ ప్రయోజనాలకోసం కట్టుబాట్ల పేరిట సమాజాన్ని విభజించే శక్తులను జ్ఞాన మార్గాన నడిపించిన మార్గదర్శి. వేదవేదాంగాలను అభ్యసించిన గొప్ప పండితుడు. తనవంటి ఎందరో శిష్యులను తయారుచేసి తన తర్వాతికాలంలోనూ సనాతనధర్మం నిలిచేలా చేసిన గొప్ప గురువు. జీవించింది కేవలం 32 సంవత్సరాలే ( క్రీ.శ.788-820) అయినా  వేల సంవత్సరాలకు సరిపడా ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి అందించిన మహాజ్ఞాని. నేటి శంకర జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవన విశేషాలను అవలోకిద్దాం. 

జీవన విశేషాలు

     వైశాఖ శుద్ధ పంచమి తిథి  నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు,శని,గురుడు,కుజుడు ఉచ్చస్థితి లో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురువులకు ఆదిశంకరులు జన్మించారు. కేరళ లోని పూర్ణానది ఒడ్డున ఉన్న 'కాలడి' ఆయన జన్మస్థలం. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన బాల శంకరుడికి బంధువుల సాయంతో తల్లి  ఉపనయనం చేయించి విద్యాభ్యాసానికి పంపుతుంది. 8 ఏళ్ళు నిండేసరికి శంకరుడు సకల విద్యా పారంగతుడవుతాడు. బాల భిక్షువుగా మధుకరం కోసం వెళ్లి, అక్కడి నిరుపేద ఇల్లాలి దయకు, నిస్సహాయస్థితికి  చలించి ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పి మహాలక్ష్మీ అనుగ్రహాన్ని నిరుపేద ఇంట బంగారు ఉసిరికల రూపాన కురిపిస్తాడు.  చిన్ననాట తల్లితో కలిసి నదీ స్నానానికి  వెళ్లగా మొసలి బాల శంకరుని కాలు పట్టుకొంటుంది. అప్పుడు ఒడ్డున దుఃఖిస్తున్న తల్లితో ' నా జీవితం ముగుస్తోంది గనుక నువ్వు అనుమతిస్తే ఈ క్షణంలో సన్యాసిగా మారతా'నని  కోరగా, ఆమె సరేనంటుంది.  ఆశ్చర్యంగా ఆమె అనుమతి ఇవ్వగానే మొసలి ఆయన కాలును వదిలిపెడుతుంది. అలా సన్యాసం దీక్షను స్వీకరించిన శంకరుడు తల్లి అనుమతితో దేశాటనకు బయలుదేరతాడు. 

లెక్కకు మించిన మతాలతో ప్రజలు ప్రాంత, వర్గాలుగా చీలి ఒకరిని ఒకరు దూషించుకుంటూ కాలాన్ని గడపటం చూసి శంకరులు తీవ్రంగా వ్యధ చెందారు. దీనికి పరిష్కారంగా శంకరుడు అద్వైతాన్ని ప్రతిపాదించాడు.  'అహం బ్రహ్మాస్మి', 'తత్వమసి' (ముందుగా మనలోని దైవాన్ని గుర్తించటం, ఆ తర్వాత ఎదుటివారిలో గల అదే దైవాన్ని దర్శించి తరించటం) అనే  బోధతో పలువురిని ఆకట్టుకున్నారు. శివ, విష్ణు, శక్తి, సౌర, గాణపత్య ఉపాసకులు పంచాయతన పూజ చేసేలా ప్రోత్సహించారు. ఏ బల ప్రయోగం లేకుండా దేశమంతా తిరిగి అక్కడి పండితులతో జరిగిన వాదనలో గెలిచి వారిని అద్వైతులుగా మార్చిన శంకరుడు ఆ తర్వాతి రోజుల్లో ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. ఆయనతో విభేదించి వారికి, తర్వాత కాలంలో ఆయన అనుయాయులైన వారికి కూడా ఈ భాష్యాలు మౌలిక వ్యాఖ్యా గ్రంధాలుగా ఉపయుక్తమయ్యాయి. దేశం నలుమూలలా... ఉత్తరాన బదరీనాథ్‌లో, పశ్చిమాన ద్వారకలో, తూర్పున పూరీలో, దక్షిణాదిన శృంగేరిలో పీఠాలు నెలకొల్పి తన ముఖ్య శిష్యులను పీఠాధిపతులుగా  చేశారు. ఇవి ఆ తర్వాతి కాలంలో సనాతనధర్మ వ్యాప్తికి దీప స్తంభాల్లా పనిచేశాయి.ఎవరిని పూజించినా, భక్తి ప్రధానమనీ, నదులన్నీ సాగరాన్ని చేరినట్లు చేసే పూజలన్నీ దైవానికే చెంది ఆయన అందరినీ అనుగ్రహిస్తాడని చెప్పి ప్రజల కనులు తెరిపించి 'జగద్గురువు'గా ప్రసిద్దిచెందారు. ఆసేతు హిమాచలం మూడుసార్లు పర్యటించి, తన బోధలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. దేశంలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరింపజేసి, సక్రమంగా పూజాదికాలు  జరిగే ఏర్పాట్లు చేశారు. 

ప్రతిభా విశేషాలు...

బాలుడిగా ఉన్నప్పుడు తల్లి పూర్ణా నదీ స్నానం కోసం మైళ్ళ కొద్దీ నడవటం చూసి బాధపడ్డ బాలశంకరుడు నదీమతల్లిని ప్రార్థిస్తూ చేసిన గంగాస్తవానికి ప్రసన్నురాలైన పూర్ణానది తన ప్రవాహమార్గాన్ని మార్చుకొని శంకరుల ఇంటి పక్కనుంచే ప్రవహించింది. 

ఒకరోజు వ్యాసుడు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో శంకరుని కలిసి శంకరులు వ్రాసిన భాష్యాలమీద 8 రోజులు చర్చిస్తాడు. 8రోజుల చర్చ తరువాత వచ్చినవాడు వ్యాసుడని శిష్యుడైన పద్మపాదుడు గ్రహించి  శంకరునికి  చెప్పగా ఆయన వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరతాడు. తన రచనలకు అసలు అర్థాన్ని గ్రహించినది శంకరుడు మాత్రమేనని వ్యాసుడు  ప్రసంసిస్తాడు.  

గొప్ప గురువుకే గొప్ప శిష్యులూ ఉంటారనటానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఒకప్పుడు శంకరులు కాశీలో గంగా స్నానం చేస్తూ నదికి  ఆవలి వైపు తడిబట్టలను ఆరవేస్తున్న శిష్యుడైన సనందుడిని రమ్మని  పిలవగా.... మధ్యలో నది ఉన్నదనే సంగతి మరచిన ఆ శిష్యుడు పరుగెత్తుకొంటూ శంకరుని చేరుకొంటాడు. అతని గురుభక్తి మెచ్చిన గంగాదేవి అతను నీటిపాలు అడుగేసిన ప్రతిచోటా ఒక పద్మాన్ని సృష్టించిన సంగతిని శంకరులు అడిగిన తర్వాత గానీ గుర్తించడు. ఈ ఘటన తర్వాతే సనందుడికి పద్మపాదుడనే పేరు వచ్చింది. 

జ్ఞాన సాధన ద్వారా మానవులకు మోక్షమార్గాన్ని చూపిన జగద్గురువుల జన్మదినాన ఆయన జీవన విశేషాలను నెమరువేసుకొని తరిద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE