ఆషాఢమాసపు బోనాల ఆధ్యాత్మిక శోభతో యావత్ తెలంగాణా వెలుగుతోంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, మహాంకాళి పేర్లతో గ్రామాల్లో పూజలందుకునే జగన్మాతకు ఆషాఢమాసంలో జనం భక్తితో నివేదించే భోజనమే బోనం. ఈ పండుగనే కొన్ని ప్రాంతాల్లో ‘ఆషాఢం జాతర’ అనీ అంటారు. గ్రామీణ దక్కనులో ఈ సంప్రదాయం శతాబ్దాలుగా ఉన్నా జంటనగరాల్లో మాత్రం 1869లో మొదలైనట్లు చెబుతారు. ఆ ఏడాది జంటనగరాల్లో ప్లేగుతో సంభవించిన జననష్టం నేపథ్యంలో అమ్మవారిని శాంతిపచేయడానికి నగరవాసులు బోనాలు నిర్వహించారట. అప్పటినుంచి ఏటికేడు రెట్టించిన ఉత్సాహంతో ఈ బోనాల వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఇతర ప్రాంతపు బోనాల కంటే జంట నగరాల బోనాల వేడుకలు ఎంతో ప్రత్యేకంగానూ కనిపిస్తాయి. 

ఇదీ వరస..

ఆషాఢమాసపు ఒక్కో ఆదివారం జంటనగరాల్లోని ఒక్కోచోట బోనాల వేడుక జరుగుతుంది. మొదటి ఆదివారం గోల్కొండలో కొలువై ఉన్న జగదాంబికా ఆలయంలో, రెండవవారంలో పాతబస్తీ లాల్ దర్వాజా సింహ వాహిని ఆలయాన, మూడోవారంలో సికిందరాబాద్ ( లష్కర్)లో కొలువైన ఉజ్జయినీ మహంకాళీ దేవాలయంలో, చివరి ఆదివారం నగరపు మిగిలిన ప్రాంతాల్లో ఈ బోనాల వేడుకలు జరుగుతాయి. 

8 వేడుకల పండుగ

బోనాల పండుగలో ఘటం, బోనాలు, వేపాకు సమర్పణ, ఫలహారంబండి, పోతురాజు విన్యాసం, రంగం, బలి, సాగనంపుట వంటి ప్రత్యేక ఘట్టాలుంటాయి.

  • వీటిలో తొలి వేడుక ఘటోత్సవం. అమ్మవారి రూపును కలశం మీద దిద్ది ఆవాహనచేసి తొలి రోజునుండి 14వ రోజు వరకూ రోజూ రెండుపూటలా నగరవీధుల్లో ఊరేగిస్తారు.
  • మరో ముఖ్యమైన ఘట్టం బోనాలు. బోనాల 15వ రోజు స్త్రీలు ఇళ్ళను శుభ్రపరచి, తలంటు స్నానం చేసి, కొత్తబట్టలు ధరించి మొక్కుకొన్న ప్రకారం అమ్మవారికి చక్కెరపొంగలి, బెల్లపు పొంగలి, కట్టెపొంగలి, పసుపు అన్నం వంటి అన్న నైవేద్యాలు చేసి అలంకరించిన పాత్రలో పెట్టి, వేపాకులతో చుట్టూకట్టి మూతపెట్టి, దానిపై గండదీపం వెలిగించి సిద్ధం చేస్తారు. అనంతరం భేరీ, తప్పెట, కొమ్ము వాద్యాలు మ్రోగుతుండగా బోనాలెత్తిన మహిళల బృందాలు ఆలయం చేరి అమ్మవారికి సమర్పిస్తారు.
  • బోనాల సందర్భంగా పసుపునీటిలో ముంచిన వేపాకును అమ్మవారికి సమర్పిస్తారు. వేపచెట్టును శక్తి స్వరూపంగా భావించటం, జోరువానల వల్ల అంటువ్యాధులు సోకకుండా వేపాకు ఔషధంలా పనిచేయటం ఈ ఘట్టానికి కారణాలు.
  • బోనాల్లో మరో ముఖ్య ఘట్టం ఫలహారంబండి. భక్తులు చేసిన నైవేద్యాలను పొట్టేళ్ల బండిలో పెట్టి బండితో సహా ఆలయానికి ప్రదక్షిణ స్తారు.
  • ఈ వేడుకల్లో అమ్మవారి సోదరుడుగా చెప్పే పోతరాజు వేషం ఎంతో ప్రత్యేకం. కాళ్ళకి గజ్జలు, ఒళ్ళంతా పసుపు పూసుకుని, పసుపు నీట ముంచిన ఎరుపు వస్త్రం ధరించి, కంటికి కాటుక, నుదుటి మీద కుంకుమ బొట్టుతో, నడుముకు వేపాకులు కట్టి, చేతిలో పసుపు రంగు కొరడా ఝుళిపిస్తూ, నాట్యంచేస్తూ ఫలహారం బండికి ముందు నడచి వచ్చే పోతరాజులకు భక్తులు నమస్కరిస్తారు. ఈ పోతరాజుల ఉరేగింపులో ఇంటింటా ఆగుతూ చిన్నారులను ఆశీర్వదిస్తూ సాగుతారు. పోతరాజుల ఆశీస్సులు పొందిన చిన్నారులు చక్కగా వర్ధిల్లుతారని భావిస్తారు.
  • బోనాల మరునాడు(సోమవారం) జరిగే వేడుకే.. రంగం. ఈ సందర్భంగా అమ్మవారి కోవెలలో మాతంగీశ్వరి సన్నిధిలో మట్టికుండ మీద నిలిచిన మాతంగి భవిష్యవాణి చెబుతుంది. రాబోయే రోజుల్లో సంభవించబోయే పలు మంచిచెడులు వివరాలను ప్రస్తావిస్తుంది.
  • రంగం ముగిశాక పోతురాజులు వీర తాండవం చేస్తూ భక్తి పారవశ్యంతో ఆలయ ప్రదక్షిణం చేస్తారు. ఈ సందర్భంలో సొరకాయ, ఎర్ర గుమ్మడికాయలు పగుల గొట్టి అమ్మవారికి బలి ఇస్తారు.
  • బోనాల్లో చివరి వేడుక అమ్మవారిని సాగనంపటం. బలి పూర్తికాగానే అమ్మవారి ఘట్టాన్ని ఏనుగు అంబారీ ఎక్కించి, మంగళ వాద్యాలతో నది లేదా కాలువ వరకూ ఊరేగింపు చేసి, ఘట అలంకారాలను నీటిలో వదిలి ఘట్టాన్ని తిరిగి ఆలయానికి చేర్చటంతో వేడుక పూర్తవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE